పంచాయతీరాజ్‌లో పూర్తి నగదురహితం
జనవరి 10 నుంచి అమలు: మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖలో వచ్చేనెల పదో తేదీ నాటికి వంద శాతం నగదురహిత లావాదేవీలు నిర్వహిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఇందుకు బ్యాంకర్లు, పోస్టల్ అధికారులు పూర్తి సహకారం అందించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖలో వంద శాతం నగదు రహిత లావాదేవీల అమలుపై బుధవారం సచివాలయంలో బ్యాంకర్లు, పోస్టల్ శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ రాష్ట్రంలో ప్రతినెల 35.96 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఇందులో 17.81 లక్షల పింఛన్లు పోస్టాఫీస్ ద్వారా, 13.63 లక్షల పింఛన్లు బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నామన్నారు.
మరో 4.52 లక్షల లబ్ధిదారులకు నేరుగా నగదు ఇస్తున్నామన్నారు. వీరికి ఈ నెలాఖర్లోగా బ్యాంకు ఖాతాలు తెరిపించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో బ్యాంకు రెండు గ్రామాలను దత్తత తీసుకుని, ఈ నెల 31లోగా అందరికీ ఖాతా సౌకర్యాన్ని కల్పించాలన్నారు. జనవరి పదిలోగా ఖాతాలను ఆధార్‌తో సీడింగ్ చేసి రూపే కార్డులు ఇవ్వాలన్నారు. ఇకపై ఆసరా పింఛన్‌దారులు, ఉపాధిహామీ కూలీలకు వచ్చేనెల పదినుంచి పూర్తిగా బయోమెట్రిక్ పద్ధతిలో డబ్బులు పంపిణీ చేస్తామని మంత్రి వివరించారు. గ్రామ పంచాయతీల్లో స్వైపింగ్ మిషన్లు అందుబాటులో ఉంచాలని బ్యాంకర్లకు సూచించారు.