తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలైన మెట్లబావులను పునరద్ధరించేందుకు ప్రముఖ వ్యాక్సీన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ముందుకొచ్చింది. నీటి వనరుల సంరక్షణతోపాటు జీవనోపాధులను పెంచేందుకు, ఎకో టూరిజానికి ఊతమిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.
ఇందులో భాగంగా ‘ద సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండవర్’ క్లుప్తంగా సాహె అమ్మపల్లి, సాలార్ జంగ్ సంగ్రహాలయాల్లో చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమాలకు తమవంతు సాయం అందించనుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి ఎ.వాణీ ప్రసాద్‌ల సమక్షంలో భారత్ బయోటెక్, సాహేల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా తాము మెట్లబావుల పునరుద్ధరణకు సాయం అందించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా తెలిపారు. మెట్లబావుల పునరుద్ధరణతోపాటు వీటి ప్రాశస్త్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తామని అమ్మపల్లి, సాలార్ జంగ్ సంగ్రహాలయాల్లోని మెట్లబావులు అటు పల్లెల్లో ఇటు నగరాల్లోనూ కీలకమైన నీటి వనరులగా సేవలందించాయని చెప్పారు. అమ్మపల్లిలోని మెట్లబావి 13వ శతాబ్దానికి చెందినదైతే.. సాలార్ జంగ్ సంగ్రహాలయంలోనిది కుతుబ్ షాహీల కాలం నాటిదని గుర్తు చేశారు.
ఢిల్లీలోని అగ్రసేన్ కి బౌలీ, అహ్మదాబాద్‌లోని రాణీ కి వావ్‌లు యునెస్కో గుర్తింపు పొందాయని, చిన్న బావుల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు. ఆధునిక కాలంలో వీటి అవసరం లేక పోవడంతో కొన్ని చోట్ల చెత్తకుప్పలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో భూగర్భ జల వనరుల వాడకం అత్యధికంగా ఉందని యునెస్కో సైతం హెచ్చరించిన నేపథ్యంలో.. మెట్లబావుల వంటి నీటి వనరులను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment