గ్రామ పంచాయతీల్లో కేరళ తరహా పాలన
► స్థానిక సంస్థలకు విశేషాధికారాలను కల్పించాలని సర్కారు యోచన
► విధివిధానాలపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలను కేరళ తరహాలో స్థానిక ప్రభుత్వాలుగా మలచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పంచాయతీల అభివృద్ధికి కేరళ అవలంభిస్తున్న విధానాలు, చేపట్టిన కార్యక్రమాలను ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఈ మేరకు కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, డెరైక్టర్ నీతూప్రసాద్ అక్కడి పలు గ్రామ, బ్లాక్, జిల్లా పంచాయతీలను సందర్శించిన సంగతి తెలిసిందే. కేరళ తరహాలోనే గ్రామ పంచాయతీలకు పలు విశేషాధికారాలను కల్పించడంతో పాటు, అభివృద్ధికి సూచికలుగా కనిపిస్తున్న కొన్ని కార్యక్రమాలను తెలంగాణలోనూ అమలు చేయాలని జూపల్లి భావిస్తున్నారు.
ముఖ్యంగా అక్కడి గ్రామాల్లో ఎక్కడా ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, విద్య, వైద్యం, ఆరోగ్య అంశాల్లో అనుసరిస్తున్న విధానాలపై కసరత్తు చేయాలని రాష్ట్ర అధికారులను ఆయన ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు విధివిధానాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. వాస్తవానికి కేరళలో పంచాయతీల నైసర్గిక స్వరూపం, జనాభా తదితర అంశాల్లో రాష్ట్రంలోని పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉన్నా, సారూప్యత కలిగిన కొన్ని అంశాల్లోనైనా మార్పు తీసుకురావాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తొలుత కొన్ని గ్రామాను పెలైట్‌గా ఎంపిక చేసి, ఫలితాలను సమీక్షించాక రాష్ట్రమంతటా విస్తరించనున్నారు.
కేరళ తరహా పాలన అంటే...
కేరళలో ప్రభుత్వమంటే పంచాయతీలే. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన స్థానిక పంచాయతీ వార్డుల్లో జరిగే సభల ద్వారానే కావడం విశేషం. ఇక్కడ గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లు ఉండగా... ఆ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీ, జిల్లా పంచాయతీలున్నాయి. అయితే.. ఆయా పంచాయతీలనే స్థానిక ప్రభుత్వాలుగా అక్కడి ప్రజలు భావిస్తారు. పంచాయతీల పరిధిలో చేపట్టే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ స్థానికేతరుల జోక్యం ఉండ దు. పంచాయతీల పరిధిలో పనిచేసే వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా స్థానిక పంచాయతీ ప్రెసిడెంట్ల నియంత్రణలోనే ఉంటారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు, నిధుల వినియోగానికి జవాబుదారీగా ఉంటారు.
రాష్ట్రస్థాయిలో విధానాల రూపకల్ప న మినహా క్షేత్రస్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యం ఉండకపోవడం గమనార్హం. గ్రామ పంచాయతీ లకు ఆదాయ వనరుల విషయానికి వస్తే.. ప్రధానంగా బిల్డింగ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్, అడ్వర్‌టైజ్‌మెంట్ ట్యాక్స్ రూపేణా సొంత వనరులు కలిగి ఉంటాయి. జనాభా ప్రాతిపదికన గ్రామీణాభివృద్ధికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 40 శాతం నిధులను నేరుగా కేటాయిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా గ్రామ పంచాయతీ ఖాతాలకే జమవుతాయి