(ఫొటోలో వృత్తంలో వ్యక్తి గొర్రెల వెంకటరమణ)
► పిఠాపురంలో జన్మభూమి కమిటీల నిర్వాకం
► జీవించే ఉన్న 22 మందికి డెత్ సర్టిఫికెట్లు
► వారి భార్యలకు వితంతు పింఛన్లు మంజూరు
► కళ్లు మూసుకుని పంపిణీ చేసేస్తున్న అధికారులు
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మభూమి కమిటీ సభ్యుల విచ్చలవిడితనానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. బతికున్న పురుషులను మృతులుగా, వారి భార్యలను వితంతువులుగా మార్చేసి పింఛన్లు మంజూరు చేయిస్తున్నారు. పట్టణంలోని వెలంపేట 20వ వార్డుకు చెందిన గొర్రెల సత్యవతికి పింఛన్ ఐడీ నం: 104849039తో ఈనెల 6న వితంతు పింఛన్ పంపిణీ చేశారు. ఆమె భర్త వెంకటరమణ పట్టణంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన పాదగయ ట్రస్టుబోర్డు సభ్యుడు. రానున్న మహాశివరాత్రి ఏర్పాట్లలో భాగంగా ఆయన బుధవారం కూడా పనులు పర్యవేక్షించినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.
అదే వార్డుకు చెందిన డి.వీరలక్ష్మికి ఐడీ నం:104842867తో ఈనెల 3న వితంతు పింఛన్ పంపిణీ చేశారు. ఆమె భర్త సత్యనారాయణ బుధవారం కూడా వ్యవసాయ పనులకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అదే వార్డుకు చెందిన కె.అమ్మాజీకి ఐడీ నం:104842971తో ఈనెల 6న వితంతు పింఛన్ పంపిణీ చేశారు. ఆమె భర్త నాగేశ్వరరావు బుధవారం వ్యవసాయ పనులకు వెళ్లినట్టు స్థానికులు చెప్పారు. వీరంతా కొన్ని నెలల కిందటే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు ఇచ్చి, మున్సిపల్ అధికారులు వారి భార్యలను వితంతువులుగా పరిగణించి, పింఛన్లు పంపిణీ చేయడం గమనార్హం. ఇలా పిఠాపురం మున్సిపాలిటీలో జన్మభూమి కమిటీల ఆదేశాలతో అధికారులు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 22 మందిని బతికుండగానే చనిపోయినట్టు చూపి, వారి భార్యలకు వితంతు పింఛన్లు ఇచ్చేస్తున్నారని సమాచారం.
టీడీపీ కార్యాలయంలోనే లబ్ధిదారుల ఎంపిక
మున్సిపాలిటీలో 3,800 మంది వితంతు, దివ్యాంగ, వృద్ధాప్య, చేనేత, కల్లుగీత కార్మికుల పింఛన్లు ఉండగా ఇటీవల కొత్తగా 321 పింఛన్లు మంజూరు చేశారు. స్థానిక ముఖ్యనేత ఆదేశాల మేరకు జన్మభూమి కమిటీల పేరుతో ఇద్దరు తెలుగుదేశం నేతలు కొత్త పింఛన్ల లబ్ధిదారులను ఎంపిక చేసేశారు. గత రెండేళ్లుగా తమకు పింఛన్‌లు ఇవ్వాలని సుమారు 500 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వాటిని పట్టించుకోని రాజ్యాంగేతర శక్తులు టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులను ఎంపిక చేసేశారు.
నిబంధనలు, అర్హతలను పట్టించుకోకుండా తమ పార్టీ కార్యకర్త, ముఖ్యనేత అనుచరుడు అయితే చాలు పింఛన్ ఇచ్చేయాలన్న ఆదేశాలను మున్సిపల్ అధికారులు పాటించినట్టుగా కనిపిస్తోంది. పింఛన్ లబ్ధిదారుల ఎంపికలో జన్మభూమి కమిటీల పెత్తనం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోందని, అనర్హులు లబ్ధిపొందుతున్నారని ‘సాక్షి’ గతంలోనే కథనాలు ప్రచురించింది. అప్పుడు ‘సాక్షి’పై అక్కసు వ్యక్తం చేస్తూ ‘దమ్ముంటే నిరూపించా’లని చిందులు తొక్కిన అధికార పార్టీ నాయకులు ఇప్పుడేమంటారో!
జన్మభూమి కమిటీ జాబితా ప్రకారమే..
ఈ విషయంపై పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.రామ్మోహన్‌ను వివరణ కోరగా మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చిన వారికే వితంతు పింఛన్లు మంజూరు చేశామన్నారు. అయితే కొందరు బతికుండగా మరణ ధ్రువీకరణ పత్రం ఎలా ఇచ్చారని ప్రశ్నించగా జన్మభూమి కమిటీల ద్వారా వచ్చిన జాబితాలను బట్టి మంజూరు చేశామని, విచారణ జరిపిస్తామని చెప్పారు.