Sitarampuram
-
కాపాడేందుకు వెళ్లి... మృత్యు పాశానికి బలి!
పశువుల కాపరిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన యువకుడు విద్యుత్ ఘాతానికి బలి పుష్కరాల సెలవులకు వచ్చి తిరిగిరానిలోకాలకు విద్యుత్ అధికారలపై స్థానికులు ఆగ్రహం ఆడుతూ పాడుతూ తిరగాల్సిన కుర్రాడు కదలకుండా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు కంటికీ మింటికీ ఏకధారగా రోదిస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న బిడ్డ చనిపోయాడని తెలిసి గుండెలవిసేలా ఏడుస్తున్నారు. సాటి వ్యక్తి అపాయంలో ఉన్నాడని తెలిసి, అతని ప్రాణాలు కాపాడబోయి ఓ యువకుడు తన ప్రాణాలు కోల్పోయాడు. ఎస్.కోట మండలం సీతారాంపురంలో శనివారం జరిగిన ఈ ఘటన ఆ గ్రామ వాసులకు కన్నీళ్లు తెప్పించింది. పుష్కరాల సెలవులకు ఇంటికి వచ్చిన కొడుకు ఇక లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరును చూసి గ్రామమంతా కంట తడి పెట్టింది. శృంగవరపుకోట: ఆపదలో ఉన్న పశువుల కాపరిని కాపాడబోయి ఓ విద్యార్థి తన ప్రాణాలు వదిలేశాడు. మండలంలో సీతారాంపురం గ్రామంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన గ్రామస్తుల్ని కలచివేసింది. గ్రామానికి చెందిన కొల్లి శంకరరావు(21) విజయనగరంలోని మహరాజా కళాశాలలో బీఎస్సీ రెండో సంవతరం చదువుతున్నాడు. గోదావరి పుష్కరాల సందర్భంగా శనివారం కళాశాలకు సెలవు ప్రకటించటంతో శుక్రవారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. శనివారం పశువుల పాక నేసేందుకు తండ్రి వెంట వెళ్లి సాయం చేశాడు. పశువుల పాక నేస్తున్న శంకర్రావుకు సమీపంలో కొల్లివారి అరటితోటల్లోంచి కాపాడండి అంటూ అరుపులు వినబడటంతో అటువైపు పరుగు తీశాడు. అరటితోటలో గ్రామానికి చెందిన రావాడ వెంకటరమణ తోటలో కింద ఉన్న వైర్లు తొక్కి ఊగిపోతుంటే శంకర్రావు ఒక్కసారిగా వెంకటరమణను పక్కకు తోశాడు. వ్యక్తిని తోసి అదుపు తప్పిన శంకర్రావు వైర్లపై పడి ప్రాణాలు కోల్పోయాడు. శంకర్రావు వెంట వచ్చిన రె ండుకుక్కలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు పరుగు పరుగున వచ్చినా అప్పటికే శంకర్రావు ప్రాణాలు వదిలాడు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే... తన కొడుకు విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే ప్రాణాలు కోల్పోయాడని మృతుడు తండ్రి అప్పలనాయుడ, తల్లి సింహాచలం, అక్క కోటలక్ష్మిలతో పాటూ గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నెలల క్రితం హుద్‌హుద్ తుపానుతో తెగిపడిన విద్యుత్వైర్లను సరిచేయాలని ఎన్నో ధపాలు నెత్తీనోరు బాదుకుని, ఫిర్యాదు చేసినా విద్యుత్‌శాఖ సిబ్బంది తమ గోడు పట్టించుకోలేదని వారు వాపోయారు. గతంలో ఒక కుక్క ఈ వైర్లు తగిలి చనిపోయిందన్నారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంపై లోకాయుక్త, మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. విషయం తెలుకుని గ్రామానికి వచ్చిన ఏడీఈని గ్రామస్తులు చుట్టుముట్టి నిలదీశారు. ఎంత మంది చస్తే పట్టించుకుంటారు. పోయిన ప్రాణాన్ని తీసుకొస్తారా అంటూ దుమ్మెత్తిపోశారు. ‘ఉన్న ఒక్క కొడుకును మీరు తీసుకుపోయారు. మేము ఎవరి కోసం బతకాలి. ఎలా బతకాలిరా దేముడా...మా ఉసురు పోసుకున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. మీరు ఎవరి కోసం ఉద్యోగాలు చేయ్యాలి. మీరు ఇప్పుడొచ్చి ఎవర్ని ఉద్ధరిస్తారు’ అంటూ మృతుడు శంకర్రావు తల్లిదండ్రులు భోరున విలపించారు. శంకర్రావు కుటుంబానికి న్యాయం చేయాలని సర్పంచ్ జి.సన్యాసప్పడు డిమాండ్‌చేశారు. ఎస్.కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యా.. నా కుమారుడికి ప్రాణ రక్షణ కల్పించండి
ఏలూరు : నా కొడుక్కి ప్రాణ రక్షణ కల్పించి వృద్ధాప్యంలో ఉన్న తనకు మానసిక ప్రశాంతత కల్పించాలని 80 ఏళ్ల వృద్ధురాలు, నరసాపురం మండలం సీతారాంపురం నార్త్ గ్రామ ఉప సర్పంచ్ చినిమిల్లి భుజంగవేణి కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను వేడుకుంది. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం భుజంగ వేణి కుమారుడు గంగాధరరావుతో పాటు కలెక్టర్‌ను కలిశారు. గ్రామంలో రాజకీయ కక్షతో గంగాధరరావును అంతం చేయడానికి తనపై పోటీచేసి ఓడిపోయిన కలవకొలను వీరస్వామి (తాతాజీ) ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. తన కొడుకుకు ప్రాణహాని లేకుండా కాపాడాలని కోరారు. లేకుంటే కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకోవడమే తమకు శరణ్యమని వృద్ధురాలు కలెక్టర్‌ను వేడుకుంది. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భుజంగవేణి కుటుంబానికి రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు. -
మా ఊళ్లో ‘మందు’ షాపు వద్దు
ఎం.సీతారాంపురం(వంగర): మద్యం మహమ్మారి బారినపడి కుటుంబాలు వీధిన పడుతున్నాయని, కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని, గ్రామం నడిబొడ్డున ఉన్న దుకాణాన్ని వెంటనే తరలించాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సర్పంచ్ లెంక రామినాయుడు, గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రాజాన పద్మ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. వీరికి గ్రామంలోని అందరూ సహకరించారు. ఎస్ఆర్బీ మద్యం దుకాణం ఎదుట ధర్నాకు దిగారు. మద్యం మహమ్మారిని తరమివేయాలి, పేదల బతుకులతో ఆడుకుంటున్న మద్యం షాపును ఎత్తివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజాం, పార్వతీపురం పట్టణాలకు వెళ్లే బస్సులను అడ్డగించారు. వీరిని అదుపుచేయడం పోలీసులకు ఎంతో కష్టమైంది. మద్యం దుకాణం ఎత్తివేయాలని మూడేళ్లుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయం, శ్రీదుర్గాలయం, బీసీ బాలుర వసతి గృహం, జెడ్పీ ఉన్నత పాఠశాల ఉన్న ప్రదేశంలో మద్యం షాపు ఉండడం చట్టరీత్యా నేరమని, తక్షణమే తొలిగించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో షాపు ఉండడంతో యువకులు, విద్యార్థులు మద్యానికి బానిసవుతున్నారని, నిరుపేదలు కూలీ డబ్బులు మద్యానికి పోస్తున్నారని, గ్రామంలో కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన చెందారు. అదే సమయంలో అటువైపు వచ్చిన ఎమ్మెల్యే కంబాల జోగులుకు గ్రామస్తులు సమస్యను వివరించారు. మద్యం దుకాణం గ్రామం నుంచి తరలించేలా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన జోగులు తక్షణమే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సదానందం, జోగినాయుడు, తిరుపతిరావు, సుబ్బారావు, రంగునాయుడు, సింహాచలం, గౌరునాయుడు, ఫకీరునాయుడు తదితరులు పాల్గొన్నారు.