ఏలూరు : నా కొడుక్కి ప్రాణ రక్షణ కల్పించి వృద్ధాప్యంలో ఉన్న తనకు మానసిక ప్రశాంతత కల్పించాలని 80 ఏళ్ల వృద్ధురాలు, నరసాపురం మండలం సీతారాంపురం నార్త్ గ్రామ ఉప సర్పంచ్ చినిమిల్లి భుజంగవేణి కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను వేడుకుంది. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం భుజంగ వేణి కుమారుడు గంగాధరరావుతో పాటు కలెక్టర్‌ను కలిశారు. గ్రామంలో రాజకీయ కక్షతో గంగాధరరావును అంతం చేయడానికి తనపై పోటీచేసి ఓడిపోయిన కలవకొలను వీరస్వామి (తాతాజీ) ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. తన కొడుకుకు ప్రాణహాని లేకుండా కాపాడాలని కోరారు. లేకుంటే కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకోవడమే తమకు శరణ్యమని వృద్ధురాలు కలెక్టర్‌ను వేడుకుంది. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భుజంగవేణి కుటుంబానికి రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు.