self employement
-
జగనన్న వల్లే మేము ఆర్థికంగా ఎదిగాము.. ప్రభుత్వ సహకారంతో చిరుధాన్యాల వ్యాపారం చేస్తున్నాం..!
-
ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేని బీమా..
హైదరాబాద్: స్వయం ఉపాధిలోని వారిని దృష్టిలో ఉంచుకుని ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘ఐటర్మ్ ప్రైమ్ ఇన్సూరెన్స్’ ప్లాన్‌ను విడుదల చేసింది. వీరికి 10 శాతం ప్రీమియం తగ్గింపు ఇవ్వనుంది. 5 శాతం ఆన్లైన్ డిస్కౌంట్‌కు మరో 5 శాతం ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ తగ్గింపు మొదటి ఏడాది ప్రీమియంకే పరిమితం. కనీసం రూ.25 లక్షల సమ్ అష్యూర్డ్‌ను ఈ ప్లాన్ కింద పొందొచ్చని, గరిష్ట పరిమితి లేదని ఏగాన్ లైఫ్ ప్రకటించింది. ఏగాన్ లైఫ్ వెబ్ పోర్టల్ నుంచి, తన భాగస్వాముల నుంచి కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. పాన్‌కార్డు, ఆధార్ లేదా డ్రైవిండ్ లైసెన్స్ ఉంటే సరిపోతుందని.. ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదని, అప్లోడ్ కూడా చేయనవసరం లేదని, దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లో చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో ‘స్పెషల్ ఎగ్జిట్ వ్యాల్యూ’ ఆప్షన్ ఉందని, పాలసీదారు 55 ఏళ్ల వయసుకురాగానే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం అంతా వెనక్కి వస్తుందని పేర్కొంది. 99.03 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పరిశ్రమలో మెరుగైన స్థానంలో ఉన్నట్టు ప్రకటించింది. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ కవర్లను జోడించుకోవచ్చని తెలిపింది. (క్లిక్ చేయండి: వాహనాల తుక్కు ‘సింగిల్ విండో’లోకి 11 రాష్ట్రాలు) -
ఇంట్లో నా ప్రవర్తన నచ్చలేదు
హిజ్రాలు..చాలామందికి వారంటే ఒక చులకన భావం.. రకరకాల అభిప్రాయాలు.. దగ్గరకు వస్తే చాలు.. మొహం తిప్పేస్తారు.. అయితే.. మార్పు మొదలైంది.. ఒక సమంత, ఒక సహస్ర, ఒక శైలజ ఇలా ఎందరో ఆ మార్పు దిశగా.. జీవితంలో ఒక కొత్త వసంతం దిశగా కలసికట్టుగా ముందడుగు వేస్తున్నారు. తద్వారా తమలాంటి వారెందరికో మార్గదర్శులుగా నిలుస్తున్నారు.. ఇంతకీ ఎవరు వీళ్లు? ఇదంతా ఎలా జరిగింది? నా పేరు జాస్మిన్ ఆడపిల్లలాంటి నా ప్రవర్తన ఇంట్లో నచ్చలేదు. డిగ్రీ మధ్యలోనే ఆపేసి హైదరాబాద్‌కు వచ్చాను. ఓ కెమికల్ కంపెనీలో చేరాను. మగవాళ్ల వేధింపుల వల్ల పని మానేసి బిచ్చమెత్తాను. పడుపు వృత్తి చేశాను. కోవిడ్ వల్ల ఆ ‘ఉపాధి’కూడా పోయింది. ఒక్కసారిగా జీవితం తలకిందులైంది. ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధి ముద్రబోయిన రచన సహకారంతో 20 మంది హిజ్రాలం కలిసి ‘ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ’ని ఏర్పాటు చేసుకున్నాం. స్వయం ఉపాధితో జీవిస్తున్నాం. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) లాస్ట్ బెంచీలో కూర్చోబెట్టారు: సమంత మాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, ముక్కునూరు. చదువులో ఫస్టే అయినా నా ప్రవర్తన కారణంగా లాస్ట్ బెంచ్‌లో కూర్చోబెట్టారు. తోటి వారు హేళన చేశారు. స్కూల్‌కు వెళ్లలేకపోయాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌తోనే చదువు ఆపేశాను. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. ఇంట్లో నేను పెద్ద. కొన్నాళ్లు వ్యవసాయం చేశాను. మానేసి ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. చనిపోవాలనిపించింది. ఢిల్లీ, ముంబైలో గడిపి తిరిగి హైదరాబాద్‌కు వచ్చి ఆటో నడిపాను. ఇప్పుడు కూరగాయల దుకాణం పెట్టుకుని రోజుకు రూ.500 సంపాదిస్తున్నాను. దుబాయ్‌కి పంపించారు: శైలజ మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర తోకాడ గ్రామం. పెద్దగా చదువుకోలేదు. నాకు నచ్చినట్లు నేను ఉంటానంటే ఇంట్లో వాళ్లు తిట్టారు. నాలో మార్పు వస్తుందేమోననే ఉద్దేశంతో దుబాయ్‌కు పంపారు. అక్కడ మూడేళ్లు ఆఫీస్ బాయ్‌గా పని చేశాను. తిరిగి వచ్చిన తరువాత పెళ్లి ఏర్పాట్లు చేశారు. కానీ ఓ అమ్మాయి జీవితం పాడు చేయవద్దని ఇంటికి దూరంగా వెళ్లిపోయాను. 2010లో హైదరాబాద్‌కు వచ్చి భిక్షాటన చేశాను. జాస్మిన్ సహకారంతో ఇప్పుడు పచ్చళ్లు, పిండి వంటలు చేస్తున్నాను. ఖర్చులు పోను రోజుకు రూ.500 వస్తున్నాయి. హాస్టళ్లకు పచ్చళ్లు అందిస్తున్నాం. అనాథలా బతికాను: సహస్ర మాది భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్. నేను అనాథను.కొద్ది రోజులు హాస్టల్లో ఉండి చదువుకున్నాను. కానీ అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. మా ఇంటి దగ్గర ఉన్న ముంతాజ్ బేగం అనే అక్క చేరదీసింది. ఆ తరువాత కొంతకాలం ఇళ్లలో పని చేశాను. 2006లో హైదరాబాద్ వచ్చి రక రకాల పనులు చేశాను. నాలుగేళ్ల పాటు గాగిల్లాపూర్‌లోని ఓ పరిశ్రమలో పనిచేశాను. అక్కడా అవమానాలే. ఇప్పుడు సుందర్‌నగర్‌లో టీ స్టాల్ పెట్టుకున్నాను. రోజుకు రూ. 300 వస్తున్నాయి. ఆదరించి.. అండగా నిలిచి.. కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం, దయానందనగర్లలో పనిచేస్తున్న ‘నా పల్లె నా వెలుగు’, ఉమెన్ అండ్ ట్రాన్స్‌జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఎన్సీసీఐ వంటి స్వచ్ఛంద సంస్థలు 20 మంది హిజ్రాలకు అండగా నిలిచాయి. వారు తయారు చేసిన వస్తువులను ‘క్వికిల్స్’బ్రాండ్‌తో విక్రయిస్తున్నారు. ఒకరు టీస్టాల్ పెట్టుకున్నారు. కొందరు పచ్చళ్లు చేస్తున్నారు. ఇంకొందరు పాల వ్యాపారం చేస్తున్నారు. మరికొందరు మేకలు పెంచుకుంటున్నారు. పలువురు కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదుకుంటే మరింత గౌరవప్రదంగా బతుకుతామని ఆశగా అంటున్నారు. -
స్వయం ఉపాధిలో హిజ్రాలు..
-
రాజస్థాన్ టు నల్లగొండ
సాక్షి, నల్లగొండ టౌన్ : రాజస్థాన్ రాష్ట్ర నుంచి నల్లగొండ పట్టణానికి ఉపాధి కోసం వచ్చి యవకులు డిజిల్ ఇంజన్‌తో తయారు చేయించిన మొబైల్ చెరుకు బండ్లతో స్వయం ఉపాధి పొందుతున్నారు. రూ.50వేల పెట్టుబడితో సొంతంగా డిజిల్ మొబైల్ చెరుకు బండ్లను తయారు చేయించుకున్న యువకులు ప్రతి రోజు సుమారు రూ.3 వేల వరకు సంపాదిస్తున్నారు. ఖర్చులు పోను ప్రతి రోజు రెండు వేల వరకు సంపాదిస్తున్నారు,. వేసవికాలం సీజన్ ముగిసేంత వరకు వ్యాపారాన్ని కొనసాగిస్తూ తరువాత ఇతర సీజన్ వ్యాపారాలను చేసుకుంటున్నారు. సంపాదించిన డబ్బులను వారి స్వగ్రామాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు పంపిస్తూ వారికి కుటుంబాలకు ఆసరగా నిలుస్తున్న రాజస్థాన్ యువత ఆదర్శంగా తీసుకోవాలి. మంచి ఉపాధి పొందుతున్నాం.. నల్లగొండ పట్టణంలో మొబైల్ చెరుకు రసం బండ్లతో మంచి ఉపాధిని పొందుతున్నాము. వ్యాపారం బాగానే సాగుతోంది. ఈ సీజన్ ముగియగానే మరో సీజన్ వ్యాపారం చేస్తాం. నెలనెల సంపాదించిన డబ్బులను కొంత ఇంటికి పంపిస్తాం. వ్యాపారం బాగా ఉంది. – గోపాల్, రాజస్తాన్ -
‘రుణ’మెప్పుడో..!
ఆదిలాబాద్‌రూరల్: స్వయం ఉపాధి పథకంలో భాగంగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందజేసే రుణాల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తోంది. రుణాల మంజూరుకు ఇప్పటికైనా మోక్షం లభిస్తుందో లేదోనని ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో రుణాల పంపిణీ ప్రారంభమైనట్లే అయి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో కార్పొరేషన్ రుణాల పంపిణీకి ఎన్నికల కోడ్ అడ్డుగా మారడంతో చెక్కులు అందుబాటులో ఉన్నా పంపిణీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సబ్సిడీ రుణాలు అందించేందుకు ఎన్నికల కమి షన్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో లబ్ధిదారులు నిరాశ చెందారు. బీసీ కార్పొరేషన్లో 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో సుమా రు 2వేలకుపైగా వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ప్రభుత్వం 472 మందికి మాత్రమే అందజేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 15,800 మంది స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు. ఎస్సీ కార్పొరేషన్లో వివిధ రుణాల కోసం సుమారు 6,300 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందని ద్రాక్షే.. బీసీ కార్పొరేషన్ రుణాలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు తీసుకుందామని ఆశించిన వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలకు రెండు సార్లు మాత్రమే దరఖాస్తులు స్వీకరించారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అందులో కొందరికే రూ.లక్షలోపు రుణాలు అందజేసింది. వీటికి సంబంధించిన సబ్సిడీని 2018 మార్చిలో విడుదల చేసింది. జిల్లాలో సుమారు 472 మందికి రూ.80 వేల సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. అనంతరం 2016–17 ఆర్థిక సంవత్సరంలో రుణాలకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. 2017–18లో దరఖాస్తులు ఆహ్వానించి, అర్హులను గుర్తించినా ఫలితం లేకుండా పోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల లబ్ధిదారులు కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేసింది. మొదట ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులకు గడువు విధించింది. చాలామంది రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని బీసీ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరడంతో ఏప్రిల్ 21 వరకు గడువు పొడిగించి దరఖాస్తులు స్వీకరించారు. 2011 జనాభా లెక్కాల ప్రకారం జిల్లాలో సుమారు 2,70,321 మంది బీసీ జనాభా ఉండగా కార్పొరేషన్, ఫెడరేషన్ ద్వారా 15,800 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులను స్వీకరించకపోవడంతో నిరుద్యోగ బీసీ లబ్ధిదారులు ఆందోళన చెందారు. గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి 13వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారిని అర్హులుగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు గుర్తించారు. కాగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సుమారు 6,300 మంది లబ్ధిదారులు వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఏ ఒక్కరికీ మంజూరు ఇవ్వలేదు. కోడ్ ఎత్తి వేసి వారం రోజులు గడుస్తున్నా లబ్ధిదారులకు రుణాల మంజూరులో ఎలాంటి ప్రకటనలో రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 750 మందికి పంపిణీ జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా 15,800 లబ్ధిదా రులు వివిధ రుణాలకు ఫెడరేషన్, కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇందులో 13వేల మందిని లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. ఇందులో రూ.లక్ష లోపు యూనిట్లను కేటగిరి–1, రూ.లక్ష నుంచి రూ.2లక్షలలోపు యూనిట్లను కేట గిరి–2, రూ.2లక్షలకుపై యూనిట్లను కేటగిరి– 3గా నిర్ణయించారు. జిల్లాలో పూర్తిస్థాయిలో లబ్ధి దారులను గుర్తించేలోపు ఆగస్టు 15న రూ.50వేల యూనిట్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలో ఆగస్టు 15న 100 మందికి రూ.50 వేలు వంద శాతం సబ్సిడీపై చె క్కులను పంపిణీ చేశారు. రూ.లక్ష యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించి రూ.50 వేల యూనిట్లలోనికి మార్చి జిల్లా వ్యాప్తంగా 750 మందికి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మరో 1400 మందికి చెక్కుల పంపిణీ సిద్ధం చేసినా కోడ్ అమలులోకి రావడంతో పంపిణీకి బ్రేక్ పడింది. దీంతో సబ్సిడీ రుణా ల పంపిణీ నిలిచిపోయింది. రుణాల పంపిణీని ప్రారంభించకపోతే మళ్లీ జనవరిలో సర్పంచ్ల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి రుణాలు నిలిచిపోయే అవకాశం ఉందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఎస్సీ కార్పొరేషన్లో 6,566 మంది దరఖాస్తులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచి ఎస్సీ కార్పొరేషన్లో వివిధ రుణాల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తుల స్వీకరణ గడువును మూడు సార్లు పెంచారు. ఇప్పటి వరకు ఆయా రుణాల కోసం ఆన్లైన్లో 6,566 దరఖాస్తులు వచ్చిన్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఐటీడీఏ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ గిరిజనులకు అందజేసే రుణాలకు సంబంధించి కనీసం దరఖాస్తులను కూడా స్వీకరించలేదు. స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులను స్వీకరించేందుకు ఏప్రిల్‌లో ప్రణాళిక విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంతో అక్టోబర్‌లో విడుదల కావడంతో తాము నష్టపోవాల్సి వచ్చిందని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జనవరిలో సర్పంచ్ల ఎన్నికల కోడ్ ! ఆయా కార్పొరేషన్లలో స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు రుణాల పంపిణీలో జాప్యం జరిగితే జనవరిలో సర్పంచ్ల ఎన్నికలు జరగనున్నందున కోడ్ అమలులోకి వస్తే మళ్లీ రుణాల పంపిణీకి బ్రేక్ పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆలోపు అర్హత కలిగిన లబ్ధిదారులకు రుణాల పంపిణీ ప్రారంభిస్తే బాగుంటుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఈలోగా రుణాల పంపిణీ జరగకపోతే లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పేలా లేవని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. -
స్త్రీనిధి రుణం.. మహిళలకు వరం !
సాక్షి, నడిగూడెం : పొదుపు సంఘంలో సభ్యులుగా చేరి నెలసరి పొదుపు చేస్తూనే ప్రభుత్వం కల్పించిన స్త్రీ నిధి రుణాల ద్వారా స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటూ, సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారు పలు గ్రామాల మహిళలు. సంఘం ద్వారా వచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకుంటూ నెలసరి పొదుపు పాటిస్తూ ఉపాధి పొందుతున్నారు. స్వయం ఉపాధిపై దృష్టి.. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మంజూరైన స్త్రీ నిధి రుణాలతో పలువురు మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. కిరాణం, ఫ్యాన్సీ షాపులు, గొర్రెల పెంపకం, టైలరింగ్, గాజుల షాపులు ఇంకా పలు రంగాలను ఎంచుకొని లబ్ధిపొందుతున్నారు. స్వయం సహయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు చేసిన పొదపు సంఘం నిర్వహణను పరిగణలోకి తీసుకొని సంఘంలోని సభ్యులకు స్వయం ఉపాధి కల్పనకు రుణాలు మంజూరు చేస్తారు. ఒక్కో సంఘం పరిధిలో సభ్యులకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణంతో మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగలో యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. రూ. 1.69 కోట్లతో 445 మందికి రుణాలు.. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో స్త్రీనిధి పథకం కింద 445 మందికి రూ.1.69 కోట్లు ఇప్పటి వరకు రుణాలు సంబంధిత గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అందించారు. సకాలంలో తీసుకున్న రుణాలను చెల్లిస్తే మరికొంత మందికి స్వయం ఉపాధి కల్పనకు రుణాలు మంజూరు చేయనున్నారు. సమభావన సంఘాల మహిళలు క్రమం తప్పకుండా పొదుపు పాటించి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు. టైలరింగ్‌తో ఉపాధి పొందుతున్నా : స్త్రీ నిధి కింద రూ.50 వేలు రుణం పొందాను. దీంతో ఆ డబ్బులను వృథా చేయకుండా టైలరింగ్ షాపు నిర్వహించుకుంటున్నాను. దీంతో ఉపాధి పొందుతున్నాను. నా కుటుంబానికి ఆసరాగా ఉంది. స్త్రీ నిధి పథకం మాలాంటి మహిళలకు తోడ్పాటునందిస్తుంది. – కాసర్ల శశిరేఖ, నారాయణపురం పొదుపులు చేసుకుంటున్నాము.. స్త్రీ నిధి పథకం ద్వారా రూ.50 వేలు రుణం తీసుకున్నాను. ఆ డబ్బులతో గొర్రెలను పెంచుకుంటున్నాను. తీసుకున్న రుణంలో ఎప్పటికప్పుడు చెల్లించుకుంటున్నాను. అలాగే పొదుపులు కూడా ప్రతి నెలా చేసుకుంటున్నాము. మాలాంటి వారికి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉపయోగపడుతుంది. – నూకపంగు సామ్రాజ్యం, వల్లాపురం ప్రభుత్వ పథకాలనుసద్వినియోగం చేసుకోవాలి.. స్వయం సహయక సంఘాల కొరకు ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తుంది. సంబంధిత మహిళా సంఘాలు ఇలాంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. – రామలక్ష్మి, ఏపీఎం, గ్రామీణాభివృద్ధి సంస్థ, నడిగూడెం -
వ్యవస్థను మార్చారు
జోగినీ.. బసివినీ.. పేరు ఏదైనా రూపం ఒక్కటే. సమాజంలో తలెత్తుకుని జీవించలేని అసహాయ బతుకులు. ఎక్కడికెళ్లినా అవమానాలు.. ఛీత్కారాలు. ఆఖరుకు పొట్ట కూటి కోసం గౌరవంగా కూలి పనులు చేద్దామన్నా.. దక్కేవి కావు. బిడ్డలకు చదువులు ఆమడదూరం. ఒకవేళ బడిలో చేర్పిస్తే.. అంతులేని వివక్ష.. అవమానాలు! దీంతో బడి ముఖం చూడాలంటే పిల్ల లకు భయం. జిల్లా కర్ణాటక సరిహద్దున ఉన్న మండలాల్లో అనాదిగా వస్తున్న ఈ దురాచారంలో వందలాది మహిళలు మగ్గిపోయారు. కాలం మారింది. జోగినీల బతుకుల్లో మార్పు వచ్చింది. తమను జోగినీ, బసివినీలుగా మార్చే సంప్రదాయానికి మహిళలు చరమగీతం పాడారు. సమాజంలో గౌరవప్రద జీవనం సాగించేందుకు.. దేవుడి పేరుతో సాగుతూ వచ్చిన ఈ దురాచారాన్ని ఎదిరించారు. బొమ్మనహాళ్ : కరువు కాటకాలకు నిలయమైన అనంత జిల్లాలోని బొమ్మనహాళ్ మండలంలో ఒకప్పుడు జోగినీ వ్యవస్థ బలంగా ఉండేది. దేవుడి పేరుతో మహిళలను జోగినీ, బసివినీలగా మార్చే సంప్రదాయం ఈ ప్రాంతాల్లో అనాదిగా వస్తోంది. దాదాపు 150కి పైగా కుటుంబాలు ఈ వ్యవస్థలో మగ్గిపోతూ వచ్చాయి. వీరిలో కొన్ని కుటుంబాలు వంశపార్యంపరంగా వస్తుండగా, మరికొందరు పొట్టి కూటి కోసం మరో మార్గం లేక ఈ సంప్రదాయాన్ని ఎంచుకుని వచ్చారు. 2009 తర్వాత మార్పు.. జోగినీ వ్యవస్థలో కొనసాగుతున్న మహిళల పట్ల, వారి కుటుంబాల పట్ల సమాజం చిన్న చూపు చూసేది. వారు ఎక్కడికెళ్లినా ఛీత్కారాలు.. అవమానాలు ఎదురయ్యేవి. కనీసం వ్యవసాయ కూలీ పనులు సైతం వారితో చేయించేవారు కాదు. అంతులేని వివక్ష కారణంగా వారి పిల్లలకు సరైన చదువు సంధ్యలు ఉండేవి కావు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఆర్డీటీ సంస్థ తీవ్రంగా కృషి చేసింది. మహిళా సాధికారతతోనే ఈ వ్యవస్థకు చరమగీతం పాడేందుకు వీలవుతుందని భావించిన ఆర్డీటీ సంస్థ ఆ దిశగా 2009లో బొమ్మనహాళ్ మండలంలోని ఉంతకల్లులో కుట్టు శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పింది. జీన్స్ ప్యాంట్లు, జాకెట్లు, చిన్న పిల్లల డ్రస్సులు కుట్టడంపై ప్రత్యేక శిక్షణను అందించింది. శిక్షణ పూర్తి చేసుకున్న ఒక్కొక్కరికి రూ. పది వేలు విలువ చేసే కుట్టు మిషన్లను ఉచితంగా సంస్థ అందజేసింది. నెలకు రూ.9 వేల వరకు ఆదాయం తొలిదశలో 27 మంది మహిళలకు జీన్స్ ప్యాంట్లు కుట్టడంపై శిక్షణ పొందిన మహిళలు.. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బళ్లారి నుంచి కత్తిరించిన జీన్స్ ప్యాంట్ పీస్‌లను తీసుకువచ్చి కుట్టి ఇవ్వడం మొదలు పెట్టారు. పనిలో వారి నిబద్ధతను గమనించిన జీన్స్ పరిశ్రమల నిర్వాహకులు తామే నేరుగా కత్తిరించిన ప్యాంట్ పీస్‌లను ఇక్కడకు తీసుకువచ్చి ఇచ్చి, సిద్ధం చేయిస్తున్నారు. పీస్ వర్క్‌ను బట్టి ధర చెల్లిస్తున్నారు. ప్యాంట్ ముందు జేబులను కుడితే ఒక్కొక్క దానికి రూ. 5, మొత్తం ప్యాంట్ కుడితే రూ. 24 చొప్పునఅందజేస్తున్నారు. ఇలా రోజూ ఇంటి పట్టునే ఉంటూ రూ. 300 చొప్పున నెలకు రూ. 9 వేల వరకు ఒక్కొ మహిళ ఆర్జిస్తోంది. సంపాదించిన సొమ్ములో కొంత ఇంటి ఖర్చులకు పోను మిగిలినది పిల్లల చదువులకు ఖర్చు పెడుతున్నారు. వెలుగులు నింపిన ఆర్డీటీ అనాదిగా దురాచారానికి బలవుతూ వస్తున్న మహిళల జీవితాల్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) వెలుగు నింపింది. వ్యవస్థ మార్పునకు శ్రీకారం చుట్టింది. జోగినీలుగా పిలువబడే ఆచారాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలనే లక్ష్యంతో పలు సేవా కార్యక్రమాలను సంస్థ చేపట్టింది. జోగినీ వ్యవస్థలో మగ్గిపోతున్న వారి జీవనోపాధుల మెరుగుపడేందుకు ఉపాధి పనులు కల్పిస్తూ వచ్చింది. వ్యవసాయ కూలీ పనుల్లో వారిని భాగస్వామ్యులను చేసేలా సమాజంలో చైతన్యం తీసుకువచ్చింది. క్రమేణ వ్యవస్థలో మార్పు వచ్చింది. ఒకప్పుడు కూలీ పనులకు సైతం పిలవని వారు.. తర్వాతి కాలంలో వారితో పనులు చేయించుకోసాగారు. ఇందులో భాగంగానే వారికి మరింత గౌరవప్రదమైన జీవనం అందేలా చేసేందుకు కుట్టులో శిక్షణను ఆర్డీటీ సంస్థ అందించింది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుట్టు మిషన్లను ఉచితంగా అందజేసింది. నేడు ప్రతి ఇంటిలో ఆర్డీటీ అందజేసిన కుట్టు మిషన్లు నడుస్తున్నాయి. ఇంటి వద్దనే ఉపాధి ఆర్డీటీ అందించిన సహకారంతో కుట్టులో శిక్షణ పొంది ఇంటి వద్దనే ఉపాధి పొందుతున్నాం. జీన్స్ ప్యాంట్లతో పాటు మహిళల జాకెట్లు, పంజాబీ డ్రస్సులు కుడుతుంటాను. రోజుకు రూ.350 వరకు ఆదాయం ఉంటోంది. స్వయం ఉపాధితోనే కూతురికి పెళ్లి కూడా చేశాను. కుమారుడిని బళ్లారిలో ఇంటర్ చదివిస్తున్నాను. – శంకరమ్మ, ఉంతకల్లు ప్రభుత్వం ఆదుకోవాలి మహిళల జీవనోపాధులను పెంచేందుకు ప్రభుత్వం రాయితీతో రుణాలను ఇవ్వాలి. ఆధునిక హైస్పీడ్ కుట్టు మిషన్ల కొనుగోలుకు అవకాశం కల్పించాలి. అలాగే జీన్స్ ప్యాంట్ల కుట్టడంపై మరిన్ని మెలకువలు సాధించేందుకు అవసరమైన శిక్షణను ప్రభుత్వం అందించాలి.– శంకరమ్మ, ఉంతకల్లు జీవితం మారింది మేము వంశపార్యపరంగా జోగినీ వ్యవస్థకు చెందిన వారం. మా గ్రామంలోనే కాదు.. ఇతర ప్రాంతాలకూ వెళ్లినప్పుడు మమ్మల్ని మనుషులుగా చూసేవారు కాదు. చాలా నీచంగా వ్యవహరించేవారు. కనీసం కూలి పనులకు కూడా పిలిచేవారు కాదు. మా పిల్ల లను బడిలో చేరిస్తే.. వారి పట్ల వివక్ష చూపేవారు. దీంతో పిల్లలు బడికి వెళ్లేవారు కాదు. అయితే ఆర్డీటీ సంస్థ మా కోసం చాలా శ్రమించింది. జీన్స్ ప్యాంట్లు కుట్టడం నేర్పించి, ఉపాధి కోసం మరో ప్రాంతానికి వలస పోకుండా చేసింది. ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం వల్ల ఇంటి పట్టునే ఉంటూ జీన్స్ ప్యాంట్లు కుట్టి గౌరవప్రదంగా బతుకుతున్నాం. ఇప్పుడు మా జీవితం మారింది. మా పట్ల కాస్త గౌరవంగానే చూస్తున్నారు. – అంజినమ్మ, ఉంతకల్లు -
స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలి: డా. లక్ష్మణ్
కవాడిగూడ (హైదరాబాద్ సిటీ) : నిరుద్యోగ యువతీ యువకులంతా ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా తమ స్వశక్తితో స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించి నిలదొక్కుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. కవాడిగూడ డివిజన్ ఎస్బీఐ కాలనీలో పింటు, టింకు, రాజేష్‌లు నూతనంగా ఏర్పాటు చేసుకున్న శ్రీ మోహన్స్ ఛాట్ బండార్ దుకాణాన్ని ఎమ్మెల్యే లక్ష్మణ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారంతా కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా తమకిష్ఠమైన రంగంలో కానీ, ఇతర వ్యాపార రంగాల్లో స్థిపరపడేలా ఆలోచనలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్ రామ్, అశోక్‌కుమర్, సీహెచ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం ఊసేది..?
జిల్లాలో ఉద్యోగాలకు సంబంధించిన ఊసే లేకుండా పోయింది. శిక్షణ, ఉపాధి పేరుతో నిర్వహిస్తున్న రాజీవ్ యువకిరణాల పథకం అడ్రస్ గల్లంతైంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా రద్దుచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొనసాగుతున్న ఈ పథకంలో లోపాలు సరిచేసి కొత్త మెరుగులుదిద్ది ఎక్కువ మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం.. అమలులో ఉన్న పథకాన్ని నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒంగోలు టూటౌన్ : ఉద్యోగావకాశాలు కల్పించేం దుకు ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టాల్సిందిపోయి పాత పథకాలను కూడా రద్దుచే స్తుండటం, ఉన్న ఉద్యోగాలు తొలగించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అని చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తుచేసుకుని మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎన్నికల ముందు వరకూ అసలే అరకొరగా అమలవుతున్న రాజీవ్ యువకిరణాలు పథకం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్ధంతరంగా నిలిచిపోయింది. దీంతో ఆ పథకంపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టీడీపీ తీరుచూసి మళ్లీ ఆ పథకం కొనసాగుతుందన్న ఆశలు కూడా లేకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనికితోడు జాబు కావాలంటే బాబు రావాలంటూ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ వెంటనే ఆదర్శ రైతులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు వేస్తూ పోతుండటంతో.. కొత్త ఉద్యోగాలు కల్పించాల్సిందిపోయి ఇదేంటం టూ నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు. అంతేగాకుండా నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువకిరణాలు పథకంపై కూడా వేటు వేసేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా 2011లో రాజీవ్ యువకిరణాలు పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జిల్లాలో డీఆర్డీఏ, మెప్మా, ఉపాధి కల్పనాశాఖ, గిరిజన సంక్షేమశాఖలు సమన్వయంతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నాయి. నిరుద్యోగులకు వివిధ ఉపాధి కోర్సుల్లో శిక్షణలు ఇప్పించడం, అనంతరం ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జిల్లాలోని పాత పురపాలక సంస్థలైన ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, చీరాలలో తొలుత రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఏర్పడిన గిద్దలూరు, కనిగిరి, అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీలకు కూడా విస్తరించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుద్యోగికి ఉచిత భోజన వసతితో పాటు నివాస సౌకర్యం కల్పించి శిక్షణ ఇచ్చారు. పథకం ప్రారంభం నుంచి దాదాపు 3,545 మంది నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించారు. వారిలో కొంతమందికి జీతం సరిపోకపోవడం, ఇతర కారణాల వల్ల ఉద్యోగాలు మానేయగా ఇంకొంతమంది అవే ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ యువకిరణాలు పథకం కింద జిల్లాలోని నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే 17 సంస్థలను రద్దు చేసింది. పథకంలో కొన్ని లోపాలున్నమాట వాస్తవమే అయినప్పటికీ వాటిని సరిదిద్ది పథకాన్ని విజయవంతంగా అమలుచేయాల్సింది పోయి అసలుకే మోసం జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం నిరుద్యోగులకు మింగుడుపడటం లేదు. ఈ పథకం కింద ఈ ఏడాది నిరుద్యోగుల ఎంపిక, శిక్షణ, ఉపాధి అవకాశాలు వంటివి నిర్వహించరాదని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఇటీవల జిల్లా అధికారులకు ఆదేశాలు రావడంతో పథకాన్ని పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో టీడీపీ ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పట్టణ పేదరిక నిర్మూలన కలగానే మిగిలే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి నుంచి నిరుద్యోగులను గట్టెక్కించేందుకు బాబు సర్కార్ ఏం చేస్తుందో వేచి చూడాలి.