ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని భారీగా పెంచిన ఏపీ ప్రభుత్వం | AP Government Increased Arogyasree Limit to 25 lakhs for Free Medicine | Sakshi
Sakshi News home page

రూ.25 లక్షల ఉచిత వైద్యం..

Published Sat, Dec 16 2023 5:26 AM | Last Updated on Sat, Dec 16 2023 1:30 PM

AP Government Increased Arogyasree Limit to 25 lakhs for Free Medicine - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణలో మరో విప్లవాత్మక నిర్ణయానికి క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. పేద కుటుంబాలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న అపర సంజీవని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ వైద్యశాలల్లో కార్పొరేట్‌ వైద్యాన్ని అందించడంతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అధునాతన వైద్య సేవలు పొందేలా ఆరోగ్యశ్రీని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం బలోపేతం చేయడం తెలిసిందే. ఇప్పటికే క్యాన్సర్‌ లాంటి మహమ్మారి బారిన బాధితులకు పరిమితి లేని చికిత్సలు అందిస్తూ ఆరోగ్యశ్రీ సంజీవనిగా మారింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చడంతో రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీతో లబ్ధి పొందుతున్నాయి.

నాలుగున్నరేళ్లలో 37.40 లక్షల మంది ఆరోగ్యాలకు భరోసానిస్తూ వివిధ జబ్బుల చికిత్సకు 53,02,816 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం రూ.11,859.86 కోట్లు ఖర్చు చేసింది. గతంలో సుస్తీ చేస్తే వైద్య ఖర్చులకు కుటుంబాలు అప్పుల పాలై పేదలు జీవన ప్రమాణాలు క్షీణించేవి. అలాంటి దుస్థితి ఏ ఒక్కరికీ రాకూడదనే సంకల్పంతో ఆరోగ్యశ్రీ వైద్య పరిమితి, ప్రొసీజర్లను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. మరోవైపు గత ఎన్నికల్లో చెప్పిన మాటను తు.చ. తప్పకుండా ఆచరిస్తూ మేనిఫెస్టోలో పేర్కొన్న మరో హామీని సంపూర్ణంగా నెరవేరుస్తూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది.

ప్రస్తుతం రూ.2,750గా ఉన్న వైఎస్సార్‌ పింఛన్‌ కానుకను జనవరి 1వ తేదీ నుంచి రూ.3 వేలకు పెంచాలని నిర్ణయించింది. తద్వారా 65.33 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, చర్మకారులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు మరింత ఆర్థిక భరోసా కల్పిస్తోంది. గత సర్కారు హయాంలో పింఛన్ల కోసం నెలకు రూ.400 కోట్లు మాత్రమే వ్యయం చేయగా ఇప్పుడు తాజా పెంపుతో పింఛన్ల వ్యయం నెలకు రూ.2 వేల కోట్లకు పెరగనుంది. ఈ మేరకు శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర లభించింది. ఈ నేపథ్యంలో జనవరిలో సంక్రాంతికి తోడు పేదల ఇంట సంక్షేమ పథకాల పండగ సందడి చేయనుంది. జనవరి 10వతేదీ నుంచి 23వరకు చివరి విడత వైఎస్సార్‌ ఆసరా, జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు వైఎస్సార్‌ చేయూత కార్యక్రమాలను అమలు చేయనున్నారు. సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. 

దేశ ప్రజారోగ్య చరిత్రలో కీలక మైలురాయి
పేదలకు ఉచిత వైద్య సేవల కోసం గత సర్కారు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు ఏడాది 4,400 కోట్లు వెచ్చిస్తున్నాం. ఇప్పటి వరకు ఒక్క క్యాన్సర్‌ ప్రొసీజర్స్‌లోనే వైద్యానికి రూ.1,897 కోట్లు వ్యయం చేశాం. ఇక ఆరోగ్యశ్రీ కొత్త కార్డుతో ఆస్పత్రికి వెళ్తే రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యం అందిస్తాం. ఇది దేశంలోని ప్రజారోగ్య చరిత్రలో అతిపెద్ద మైలు రాయి. ఈ నెల 18న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. గతంలో ఆరోగ్యశ్రీలో 1,059 ప్రొసీజర్స్‌ మాత్రమే ఉండగా, సీఎం జగన్‌ వీటిని ఏకంగా 3,257కి పెంచడం ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను మరింత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు.

19వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో కొత్త కార్డుల పంపిణీ చేపడతాం. ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు పొందడంపై జనవరి నెలాఖరు/ఫిబ్రవరి తొలి వారంలోగా ఆశ వర్కర్లు, సీహెచ్‌ఓలు, ఏఎన్‌ఎంల ద్వారా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రజల ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేస్తారు. ఆరోగ్యశ్రీ యాప్‌లో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల వివరాలు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో అందే వైద్య సేవల సమగ్ర డేటా అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యశ్రీ చికిత్సను 104 కాల్‌ సెంటర్, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్, 108 అంబులెన్స్, ఫ్యామిలీ డాక్టర్, స్థానిక పీహెచ్‌సీల ద్వారా పొందడంపై ప్రతి ఒక్కరికీ తెలియచేస్తాం. ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో వ్యాధి నిర్ధారణ జరిగి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది తిరిగి డాక్టర్‌ చెకప్‌ కోసం వెళ్లాల్సి వస్తే రవాణా ఖర్చుల కింద రూ.300 చెల్లిస్తాం. డాక్టర్‌ చెకప్‌కు 10 రోజులు  ముందే ఏఎన్‌ఎంతో సమాచారం అందిస్తాం. 

మందులు డోర్‌ డెలివరీ..
ఫేజ్‌–2 జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన వ్యాధిగ్రస్తులకు మందులు నేరుగా ఉచితంగా డోర్‌ డెలివరీ చేస్తాం. మందులు అయిపోతే వాటి కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే ఇండెంట్‌ తీసుకుని విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి ఏఎన్‌ఎంలు ద్వారా బాధితులకు చేరుస్తాం. తపాలా శాఖ సహాయంతో వేగంగా, డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందుల పంపిణీ చేస్తాం. ఇందుకోసం ప్రత్యేక ఎస్‌ఓపీ రూపొందించాం. సూపర్‌ స్పెషాల్టీ సేవలందించే వైద్యులకు రూ.4 లక్షల వరకూ జీతాలు ఇస్తున్నాం. వైద్యశాఖలో 53 వేల పోస్టులను భర్తీ చేసి దాదాపు జీరో వేకెన్సీని తీసుకొచ్చాం. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.668 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా చెల్లించాం.

10 రోజుల పాటు ‘వైఎస్సార్‌ చేయూత’
పేద అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారత లక్ష్యంగా వైఎస్సార్‌ చేయూత పంపిణీని మంత్రి మండలి ఆమోదించింది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకూ పది రోజుల పాటు వైఎస్సార్‌ చేయూత సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న అక్కచెల్లెమ్మల జీవనోపాధి కల్పనకు ఏటా రూ.18,750 చొప్పున అందిస్తూ సీఎం జగన్‌ నాలుగేళ్లు అండగా నిలిచారు.

26 నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్ర’ మెగా టోర్నీ డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభం కానుంది. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్‌ డబుల్స్, ఖోఖో, కబడ్డీతో పాటు సాంప్రదాయ క్రీడలైన యోగ, మారథాన్, టెన్నీకాయిట్‌ పోటీలు ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో 51 రోజుల పాటు పోటీలు నిర్వహిస్తాం. 

కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీలో కీలక సంస్కరణలు..
కుల, ఆదాయ ధ్రువపత్రాల మంజూరులో ప్రభు­త్వం కీలక సంస్కరణలు తెచ్చింది. సర్టిఫికెట్ల జారీలో జాప్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో కుటుంబ సభ్యులకు జారీ చేసిన కుల ధ్రువపత్రం ఆధారంగానే  గ్రామ, వార్డు సచివాలయాల్లో వేగంగా కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అందించే బాధ్యతను అధికారులకే అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్ర­మాలు, పథకాలకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారుల జాబితా నేరుగా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్తుంది. ఆ జాబితాపై సిక్స్‌ స్టెప్‌ వెరిఫికేషన్‌ చేస్తారు. అందులో విఫలం అయితే రెవెన్యూ సిబ్బందికి పంపుతారు. వారు వెంటనే పరిశీలన చేసిన ఆటోమేటిక్‌గా నిర్థారిస్తారు. గత రెండేళ్లలో దాదాపు 75 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీచేశాం. ఒక్క జగనన్న సురక్ష కార్యక్రమంలోనే 39 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించాం.

ఉదారంగా మిచాంగ్‌ సాయం..
మిచాంగ్‌ తుపాన్‌ నష్టంపై మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చించింది. ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ.52.47 కోట్లు విడుదల చేసింది. శిబిరాలకు వచ్చిన వారికే కాకుండా ఇళ్లలో నీళ్లు నిలిచిన వారందరికీ కూడా ప్రత్యేక సహాయం అందించింది. ఒంటరి వ్యక్తి అయితే రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2,500 చొప్పున 1.10 లక్షల మందికి సహాయం అందించాం. గతంలో ఇలాంటి సాయం ఎన్నడూ అందలేదు. ప్రత్యేక ఆర్థిక సహాయం కింద రూ.28.07 కోట్లు పంపిణీ చేశాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement