ఇంత నత్తనడకా!
పీఆర్‌కండ్రిగలో పనులపై సచిన్ ప్రతినిధుల అసహనం
గూడూరు టౌన్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామమైన పుట్టంరాజువారి కండ్రిగలో అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై ఆయన ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. సచిన్ ప్రతినిధుల బృందం బుధవారం గ్రామాన్ని పరిశీలించింది. గత ఏడాది నవంబర్ 16న పుట్టంరాజువారి కండ్రిగలో సచిన్ పర్యటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన గ్రామంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈక్రమంలో సచిన్ ప్రతినిధు లు మనోజ్‌వారియా, నారాయణన్ అభివృద్ధిపనులను పరిశీ లించారు. పనులు నత్తనడకన సాగడంతో పాటు సచిన్ రాక సందర్భంగా అధికారులు చెప్పిన పనుల్లో ఎక్కువభాగం మొదలు పెట్టకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేసారు.
స్టేడియం, కమ్యూనిటీ హాలు, శ్మశానవాటిక, ఆసుపత్రి భవనాల నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. సచిన్ వచ్చిన సమయంలో పూరింట్లో ఉంటున్న మొలకల శీనయ్య కుటుంబానికి పక్కాభవనం ఎక్కడ నిర్మించారని వాకబు చేశారు. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని సచిన్ ప్రతినిధులు ప్రశ్నించగా మూడు నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కోకోలు గోపాలయ్య, విజయమ్మ ఇళ్ల ప్రహరీలు, మరుగుదొడ్లను కూడా వారు పరిశీలించారు. ప్రతి ఇంటికి సచిన్ ఫొటోలతో కూడిన నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
దత్తత ప్రకటన చేసినప్పటి నుంచి తమ గ్రామానికి సంబంధించి పత్రికల్లో వస్తు న్న వార్తల క్లిప్పింగ్‌లను సచిన్ ప్రతినిధులకు సర్పంచ్ బుజ్జా నాగేశ్వరరావు చూపించారు. స్కూలులో కంప్యూటర్ తరగతులను వారి సమక్షంలోనే ప్రారంభించారు. బదిలీపై వెళ్లిన జేసీ రేఖారాణి సమకూర్చిన బ్యాగులు, పలకలు, పుస్తకాల ను ఏఆర్డీ సంస్థ ద్వారా ఆర్డీఓ రవీంద్ర అందజేశారు.
కలెక్టర్ జానకితో భేటీ
పుట్టంరాజువారి కండ్రిగకు వచ్చిన సచిన్ ప్రతినిధులు మొదట నెల్లూరులో కలెక్టర్ జానకిని మర్యాదపూర్వకంగా కలిశారు. స్మార్‌ట విలేజ్ కార్యక్రమంలో భాగంగా పంచాయతీలోని మరికొన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆమె కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గ్రామంలో పర్యటించిన సందర్భంగా పంచాయతీ పరిధిలోని గ్రామాలపై వారు ఆరా తీశారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలపై నివేదిక అందజే స్తే సచిన్ దృష్టికి తీసుకెళతామని వారు చెప్పినట్లు సమాచారం.