'నేను ముందుగా సాక్షి పత్రికే చదువుతా'
ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు
సాక్షి, విశాఖపట్నం: ‘నిద్ర లేవగానే నేను పేపర్లు చదవుతా.. ముఖ్యంగా ‘సాక్షి’ పత్రికనే ముందు చదువుతా.. మా పార్టీ వాళ్లు ఈనాడు, జ్యోతి చదవమంటారు. సాక్షి చదవొద్దంటారు. ఈ రెండు పత్రికలు మాకు ఎప్పుడూ అనుకూలంగానే రాస్తాయి. నేనైతే మా లోపాలు.. తప్పులు ఎత్తిచూపే ‘సాక్షి’ పత్రికనే ముందుగా చదవాలంటాను’ అని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.
సాక్షిలో వచ్చే కథనాల్లో వాస్తవాలుండొచ్చు.. లేకపోవచ్చు, లోపాలు, తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అవాస్తవాలైతే పట్టించుకోనవసరం లేదు. అలా చాలా తప్పులు, లోపాలను మా డిపార్ట్‌మెంట్ పరంగా సరిదిద్దుకోగలిగాం’ అని చెప్పారు. ఏయూ ప్లాటినం జూబ్లీ ఆడిటోరియంలో గురువారం ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా డైరీని మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉన్న వారు ప్రెస్‌ను ఎవాయిడ్ చేయడం సరికాదని చెప్పారు. సమగ్ర కథనాలు, విశ్లేషణలు కావాలంటే దినపత్రికలే ఉండాలన్నారు. పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ఆ దిశగా పత్రికలు కృషి చేయాలని సూచించారు.