కాపాడేందుకు వెళ్లి... మృత్యు పాశానికి బలి! | Go to save ... Bali venom of death! | Sakshi
Sakshi News home page

కాపాడేందుకు వెళ్లి... మృత్యు పాశానికి బలి!

Published Sun, Jul 26 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

కాపాడేందుకు వెళ్లి...  మృత్యు పాశానికి బలి!

కాపాడేందుకు వెళ్లి... మృత్యు పాశానికి బలి!

పశువుల కాపరిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన యువకుడు
విద్యుత్  ఘాతానికి  బలి
పుష్కరాల సెలవులకు వచ్చి తిరిగిరానిలోకాలకు
విద్యుత్ అధికారలపై స్థానికులు ఆగ్రహం

 
ఆడుతూ పాడుతూ తిరగాల్సిన కుర్రాడు కదలకుండా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు కంటికీ మింటికీ ఏకధారగా రోదిస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న బిడ్డ చనిపోయాడని తెలిసి గుండెలవిసేలా ఏడుస్తున్నారు. సాటి వ్యక్తి అపాయంలో ఉన్నాడని తెలిసి, అతని ప్రాణాలు కాపాడబోయి ఓ యువకుడు తన ప్రాణాలు కోల్పోయాడు. ఎస్.కోట మండలం సీతారాంపురంలో శనివారం జరిగిన ఈ ఘటన ఆ గ్రామ వాసులకు కన్నీళ్లు తెప్పించింది. పుష్కరాల సెలవులకు ఇంటికి వచ్చిన కొడుకు ఇక లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరును చూసి గ్రామమంతా కంట తడి పెట్టింది.
 
శృంగవరపుకోట: ఆపదలో ఉన్న పశువుల కాపరిని కాపాడబోయి ఓ విద్యార్థి తన ప్రాణాలు వదిలేశాడు. మండలంలో సీతారాంపురం గ్రామంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన గ్రామస్తుల్ని కలచివేసింది. గ్రామానికి చెందిన కొల్లి శంకరరావు(21) విజయనగరంలోని మహరాజా కళాశాలలో బీఎస్సీ రెండో సంవతరం చదువుతున్నాడు. గోదావరి పుష్కరాల సందర్భంగా శనివారం కళాశాలకు సెలవు ప్రకటించటంతో శుక్రవారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. శనివారం పశువుల పాక నేసేందుకు తండ్రి వెంట వెళ్లి సాయం చేశాడు.
 పశువుల పాక నేస్తున్న శంకర్రావుకు సమీపంలో కొల్లివారి అరటితోటల్లోంచి కాపాడండి అంటూ అరుపులు వినబడటంతో అటువైపు పరుగు తీశాడు. అరటితోటలో గ్రామానికి చెందిన రావాడ వెంకటరమణ తోటలో కింద ఉన్న  వైర్లు తొక్కి ఊగిపోతుంటే శంకర్రావు ఒక్కసారిగా వెంకటరమణను పక్కకు తోశాడు.  వ్యక్తిని తోసి అదుపు తప్పిన శంకర్రావు వైర్లపై పడి ప్రాణాలు కోల్పోయాడు. శంకర్రావు వెంట వచ్చిన రె ండుకుక్కలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు పరుగు పరుగున వచ్చినా అప్పటికే శంకర్రావు ప్రాణాలు వదిలాడు.

విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే...
 తన కొడుకు విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే ప్రాణాలు కోల్పోయాడని మృతుడు తండ్రి అప్పలనాయుడ, తల్లి సింహాచలం, అక్క కోటలక్ష్మిలతో పాటూ గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నెలల క్రితం హుద్‌హుద్ తుపానుతో తెగిపడిన విద్యుత్‌వైర్లను సరిచేయాలని ఎన్నో ధపాలు నెత్తీనోరు బాదుకుని, ఫిర్యాదు చేసినా విద్యుత్‌శాఖ సిబ్బంది తమ గోడు పట్టించుకోలేదని వారు వాపోయారు. గతంలో ఒక కుక్క ఈ వైర్లు తగిలి చనిపోయిందన్నారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంపై లోకాయుక్త, మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. విషయం తెలుకుని గ్రామానికి వచ్చిన ఏడీఈని గ్రామస్తులు చుట్టుముట్టి నిలదీశారు. ఎంత మంది చస్తే పట్టించుకుంటారు. పోయిన ప్రాణాన్ని తీసుకొస్తారా అంటూ దుమ్మెత్తిపోశారు.  ‘ఉన్న ఒక్క కొడుకును మీరు తీసుకుపోయారు. మేము ఎవరి కోసం బతకాలి. ఎలా బతకాలిరా దేముడా...మా ఉసురు పోసుకున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. మీరు ఎవరి కోసం ఉద్యోగాలు చేయ్యాలి. మీరు ఇప్పుడొచ్చి ఎవర్ని ఉద్ధరిస్తారు’ అంటూ మృతుడు శంకర్రావు తల్లిదండ్రులు  భోరున విలపించారు. శంకర్రావు కుటుంబానికి న్యాయం చేయాలని సర్పంచ్ జి.సన్యాసప్పడు డిమాండ్‌చేశారు. ఎస్.కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement