హిజ్రాలు..చాలామందికి వారంటే ఒక చులకన భావం.. రకరకాల అభిప్రాయాలు.. దగ్గరకు వస్తే చాలు.. మొహం తిప్పేస్తారు.. అయితే.. మార్పు మొదలైంది.. ఒక సమంత, ఒక సహస్ర, ఒక శైలజ ఇలా ఎందరో ఆ మార్పు దిశగా.. జీవితంలో ఒక కొత్త వసంతం దిశగా కలసికట్టుగా ముందడుగు వేస్తున్నారు. తద్వారా తమలాంటి వారెందరికో మార్గదర్శులుగా నిలుస్తున్నారు.. ఇంతకీ ఎవరు వీళ్లు? ఇదంతా ఎలా జరిగింది?
నా పేరు జాస్మిన్
ఆడపిల్లలాంటి నా ప్రవర్తన ఇంట్లో నచ్చలేదు. డిగ్రీ మధ్యలోనే ఆపేసి హైదరాబాద్‌కు వచ్చాను. ఓ కెమికల్ కంపెనీలో చేరాను. మగవాళ్ల వేధింపుల వల్ల పని మానేసి బిచ్చమెత్తాను. పడుపు వృత్తి చేశాను. కోవిడ్ వల్ల ఆ ‘ఉపాధి’కూడా పోయింది. ఒక్కసారిగా జీవితం తలకిందులైంది. ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధి ముద్రబోయిన రచన సహకారంతో 20 మంది హిజ్రాలం కలిసి ‘ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ’ని ఏర్పాటు చేసుకున్నాం. స్వయం ఉపాధితో జీవిస్తున్నాం.
(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
లాస్ట్ బెంచీలో కూర్చోబెట్టారు: సమంత
మాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, ముక్కునూరు. చదువులో ఫస్టే అయినా నా ప్రవర్తన కారణంగా లాస్ట్ బెంచ్‌లో కూర్చోబెట్టారు. తోటి వారు హేళన చేశారు. స్కూల్‌కు వెళ్లలేకపోయాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌తోనే చదువు ఆపేశాను. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. ఇంట్లో నేను పెద్ద. కొన్నాళ్లు వ్యవసాయం చేశాను. మానేసి ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. చనిపోవాలనిపించింది. ఢిల్లీ, ముంబైలో గడిపి తిరిగి హైదరాబాద్‌కు వచ్చి ఆటో నడిపాను. ఇప్పుడు కూరగాయల దుకాణం పెట్టుకుని రోజుకు రూ.500 సంపాదిస్తున్నాను.
దుబాయ్‌కి పంపించారు: శైలజ
మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర తోకాడ గ్రామం. పెద్దగా చదువుకోలేదు. నాకు నచ్చినట్లు నేను ఉంటానంటే ఇంట్లో వాళ్లు తిట్టారు. నాలో మార్పు వస్తుందేమోననే ఉద్దేశంతో దుబాయ్‌కు పంపారు. అక్కడ మూడేళ్లు ఆఫీస్ బాయ్‌గా పని చేశాను. తిరిగి వచ్చిన తరువాత పెళ్లి ఏర్పాట్లు చేశారు. కానీ ఓ అమ్మాయి జీవితం పాడు చేయవద్దని ఇంటికి దూరంగా వెళ్లిపోయాను. 2010లో హైదరాబాద్‌కు వచ్చి భిక్షాటన చేశాను. జాస్మిన్ సహకారంతో ఇప్పుడు పచ్చళ్లు, పిండి వంటలు చేస్తున్నాను. ఖర్చులు పోను రోజుకు రూ.500 వస్తున్నాయి. హాస్టళ్లకు పచ్చళ్లు
అందిస్తున్నాం.
అనాథలా బతికాను: సహస్ర
మాది భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్. నేను అనాథను.కొద్ది రోజులు హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. కానీ అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. మా ఇంటి దగ్గర ఉన్న ముంతాజ్ బేగం అనే అక్క చేరదీసింది. ఆ తరువాత కొంతకాలం ఇళ్లలో పని చేశాను. 2006లో హైదరాబాద్ వచ్చి రక రకాల పనులు చేశాను. నాలుగేళ్ల పాటు గాగిల్లాపూర్‌లోని ఓ పరిశ్రమలో పనిచేశాను. అక్కడా అవమానాలే. ఇప్పుడు సుందర్‌నగర్‌లో టీ స్టాల్ పెట్టుకున్నాను. రోజుకు రూ. 300 వస్తున్నాయి.
ఆదరించి.. అండగా నిలిచి..
కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం, దయానందనగర్‌లలో పనిచేస్తున్న ‘నా పల్లె నా వెలుగు’, ఉమెన్ అండ్ ట్రాన్స్‌జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఎన్‌సీసీఐ వంటి స్వచ్ఛంద సంస్థలు 20 మంది హిజ్రాలకు అండగా నిలిచాయి. వారు తయారు చేసిన వస్తువులను ‘క్వికిల్స్’బ్రాండ్‌తో విక్రయిస్తున్నారు. ఒకరు టీస్టాల్ పెట్టుకున్నారు. కొందరు పచ్చళ్లు చేస్తున్నారు. ఇంకొందరు పాల వ్యాపారం చేస్తున్నారు. మరికొందరు మేకలు పెంచుకుంటున్నారు. పలువురు కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదుకుంటే మరింత గౌరవప్రదంగా బతుకుతామని ఆశగా అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment