ఉద్యోగం ఊసేది..?
జిల్లాలో ఉద్యోగాలకు సంబంధించిన ఊసే లేకుండా పోయింది. శిక్షణ, ఉపాధి పేరుతో నిర్వహిస్తున్న రాజీవ్ యువకిరణాల పథకం అడ్రస్ గల్లంతైంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా రద్దుచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొనసాగుతున్న ఈ పథకంలో లోపాలు సరిచేసి కొత్త మెరుగులుదిద్ది ఎక్కువ మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం.. అమలులో ఉన్న పథకాన్ని నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒంగోలు టూటౌన్ : ఉద్యోగావకాశాలు కల్పించేం దుకు ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టాల్సిందిపోయి పాత పథకాలను కూడా రద్దుచే స్తుండటం, ఉన్న ఉద్యోగాలు తొలగించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అని చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తుచేసుకుని మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎన్నికల ముందు వరకూ అసలే అరకొరగా అమలవుతున్న రాజీవ్ యువకిరణాలు పథకం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్ధంతరంగా నిలిచిపోయింది. దీంతో ఆ పథకంపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టీడీపీ తీరుచూసి మళ్లీ ఆ పథకం కొనసాగుతుందన్న ఆశలు కూడా లేకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
దీనికితోడు జాబు కావాలంటే బాబు రావాలంటూ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ వెంటనే ఆదర్శ రైతులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు వేస్తూ పోతుండటంతో.. కొత్త ఉద్యోగాలు కల్పించాల్సిందిపోయి ఇదేంటం టూ నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు. అంతేగాకుండా నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువకిరణాలు పథకంపై కూడా వేటు వేసేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా 2011లో రాజీవ్ యువకిరణాలు పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జిల్లాలో డీఆర్‌డీఏ, మెప్మా, ఉపాధి కల్పనాశాఖ, గిరిజన సంక్షేమశాఖలు సమన్వయంతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నాయి. నిరుద్యోగులకు వివిధ ఉపాధి కోర్సుల్లో శిక్షణలు ఇప్పించడం, అనంతరం ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జిల్లాలోని పాత పురపాలక సంస్థలైన ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, చీరాలలో తొలుత రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ప్రవేశపెట్టారు.
అనంతరం ఏర్పడిన గిద్దలూరు, కనిగిరి, అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీలకు కూడా విస్తరించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుద్యోగికి ఉచిత భోజన వసతితో పాటు నివాస సౌకర్యం కల్పించి శిక్షణ ఇచ్చారు. పథకం ప్రారంభం నుంచి దాదాపు 3,545 మంది నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించారు. వారిలో కొంతమందికి జీతం సరిపోకపోవడం, ఇతర కారణాల వల్ల ఉద్యోగాలు మానేయగా ఇంకొంతమంది అవే ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ యువకిరణాలు పథకం కింద జిల్లాలోని నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే 17 సంస్థలను రద్దు చేసింది.
పథకంలో కొన్ని లోపాలున్నమాట వాస్తవమే అయినప్పటికీ వాటిని సరిదిద్ది పథకాన్ని విజయవంతంగా అమలుచేయాల్సింది పోయి అసలుకే మోసం జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం నిరుద్యోగులకు మింగుడుపడటం లేదు. ఈ పథకం కింద ఈ ఏడాది నిరుద్యోగుల ఎంపిక, శిక్షణ, ఉపాధి అవకాశాలు వంటివి నిర్వహించరాదని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఇటీవల జిల్లా అధికారులకు ఆదేశాలు రావడంతో పథకాన్ని పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో టీడీపీ ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పట్టణ పేదరిక నిర్మూలన కలగానే మిగిలే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి నుంచి నిరుద్యోగులను గట్టెక్కించేందుకు బాబు సర్కార్ ఏం చేస్తుందో వేచి చూడాలి.