ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయండి | Please set up a special court | Sakshi
Sakshi News home page

ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయండి

Published Wed, Dec 13 2017 1:42 AM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

Please set up a special court - Sakshi

విశాఖ సిటీ/విశాఖ లీగల్‌: ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వాకపల్లి అత్యాచార బాధితులు విశాఖలో ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానాన్ని కోరారు. తమకు పరి హారం చెల్లించాలని, కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లను ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. 2007 ఆగస్టు 20న విశాఖజిల్లా జి.మాడుగుల మండలం సుర్మతి పంచాయతీ వాకపల్లిలో తమపై 21 మంది గ్రేహౌండ్స్‌ పోలీసులు అత్యాచారం చేశారని 11మంది కోండు ఆదివాసీ మహిళలు దాఖలు చేసిన ప్రైవేట్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. బాధిత మహిళలతోపాటు, నిందితులైన 13 మంది పోలీసులు మంగళవారం ఎస్సీ, ఎస్టీ కోర్టుకు హాజరయ్యారు.

పాడేరు పోలీస్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఎ.రవికుమార్, అనకాపల్లి టౌన్‌ పోలీస్‌ కానిస్టేబుళ్లు డి.రవికుమార్, డీవీఆర్‌ సురేశ్, కె.దేవుళ్లు, టి.ప్రసాద్, ఎస్‌.తాత బాబు, డి.సింహాచలం, ఆర్‌.చంద్రశేఖర్, ఆర్‌.దేవనాథ్, ఎస్‌.శ్రీనివాసరావు, చోడవరం పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుళ్లు ఆర్‌.శ్రీను, సీహెచ్‌ విజయ్‌కుమార్‌ తదితరులు నింది తులుగా ఉన్నారు. సంఘటన జరిగినప్పుడు బాధిత మహిళలు పాడేరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే నిందితులు హైకోర్టును ఆశ్రయించగా వీరిలో 8 మందిపై కేసు కొట్టేసింది. మిగిలిన 13 మంది తమపై కేసు ఎత్తేయాలని సుప్రీంకోర్టులో గత ఏప్రిల్‌ 26న పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్‌ 1న కొట్టేసింది. ఈ కేసులో వెంటనే ట్రయల్‌ కోర్టు ఏర్పాటు చేసి ఆరు నెలల్లో విచారణ పూర్తిచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద విశాఖలో ఏర్పాటైన కోర్టు విచారణను చేపట్టింది. మంగళవారం అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సలాది శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ పోలీసులపై నేరాభియోగ పత్రంలో పేర్కొన్న విధంగా విచారణను ప్రారంభించాలని న్యాయస్థానాన్ని కోరారు. నిందితుల తరఫున న్యాయవాది ఎం.రవి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి ఒ.వెంకట నాగేశ్వరరావు కేసును ఈ నెల 18కి వాయిదా వేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement