సాక్షి, విజయవాడ: జస్టిస్ ఫర్ దిశా వివాదం నడుస్తున్న తరుణంలో విజయవాడ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వరుసకు కూతురైన మైనర్ బాలికను చెరపట్టి అత్యాచారం చేసిన మారుతండ్రికి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఇదిగో ఈ ఫోటో లో ఉన్న వ్యక్తి పేరు సైకం కృష్ణారావు. ఇబ్రహీంపట్నం వాసి. ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు బిడ్డల తల్లిపై మనసు పడ్డాడు. తనకు భార్యలేదని.. ఒప్పుకుంటే పెళ్లిచేసుకొంటానని ఆమెకు ప్రపోజ్ చేశాడు. తన పిల్లలని కన్నబిడ్డల్లా చూసుకుంటానని బాస చేశాడు. భర్తతో తెగతెంపులు చేసుకొని పిల్లలతో ఇబ్బంది పడుతున్న ఆ వివాహిత కృష్ణారావు ప్రతిపాదనకు ఒప్పుకుంది. ఈ క్రమంలో పదకొండేళ్ళుగా ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. కొడుకు, కూతురు బాగా చదువుకుంటుండటంతో ఆ తల్లి మురిసిపోయేది.
పదో తరగతి చదువుతున్న కూతురిపైనే కన్నేశాడు మారుతండ్రి కృష్ణారావు. తల్లి బైటికెళ్లిన సమయంలో మాటేసి కాటేశాడు. వరసకు కూతురన్న కనికరం కూడా లేకుండా పశువులా మారి కామవాంఛ తీర్చుకొన్నాడు. వావివరసలు మరిచి శునకానందం పొందాడు. ఇంటికొచ్చిన తల్లికి జరిగిన ఘోరం చెప్పి కన్నీటిపర్యంతమైంది కూతురు. అపరాకాళిగా మారిన ఆ తల్లి కృష్ణారావుకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేయడంతో ఏడాది తిరక్కముందే కేసు విచారణకు కొచ్చింది. విజయవాడలోని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కేసును విచారించి కృష్ణారావును దోషిగా తేల్చారు. అతనికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదువందల జరిమానా విధించారు. ఈ తీర్పుతో బాధితురాలు, ఆమె తల్లీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దిశా హత్యాచార కేసుపై పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసులో న్యాయమూర్తి తీర్పు పట్ల సర్వత్రా ఆనందం వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment