భూమి.. ఆకాశం.. తమకేదీ అడ్డుకాదని అన్నింటా సత్తాచాటుతున్న మహిళలకు రాజకీయాల్లోనూ ప్రాతినిధ్యం దక్కుతోంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన వీరికి రిజర్వేషన్ల పుణ్యమా అని అవకా శాలు అందివస్తున్నాయి. మహిళా దినోత్సవం రోజునే ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని ‘ఆమె’ కు కేటాయిస్తూ పంచాయతీ రాజ్ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చే సింది. ఎంపీపీల్లోనూ జిల్లాలో 52కు గాను 28 స్థానాలు మహిళలకే కేటాయించడం శుభపరిణామం.
ఆదిలాబాద్
ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం ఈసారి బీసీ మహిళకు కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అన్ని మండలాల జెడ్పీటీసీల రిజర్వేషన్లను శుక్రవారం రాత్రే ప్రకటిం చగా.. తాజాగా చైర్మన్ స్థానం రిజర్వేషన్ ఖరారైం ది.
జిల్లా పరిషత్‌తోపాటు, అన్ని మండల పరిషత్ ల పాలకవర్గాల పదవీకాలం 2011 జూలైతో ముగి సింది. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలనతోనే సరిపెడుతూ వచ్చింది. వీటికి ఎన్నికలు నిర్వహించకుండా దాదాపు మూడేళ్లుగా నాన్చుతూ వచ్చింది. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఒక్కసారిగా కదలిక వచ్చింది.
పార్టీలకు ముచ్చెమటలు..
స్థానిక సంస్థల స్థానాలకు రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు జిల్లా పరిషత్‌పై దృష్టి సారించాల్సిన పరిస్థితి
- ఏర్పడింది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ముఖ్య నాయకులంతా ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ల ప్రయత్నాల్లో మునిగిపోయారు. మున్సిపల్ ఎన్నికల నగరా కూడా మోగడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, టిక్కెట్ల కేటాయింపులు వంటి అంశాలపై దృష్టి సారించాయి. ఇప్పుడు మండల, జిల్లా పరిషత్‌లకు కూడా ఎన్నికలు రావడంతో అన్ని పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయి. చైర్మన్ స్థానానికి రిజర్వేషన్‌పై స్పష్టత రావడంతో ఆయా పార్టీల్లో బీసీ మహిళా నేతలెవరున్నారనే అంశంపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాయి. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలుపొందడం ఒకెత్తయితే, విజయం సాధించిన జెడ్పీటీసీల మద్దతు కూడగట్టుకుని చైర్మన్ పదవిని దక్కించుకోవడం మరోఎత్తు. అదేవిధంగా జిల్లాలోని ఎమ్మెల్యేలను కలుపుకుని పోగలిగే సత్తా కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున గ్రూపు విభేదాలున్నాయి. అన్ని గ్రూపుల మద్దతు కూడగట్టుకునే రాజకీయ చతురత కలిగిన మహిళా నేతలు ఎవరెవరుంటారనే విషయమై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మొదట టిడీపీ.. తర్వాత కాంగ్రెస్...
జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం గతసారి ఎస్టీలకు రిజర్వు అయింది. టీడీపీకి చెందిన రమేష్‌రాథోడ్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేసి గెలుపొందడంతో జెడ్పీ చైర్మన్ స్థానం ఖాళీ అయింది. అప్పట్లో వైస్ చైర్మన్‌గా ఉన్న జుట్టు అశోక్ ఇన్‌చార్జి చైర్మన్‌గా వ్యవహరించారు. తర్వాత జెడ్పీ చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కౌటాల జెడ్పీటీసీగా గెలుపొందిన సిడాం గణపతి టీడీపీ జెడ్పీటీసీల మద్దతుతో జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోగలిగారు.