సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు లేరు కాబట్టే పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు–భూగర్భ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎంగా వచ్చినప్పటి నుంచి వర్షాలు ఎక్కువగా పడి వరద నీరు భారీగా నదులలో చేరుతుండడంతో.. ఇసుక తవ్వకాలు ఎలా సాధ్యమవుతాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఉందంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తుండడంపై మంత్రి మండిపడ్డారు. ఏ అంశంపై మాట్లాడాలో టీడీపీ నేతలకు తెలియక దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
రాష్ట్ర మంత్రులు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నేతలెవ్వరు ఇసుక వ్యాపారం చెయ్యడం లేదని పేర్కొన్నారు. టీడీపీ నేతలు గతంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పాత రిజర్వేషన్లు కొనసాగించి ఎన్నికలు నిర్వహించే విషయమై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment