Sankara Rao
-
రైతుల పరామర్శకి వెళ్తే దాడి చేస్తారా: నంబూరు శంకరరావు
గుంటూరు, సాక్షి: గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. నష్ట పోయిన రైతులకు పరిహారం అందించమని అడగడం తప్పా? అని ప్రశ్నించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘పెదకూరపాడు నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంట పొలాల నస్థానికి 15 రోజుల్లోనే నష్టం పరిహారం ఇవ్వడం జరిగింది. రైతుల పరామర్శకి వెళ్తే దాడి చేస్తారా?. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి రాకూడదా? లేమల్లకి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వాసు అనే వ్యక్తి కారు ధ్వంసం చేశారు....పోలీసుల వైఫల్యం వల్లనే దాడులు జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధిని తట్టుకోలేక దాడులు చేస్తున్నారు. నియోజవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాను. నియోజకవర్గం ఎవరి సొంతం కాదు ఇది ప్రజాస్వామ్య దేశం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?’’ అని అన్నారు. -
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
రెండు నెలలో ఎడారి పాలైయే నీ పార్టీ లోకి నేనెందుకు వస్తా బాబు
-
ఎంబీబీఎస్ లో ఫ్రీ సీటు సాధించిన మధుశ్రీ
-
బాబు శవ రాజకీయాలు చేస్తున్నాడు: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
-
ఒకే కాన్పులో నలుగురు శిశువులు
- పురిట్లోనే మృతి హనుమాన్‌జంక్షన్ రూరల్ ఓ మహిళ ఒకే కాన్పులో ఏకంగా నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం దూడ్లవారి గూడెంకు చెందిన చిన్నం శంకరరావు భార్య మౌనిక పురిటినొప్పులతో హనుమాన్‌జంక్షన్‌లోని సీతామహాలక్ష్మీ నర్సింగ్ హోమ్‌లో చేరింది. మంగళవారం డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. డాక్టర్లనే ఆశ్చర్యానికి గురి చేస్తూ ఏకంగా నలుగురు బిడ్డలకు ఆమె జన్మనిచ్చింది. ఆరోనెలలోనే నొప్పులు రావటం, బిడ్డలను ప్రసవించటంతో బిడ్డలు పురిట్లోనే ప్రాణాలు విడిచారు. ఓకే కాన్పులో నలుగురు ప్రసవించటం అరుదైన విషయమని, ఇప్పటి వరకు తాను ఇలాంటి కేసు చూడలేదని డాక్టర్ దుట్టా చెప్పారు. -
సామూహిక అత్యాచారం కేసులో నలుగురి అరెస్ట్
వివాహితపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ ఆదివారం ఉదయం మీడియాకు తెలిపారు. ఈనెల 10వ తేదీన కెంటాడ మండలం ఆంధ్ర గ్రామానికి చెందిన ఒక వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిఅదే గ్రామానికి చెందిన ఆదినారాయణ, శంకరరావు, లక్ష్మణ, చిన్నారావు అనే వ్యక్తులను ఇప్పలవలస-కొండవలస గ్రామాల మధ్య ఆదివారం ఉదయం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు. -
రాళ్ల క్వారీపై నుంచి పడి కూలి మృతి
విజయనగరం జిల్లా కొండపెల్లి మండలం గరుడబిల్లి గ్రామ శివారులోని రాళ్ల క్వారీలో కూలీగా పనిచేస్తున్న శంకరరావు(35) ప్రమాదవశాత్తూ జారిపడి సోమవారం ఉదయం మృతిచెందాడు. రాళ్లు కొడుతుండగా బండపైనుంచి జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మీటర్ బాగుచేస్తానంటూ మోసం
మూడున్నర తులాల పుస్తెలతాడు అపహరణ దేవరాపల్లి: విద్యుత్ మీటరును సరి చేసేందుకు వచ్చానంటూ గుర్తు తెలియని వ్యక్తి దంపతులను మోసగించి మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును అపహరించుకు పోయాడు. మండలంలోని బోయిల కింతాడ శివారు వడిదడకల వారి కల్లాలు వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవరాపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కల్లాల్లో నివాసం ఉంటున్న వడదడకల శంకరరావు మంగళవారం పొలం పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మీ ఇంటి విద్యుత్ మీటర్‌ను బాగు చేయడానికి వచ్చానని నమ్మబలికాడు. ఇది నిజమని నమ్మిన శంకరరావు ఇంటికి తీసుకెళ్లి విద్యుత్ మీటర్‌ను చూపించాడు. దానిని బాగు చేస్తున్నట్లు కొద్ది సేపు నటించిన అతడు కాఫర్ వైర్ కావాలని అడిగాడు. తమ వద్ద లేదని శంకర్రావు భార్య బదులిచ్చింది. దీంతో శంకర్రావు భార్య మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు ఇవ్వాలని కోరాడు. బంగారు పుస్తులతాడుతో పాటు అతడు అడిగిన మేరకు తెల్లని గుడ్డ కూడా ఇచ్చారు. వారి కంట పడకుండా గుడ్డ చాటున పుస్తెల తాడును జేబులో వేసుకొని తెల్లని గుడ్డని మాత్రం మీటరుపైన ఉంచాడు. గుడ్డలో పుస్తెలతాడు ఉందని, ఈ మీటరు పని చేయడం లేదని, దీని స్థానంలో కొత్త మీటరు వేయాలని నమ్మించాడు. తమ సిబ్బంది గవరవరం బ్రిడ్జి వద్ద విద్యుత్ మీటర్లుతో ఉన్నారని, అక్కడి నుంచి తేవాలని, శంకర్రావును కూడా బైకుపై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అతడు చెప్పిన ప్రదేశానికి కొద్ది దూరంలో శంకర్రావును దించేసి మీటర్‌ను తీసుకు వస్తానంటూ చెప్పి వెళ్లాడు. ఎంతసేపటికీ అతని పత్తా లేక పోవడంతో శంకర్రావు ఇంటికి వచ్చేశాడు. విద్యుత్ మీటరు మీద ఉంచిన తెల్లని గుడ్డలో బంగారు పుస్తెల తాడు లేక పోవడాన్ని గమనించి దంపతులు లబో దిబో మన్నారు. మోసోయామని తెలుసుకుని దేవరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ జి. అప్పన్న తెలిపారు. -
కాపాడేందుకు వెళ్లి... మృత్యు పాశానికి బలి!
పశువుల కాపరిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన యువకుడు విద్యుత్ ఘాతానికి బలి పుష్కరాల సెలవులకు వచ్చి తిరిగిరానిలోకాలకు విద్యుత్ అధికారలపై స్థానికులు ఆగ్రహం ఆడుతూ పాడుతూ తిరగాల్సిన కుర్రాడు కదలకుండా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు కంటికీ మింటికీ ఏకధారగా రోదిస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న బిడ్డ చనిపోయాడని తెలిసి గుండెలవిసేలా ఏడుస్తున్నారు. సాటి వ్యక్తి అపాయంలో ఉన్నాడని తెలిసి, అతని ప్రాణాలు కాపాడబోయి ఓ యువకుడు తన ప్రాణాలు కోల్పోయాడు. ఎస్.కోట మండలం సీతారాంపురంలో శనివారం జరిగిన ఈ ఘటన ఆ గ్రామ వాసులకు కన్నీళ్లు తెప్పించింది. పుష్కరాల సెలవులకు ఇంటికి వచ్చిన కొడుకు ఇక లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరును చూసి గ్రామమంతా కంట తడి పెట్టింది. శృంగవరపుకోట: ఆపదలో ఉన్న పశువుల కాపరిని కాపాడబోయి ఓ విద్యార్థి తన ప్రాణాలు వదిలేశాడు. మండలంలో సీతారాంపురం గ్రామంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన గ్రామస్తుల్ని కలచివేసింది. గ్రామానికి చెందిన కొల్లి శంకరరావు(21) విజయనగరంలోని మహరాజా కళాశాలలో బీఎస్సీ రెండో సంవతరం చదువుతున్నాడు. గోదావరి పుష్కరాల సందర్భంగా శనివారం కళాశాలకు సెలవు ప్రకటించటంతో శుక్రవారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. శనివారం పశువుల పాక నేసేందుకు తండ్రి వెంట వెళ్లి సాయం చేశాడు. పశువుల పాక నేస్తున్న శంకర్రావుకు సమీపంలో కొల్లివారి అరటితోటల్లోంచి కాపాడండి అంటూ అరుపులు వినబడటంతో అటువైపు పరుగు తీశాడు. అరటితోటలో గ్రామానికి చెందిన రావాడ వెంకటరమణ తోటలో కింద ఉన్న వైర్లు తొక్కి ఊగిపోతుంటే శంకర్రావు ఒక్కసారిగా వెంకటరమణను పక్కకు తోశాడు. వ్యక్తిని తోసి అదుపు తప్పిన శంకర్రావు వైర్లపై పడి ప్రాణాలు కోల్పోయాడు. శంకర్రావు వెంట వచ్చిన రె ండుకుక్కలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు పరుగు పరుగున వచ్చినా అప్పటికే శంకర్రావు ప్రాణాలు వదిలాడు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే... తన కొడుకు విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే ప్రాణాలు కోల్పోయాడని మృతుడు తండ్రి అప్పలనాయుడ, తల్లి సింహాచలం, అక్క కోటలక్ష్మిలతో పాటూ గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నెలల క్రితం హుద్‌హుద్ తుపానుతో తెగిపడిన విద్యుత్వైర్లను సరిచేయాలని ఎన్నో ధపాలు నెత్తీనోరు బాదుకుని, ఫిర్యాదు చేసినా విద్యుత్‌శాఖ సిబ్బంది తమ గోడు పట్టించుకోలేదని వారు వాపోయారు. గతంలో ఒక కుక్క ఈ వైర్లు తగిలి చనిపోయిందన్నారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంపై లోకాయుక్త, మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. విషయం తెలుకుని గ్రామానికి వచ్చిన ఏడీఈని గ్రామస్తులు చుట్టుముట్టి నిలదీశారు. ఎంత మంది చస్తే పట్టించుకుంటారు. పోయిన ప్రాణాన్ని తీసుకొస్తారా అంటూ దుమ్మెత్తిపోశారు. ‘ఉన్న ఒక్క కొడుకును మీరు తీసుకుపోయారు. మేము ఎవరి కోసం బతకాలి. ఎలా బతకాలిరా దేముడా...మా ఉసురు పోసుకున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. మీరు ఎవరి కోసం ఉద్యోగాలు చేయ్యాలి. మీరు ఇప్పుడొచ్చి ఎవర్ని ఉద్ధరిస్తారు’ అంటూ మృతుడు శంకర్రావు తల్లిదండ్రులు భోరున విలపించారు. శంకర్రావు కుటుంబానికి న్యాయం చేయాలని సర్పంచ్ జి.సన్యాసప్పడు డిమాండ్‌చేశారు. ఎస్.కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘పొన్నాలకో హఠావో.. కాంగ్రెస్‌కో బచావో’
హైదరాబాద్: పొన్నాలకో హఠావో.. కాంగ్రెస్‌కో బచావో అని మాజీ మం త్రి పి.శంకర్రావు నినదించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ కంటోన్మెంట్లో కాంగ్రెస్ పరాజయానికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అసమర్థతే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌ను పట్టించుకునే నేతలు తెలంగాణలో లేరని పోయారన్నారు. పీసీసీ అధ్యక్షునిగా తనను నియమించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. -
ఆదుకుంటాడనుకుంటే..
తెర్లాం రూరల్: ఉన్నత చదువులు చదివించిన చిన్న కుమారుడు చేతికంది వచ్చాడని, కష్టసుఖాల్లో తమను ఆదుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రుల ఆశలు ఆడియాసలయ్యాయి. పెంచి పెద్ద చేసిన కొడుకు తమను సాకుతాడని భావించిన ఆ తల్లిదండ్రుల పట్ట విధి చిన్నచూపు చూసి ఆటో రూపంలో కొడుకును దూరం చేసింది. కొడుకు ప్రమాదంలో మృతిచెందాడని తెలుసుకుని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా భోరున విలపిస్తున్నారు. మండలంలోని నెమలాం గ్రామానికి చెందిన కోట సత్యంనాయుడు, చిన్నమ్మలు దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అప్పారావు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు శంకరరావు(24) బి.టెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి రాజాంలోని ప్రైవేటు కంపెనీలో కొంతకాలంగా సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విధులకు రాజాం వెళ్లేందుకు ఇంటి నుంచి బయలు దేరి వెళ్లి అంతలోనే గాయాలపాలయ్యాడని వార్త తెలియడంతోనే ఆ తల్లిదండ్రు లకు కాళ్లూచేతులూ ఆడలేదు. వివరాలిలా ఉన్నాయి. నెమలాం గ్రామం నుంచి పెరుమాళిలో గల మోడల్ స్కూల్‌కు ఇద్దరు విద్యార్థులతో పాటు శంకరరావు కూడా ఆటోలో వస్తున్నాడు. ఆటో గ్రామం దాటిన తరువాత పాములవలస గ్రామానికి సమీపంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో శంకరరావు తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే గ్రామానికి చెందిన విద్యార్థులు మడక అనిల్, కోట సత్యవతి స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన శంకరరావును, స్వల్పంగా గాయాలైన ఇద్దరు విద్యార్థులను చికిత్స నిమిత్తం రాజాంలోని కేర్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. శంకరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శంకరరావు మృతి చెందిన విషయం తెలియడంతో గ్రామస్తులు అధికసంఖ్యలో కేర్ ఆస్పత్రికి తరలివచ్చారు. శంకరరావు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, అన్నయ్య అప్పారావులు భోరున విలపించారు. ఆటో ప్రమాదంలో శంకరరావు మృతి చెందిన విషయాన్ని రాజాం కేర్ ఆస్పత్రి వైద్యులు తెర్లాం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఎస్సై శంభాన రవితోపాటు సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి, అనంతరం రాజాం కేర్ ఆస్పత్రికి వెళ్లారు. శంకరరావు మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రవి తెలిపారు. శోక సంద్రంలో నెమలాం అందరితో సరదాగా కలిసి మెలిసి ఉండే శంకరరావు ప్రమాదంలో మృతి చెందాడని తెలుసుకున్న నెమలాం గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. శంకరరావు ఉన్నత చదువు చదివినప్పటికీ అందరితోనూ ఎంతో కలివిడిగా ఉండేవాడని గ్రామస్తులు, తోటి స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు గుర్తు తెచ్చుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. -
ప్రభుత్వ లాంఛనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు
ఆమదాలవలస/ఆమదాలవలస రూరల్: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి 7వ వార్డు చింతాడకు చెందిన ఆర్మీ జవాన్ యాళ్ల భాస్కరరావు(అలియాస్ రాజశేఖర్)(25) అంత్యక్రియలు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. భాస్కరరావు విధి నిర్వహణలో ఉంటూ రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహం మంగళవారం తెల్లవారుజామున చింతాడకు తీసుకువచ్చారు. అంత్యక్రియల్లో నావీకాదళం చీఫ్ మార్షల్ రమేష్‌కుమార్, ఆర్మీ సుబేదారు ఎల్జే చౌదరి, హవల్దార్ ఎం.మురళీధర్, శ్రీకాకుళం తహశీల్దారు ఎస్.దీలిప్ చక్రవర్తి, ఆర్ఐ ఎస్.శంకరరావు పాల్గొన్నారు. విషాదంలో చింతాడ చింతాడ గ్రామంలోకి భాస్కరరావు మృతదేహాన్ని తీసుకురాగానే గ్రామమంతా విషాదఛాయలు అలముకున్నాయి. భాస్కరరావు తల్లిదండ్రులు సుందరరావు, రమణమ్మల రోదనలు పలువురిని కంటతడిపెట్టంచాయి. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా నిలుస్తాడనుకున్న చేతికందిన కొడుకు మరణవార్త వారికి అశనిపాతంగా తయారైంది.కొడుకు కష్టార్జితంతో ఇంటి నిర్మా ణం పూర్తి చేసినా గృహప్రవేశానికి కూడా రాలే దని, అక్టోబర్‌లో వస్తానని చెప్పిన కడసారి మాటలను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీ జవాన్ యాళ్ల భాస్కరరావు మృతి వార్తను తెలుసుకున్న మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మంగళవారం మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. భాస్కరరావు తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. నేవీ చీఫ్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నావికా దళం బ్యాండ్ పార్టీతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. నావికాదళం గాలిలో కాల్పు జరిపి అంత్యక్రియలు చేపట్టారు. -
శంకరరావు, సరస్వతి కుటుంబంతో...
చెన్నై ఘటనలో మృతి చెందిన మక్కువ మండలం గైశీల గ్రామానికి చెందిన వెంపటాపు శంకరరావు, మజ్జి సరస్వతి(అక్కా,తమ్ముళ్లు) కుటుంబాన్ని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. జగన్: ప్రమాదం జరిగినప్పుడు మీ కుటుంబంలో ఇద్దరు చనిపోయారా? తల్లి నారాయణమ్మ(భోరున విలపిస్తూ): ఔను బాబూ. మూడు సంవత్సరాల క్రితం అదే చెన్నైలో మరో కుమారుడు శ్రీను కూడా ఇలాగే చనిపోయాడు. జగన్: అయ్యో ఏడవకమ్మా... ఏం చేస్తాం. సహాయం అందిందా? కుటుంబ సభ్యులు: ప్రభుత్వం నుంచి అందింది. కానీ గతంలో చనిపోయిన శ్రీనుకు ఒక్కరూపాయి రాలేదు. జగన్: తమిళనాడు ప్రభుత్వం నుంచి సాయం అందలేదు కదా. బిల్డర్‌పై కేసు వేసి నష్ట పరిహారం రాబడదాం. జయలలిత ప్రభుత్వంలో తెలుగాయన ఒకరు ఉన్నారు. మాట్లాడదాం. నారాయణమ్మ: మా శంకరరావుకు మీరంటే ఎంతో ఇష్టం బాబూ. ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం రాలేదని బాధపడ్డాడు. తర్వాత చెన్నై వెళ్లి ఇలా అక్కా, తమ్ముడు చనిపోయారు మీరే ఆదుకోవాలి. జగన్: మీకు వ్యవసాయం ఉందా? పనులు చేస్తారా? శంకరరావు భార్య దుర్గమ్మ: కొంచెం ఉందండీ. ఏవో పనులు చేసుకుంటాం. నారాయణమ్మ : కూతురుకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు కుమారులకు ఇద్దరేసి పిల్లలు. అందరినీ నా దగ్గర వదిలేసి అందరూ చనిపోయారు బాబూ. ఈ వయసులో నన్ను పెంచాల్సింది పోయి వారి పిల్లల్ని పెంచే బాధ్యతలు అప్పగించారు. జగన్: ఆదుకుంటామమ్మా... బాధ పడకండి. మా ఎమ్మెల్యేలు రాజన్నదొర, సుజయ్కృష్ణరంగారావులు అందుబాటులో ఉంటారు. కుటుంబసభ్యులు: సరస్వతి కొడుకు ఐటీఐ చదువుతున్నాడు బాబూ ఉద్యోగం చూడండి. జగన్: నేను చేయనిది చెప్పనమ్మా. నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నేను ఉద్యోగాలు వేయలేను కదా. ప్రభుత్వంతో పోరాడి పిల్లలందరినీ రెసిడెన్షియల్ స్కూళ్లలో వేసే ఏర్పాటు చేద్దాం. చెన్నై బిల్డర్‌తో మాట్లాడి పరిహారం అందేలా చేద్దాం. -
కాంగ్రెస్‌లో ముసలం!
ఘోర పరాజయంపై పార్టీ నేతల పరస్పర ఆరోపణలు పొన్నాల, దిగ్విజయ్, జానారెడ్డి లక్ష్యంగా విమర్శలు దిగ్విజయ్‌సింగ్, పొన్నాలా.. పార్టీ వదిలి వెళ్లిపోండి: పాల్వాయి పొన్నాలే బాధ్యుడు: మధుయాష్కీ పొన్నాల ను తప్పించాల్సిందే: శంకర్రావు హైదరాబాద్: టీ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. తెలంగాణలో ఘోర పరాజయం పాలై 24 గంటలు కూడా గడవక ముందే ఆ పార్టీ నేతలు రోడ్డున పడ్డా రు. ఓటమికి మీరంటే మీరే కారణమంటూ దూషణల పర్వానికి దిగుతున్నారు. తమ ఓటమికి స్థానిక నేతలే కారణమంటూ అసెంబ్లీ అభ్యర్థులు వాపోతోంటే... టీపీసీసీ నాయకత్వమే ప్రధాన కారణమంటూ ఎంపీ అభ్యర్థులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు సీనియర్ నేతలైతే ఏకంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యల వల్లే పార్టీ ఇంత ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందంటూ మండిపడుతున్నారు. పలువురు నేతలు దీనిపై నేరుగా సోనియాగాంధీకి ఫిర్యాదు చేసే పనిలో పడ్డారు. పొన్నాలే లక్ష్యం.. ముఖ్యంగా పొన్నాల లక్ష్మయ్యకు విమర్శల తాకిడి ఎక్కువగా ఉంది. తక్షణమే ఆయనను టీ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింటుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా... ఇక్కడ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైందంటే దానికి టీపీసీసీ నాయకత్వ వైఫల్యమే కారణమని పార్టీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సోనియావల్లే తెలంగాణ వచ్చిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, అందుకు తగిన కార్యక్రమాలు రూపొందించి జనాన్ని పార్టీవైపు ఆకర్షించడంలో పొన్నాల దారుణంగా విఫలమయ్యారని వారు మండిపడుతున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించిననాటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఒక్క బహిరంగ సభ కూడా నిర్వహించలేకపోయారంటే తెలంగాణ పార్టీ నాయకత్వ వైఫల్యం ఏమేరకు ఉందో అర్థమవుతోందని చెబుతున్నారు. మరికొందరు నేతలైతే ఏకంగా మాజీ మంత్రి జానారెడ్డితోపాటు తెలంగాణ సీఎం రేసులో ఉన్న నాయకులూ పార్టీ పరాభవానికి కారణమని మండిపడుతున్నారు. పీసీసీ చీఫ్‌గా పనిచేసిన సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఓటమికి సోనియాను బాధ్యురాలిని చేయడం ఏమాత్రం సరికాదు. పార్టీ రాష్ట్ర ఇన్చార్జి చెప్పే మాటలు, ఇచ్చే నివేదికలపైనే ఆమె ఆధారపడతారు. దీనికంతటికీ దిగ్విజయ్‌సింగ్ కారణం. పొన్నాలను టీపీసీసీ సారథిగా నియమించాలనే ఆలోచన కూడా దిగ్విజయ్‌దే. సీమాంధ్రకు చెందిన ఒక రాజ్యసభ ఎంపీ చెప్పినట్లే దిగ్విజయ్ నడిచారు. తెలంగాణలో ఈ పరిస్థితిని తెచ్చారు..’’అని వాపోయారు. పొన్నాల ఓ బేవకూఫ్: పాల్వాయి కాంగ్రెస్ ఓటమికి దిగ్విజయ్‌సింగ్, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డిలే ప్రధాన కారణమని ఆ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవాలని, తెలంగాణ బిల్లులో ఆయనను భాగస్వామిని చేయాలని చెప్పినా వారు వినలేదని, కేసీఆర్ వస్తే వాళ్లకు సీఎం పదవి దక్కదనే దురాశతో వ్యతిరేకించారన్నారు. అధికారాన్ని అనుభవించి డబ్బులు దండుకున్న మంత్రులు కూడా దీనికి ఒప్పుకోలేదని పేర్కొన్నారు. ‘‘అసలు పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే బుద్ధి తక్కువ పని. పొన్నాల ముఖం చూస్తే ఎవరైనా ఓట్లేస్తరా? పార్టీని నడిపే శక్తి లేనోడు. సభలు నిర్వహించడం చేతకానోడు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ ఎవడైనా 30 వేల ఓట్లతో ఓడిపోతడా? అట్లాంటోడ్ని ఏమనాలి? అసలు పొన్నాలకు పార్టీ నాయకత్వం ఎట్లా అప్పగించిండ్రు? దీనికంతటికీ దిగ్విజయ్‌సింగే ప్రధాన కారణం. ఆయన కేవీపీ చెప్పినట్లే నడిచిండు. ఎమ్మెల్యే టికెట్లను కూడా అమ్ముకున్నరు. నా దగ్గర ఆధారాలున్నయి. సమయం వచ్చినప్పుడు బయటపెడతా. నెహ్రూతో కలిసి పనిచేసిన నాకు షోకాజ్ ఇస్తడా? ఇట్లాంటి బేవకూఫ్గాళ్లను గాంధీభవన్‌లో కూర్చోబెడితే పార్టీ ఓడిపోక ఏం జేస్తది? పొన్నాలను వెంటనే పార్టీ నుంచి తప్పించాలి. అట్లాగే దిగ్విజయ్‌సింగ్.. నువ్వు కూడా పార్టీని వదిలి పో.. నేను సోనియాగాంధీని కలిసి ఈ విషయాలన్నీ చెబుతా’’ అని పేర్కొన్నారు. పాల్వాయికి మతి చలించింది: టీపీసీసీ ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి.. లేకుంటే బహిష్కరణే రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పెద్ద బ్లాక్‌మెయిలర్ అని, ఆయనకు మతి చలించిందని టీపీసీసీ మండిపడింది. దిగ్విజయ్, పొన్నాల లక్ష్మయ్యలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేనిపక్షంలో పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. శనివారం పాల్వాయి చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న పొన్నాల వెంటనే ప్రెస్‌మీట్ నిర్వహించాలని అధికార ప్రతినిధులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధులు కొనగాల మహేష్, జిట్టా సురేందర్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పాల్వాయి వ్యాఖ్యలను ఖండించారు. ఆయనకు మతి పూర్తిగా చలించిందని ఎద్దేవా చేశారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పాల్వాయిని అధిష్టానం రాజ్యసభకు పంపించిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి షోకాజ్ అందుకున్న పాల్వాయికి దిగ్విజయ్, పొన్నాల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని పేర్కొన్నారు. పొన్నాలను టీపీసీసీ చీఫ్‌గా నియమించడం హైకమాండ్ నిర్ణయమని, దాన్ని వ్యతిరేకించడమంటే హైకమాండ్‌ను ధిక్కరించినట్లేనని వ్యాఖ్యానించారు. నియామకమే ఓటమికి సంకేతం: మధుయాష్కీ ‘‘టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడమే కాంగ్రెస్ ఓటమికి తొలి మెట్టు. ఎన్నికల్లో పార్టీ నేతలెవరినీ కలుపుకొనిపోలేదు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ తెలంగాణ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. ఎన్నికల్లో ఓటమికి పొన్నాల బాధ్యత వహించాల్సిందే.’’ ఆయన వల్లే పార్టీ నాశనమైంది: పి.శంకర్రావు ‘‘తెలంగాణలో పార్టీ ఓటమికి పొన్నాల లక్ష్మయ్య నైతిక బాధ్యత వహించి తప్పుకోవాల్సిందే. ఆయనవల్లనే పార్టీ నాశనమైంది. ఎంతో కష్టపడి సోనియా తెలంగాణ ఇచ్చినా ప్రజలకు ఆ విషయాన్ని చెప్పలేకపోయిండు. సీనియర్లను ఏకతాటిపైకి నడిపించడంలో ఫెయిలైండు. పార్టీ అధికారంలోకి రాకపోయినా ఫరవాలేదన్నట్లు వ్యవహరించిండు. ఎన్నికల్లో సొంత నియోజకవర్గం దాట లేదు.’’ -
విధేయతకు మీరిచ్చే గౌరవం ఇదేనా?: శంకర్రావు
సాక్షి, హైదరాబాద్: అవినీతిని అంతం చేయాలని తాను పోరాటం చేస్తే తననే రాజకీయంగా అంతం చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనకు టికెట్ నిరాకరించడంపై ఆయన మంగళవారం జెమినీ కాలనీలోని తన నివాసంలో కూతురు సుస్మితతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ... నెహ్రూ, గాంధీ కుటుంబాలకు విధేయుడుగా ఉంటున్న తనకిచ్చే బహుమానం ఇదేనా? అని పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో విధేయతకు స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, కేవీపీ రామచంద్రరావుల కనుసన్నల్లోనే టికెట్ల కేటాయింపు జరిగిందని ఆరోపించారు. జలయజ్ఞంలో జరిగిన అవినీతిపై పోరాటం చేసినందుకే పొన్నాల తనకు టికెట్ నిరాకరించారని విమర్శించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దళితుడేనని జైరాం రమేష్ ప్రకటించిన తర్వాత తనకు ఎక్కడ అడ్డమొస్తాడోనని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా కుట్ర చేసి తనకు టికెట్ రాకుండా చేశాడని ఆరోపించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. -
తాడోపేడో!
టీడీపీ అధినేత చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు అసంతృప్త నేతలు సిద్ధమవుతున్నారు. ఐదేళ్లుగా కష్టపడిన వారికి కాకుండా ఎన్నికల వేళ డబ్బుతో ముడిపెట్టి నిర్ణయాలు తీసుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ మేరకు జిల్లాలో జరిగే ‘ప్రజా గర్జన’కు బుధవారం వస్తున్న అధినేత ముందు తమ ఆవేదన వెళ్లగక్కాలన్న ఆత్రుతతో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా జరిగే సమీక్షలో బాహాటంగా తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే నిలదీయాలని యోచిస్తున్నారు. డీవీజీ శంకరరావు, బొబ్బిలి చిరంజీవులు, పడాల అరుణ ...ఇలా ఒక్కొక్కరు చెప్పుకుని పోతే చాంతాడంత జాబితా కనిపిస్తోంది. వీరంతా అధినేతకు ఎలాంటి సవాల్ విసురుతారో చూడాలి. అరకు ఎంపీ టిక్కెట్ వస్తుందన్న ఆశతో పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తూ వచ్చిన మాజీ ఎంపీ డీవీజీ శంకరరావుకు ఈసారి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అరకు పార్లమెంట్ అభ్యర్థిగా గుమ్మడి సంధ్యారాణి పోటీ చేస్తారని చంద్రబాబు తొలుత ప్రకటించగా, ఆమె కాదనడంతో శోభా హైమావతి కుమార్తె స్వాతిరాణిని తెరపైకి తీసుకువచ్చారు. అంతేకాకుండా నియోజకవర్గంలో పర్యటించాలని, పార్టీ నేతలను కలుసుకోవాలని, ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచనప్రాయంగా ఆదేశించారు. దీంతో ఆమె జోరు పెంచారు -
‘శంకర’గిరి మాన్యాలేనా..!
పదేళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అధిష్టానం ఆదేశించిన పనులన్నీ బాధ్యతగా నిర్వహించారు. గత సారి పొత్తు కారణంగా కోల్పోయిన టిక్కెట్, ఈసారి ఎలాగైనా తనకు లభిస్తుందని ఆశించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్న మాజీ ఎంపీ, టీడీపీ నేత డీవీజీ శంకరరావుకు ఈసారి కూడా టిక్కెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు. దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. అరుకు ఎంపీ, అటు సాలూరు ఎమ్మెల్యే స్థానాలను ఆశించినా...నెరవేరే అవకాశం కనిపించడం లేదు. అధినేత కూడా ఆయన్ను పెద్దగా పట్టించుకున్నట్టు దాఖలాలులేవు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : మాజీ ఎంపీ, టీడీపీ నేత డీవీజీ శంకరరావుకు ఈసారీ టిక్కెట్ లభించే అవకాశం కనిపించడం లేదు. గత ఎన్ని కల్లో పొత్తుల కారణంగా టిక్కెట్ దక్కని డీవీజీకి ఈసారి అధిష్టానమే మొండి చేయి చూపిస్తోంది. దీంతో ఆయన డైలామాలో పడ్డారు. అధినేతతో తేల్చుకోవాలనే యోచనకొచ్చారు. వామపక్షాల పొత్తుతో మిస్ వైద్య వృతిలో ఉన్న డీవీజీ శంకరావు పార్వతీపురం లోకసభ నుంచి 1999లో తొలిసారిగా టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2004లో అదే లోకసభ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. ఇంతలోనే నియోజకవర్గ పునర్విభజన జరగడంతో కొత్తగా ఏర్పాటైన అరకు లోకసభ నియోజకవర్గం నుంచి 2009లో పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ఎన్నికల్లో వామపక్షాలతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల సీపీఎంకు ఆ టిక్కెట్ దక్కింది. దీంతో లోకసభపై అశలు వదులుకున్నారు. కనీసం ఎమ్మెల్యేగానైనా బరిలోకి దిగాలని యోచించారు. అప్పటికే కుల వివాదం కారణంగా వేటుకు గురైన ఆర్.పి.భంజదేవ్ స్థానంలో పోటీ చేయాలని రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ రాత్రికి రాత్రి కాంగ్రెస్ నుంచి వచ్చిన గుమ్మడి సంధ్యారాణికి టిక్కెట్ ఇచ్చి శంకరరావుకు పార్టీ అధినేత చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినా పార్టీని వదలకుండా పనిచేస్తూ వచ్చారు. చంద్రబాబు ఆలోచనతో డౌట్ 2014ఎన్నికలే లక్ష్యంగా క్రీయాశీలకంగా పనిచేశారు. అరకు లోకసభ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పార్టీ బాధ్యతల్ని చేపట్టారు. తప్పనిసరిగా తనకే టిక్కెట్ వస్తుందని, బరిలోకి దిగాల్సి ఉంటోందని శంకరరావు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ చంద్రబాబు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఈసారి అరకు ఎంపీ టిక్కెట్‌కు మహిళకు ఇవ్వాలన్న ఆలోచనకొచ్చారు. ఆ మధ్య హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమన్వయకర్తల సమావేశంలో అరకు ఎంపీగా గుమ్మడి సంధ్యారాణిని బరిలోకి దించుదామని చంద్రబాబు ప్రతిపాదించారు. అందరూ సహకరించాలని పరిధిలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్లందర్నీ కోరారు. ఇతరత్రా కారణాలతో ఆ సమావేశానికి డీవీజీ శంకరరావు హాజరు కాలేదు. కానీ చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయం తెలుసుకుని డీవీజీ అవాక్కయ్యారు. అయితే, ఇంతలో ఎంపీ అభ్యర్థత్వాన్ని సంధ్యారాణి వ్యతిరేకించడంతో కొంత ఊపిరిపీల్చుకున్నారు. శోభా హైమావతి రూపంలో చుక్కెదురు కానీ శోభా హైమవతి రూపంలో మళ్లీ చుక్కెదురైంది. ఎస్. కోట ఎమ్మెల్యేగా పోటీకి తనకు అవకాశమివ్వాలని లేదంటే అరుకు లోకసభ అభ్య ర్థిగా తన కుమార్తె స్వాతిరాణిని నిలబెట్టాలని చంద్రబాబును శోభా ైహైమవతి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఎంపీ టిక్కెట్ ైెహ మవతి కుమార్తెకు ఇచ్చేందుకు చంద్రబాబు హమీ ఇచ్చారని తెలిసింది. అందుకు గుమ్మడి సంధ్యారాణి, కోళ్ల లలితకుమారి వంతు పాడినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. స్వాతిరాణికి ఎంపీ టిక్కెట్ ఇస్తే తాను అరుకు ఎంపీగా పోటీచేసే బాధ్యత తప్పిపోతుందని సంధ్యారాణి, తనకు ఎస్. కోట ఎమ్మెల్యే టిక్కెట్‌కు లైన్ క్లీయరవుతుందని కోళ్ల లలితకుమారి ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే శోభా హైమవతి తన కుమార్తె స్వాతిరాణిని సోమవారం జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చి నేతలందరికీ పరిచయం చేశారు. అశోక్ గజపతిరాజు ఆశీస్సులు కూడా తీసుకున్నట్టు తెలిసింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న డీవీజీ పరిస్థితి సందిగ్ధంలో పడింది. గత ఎన్నికల మాదిరిగానే సాలూరు ఎమ్మెల్యేగానైనా పోటీ చేద్దామంటే సంధ్యారాణి పెద్ద అడ్డంకిగా నిలిచారు. ఒకవేళ సంధ్యారాణిని ఎంపీగా పోటీ చేయించినా కుల వివాదం నుంచి బయటపడి రేసులో నిలబడేందుకు ఆర్.పి.భంజ్‌దేవ్ సిద్ధమవుతున్నారు. దీంతో డీవీజీకి తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ మొండి చేయి ఎదురైనట్టు ఉందన్న అభిప్రాయానికొచ్చారు. ఈమేరకు త్వరలోనే హైదరాబాద్ వెళ్లి, చంద్రబాబుతో మాట్లాడి, టిక్కెట్ విషయమై తేల్చుకునే యోచనలో ఉన్నారు. -
సిఎంపై సిబిఐకి లేఖ రాస్తా : శంకర్రావు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతితో అక్రమ ఆస్తులు కూడగట్టారని మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు, ఆ తరువాత పెరిగిన ఆస్తులపై సీబీఐకి లేఖ రాస్తానని చెప్పారు. సీబీఐ విచారణ జరిగితే సీఎం జైలు కెళ్లడం ఖాయం అని ఆయన పేర్కొన్నారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించిన నాటి నుంచి శంకర్రావు సిఎంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. సిఎం, అతని తమ్ముడి అవినీతి భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపెడుతూనే ఉన్నారు. ఈ సారి ఏకంగా సిబిఐకి లేఖ రాస్తానని అంటున్నారు. -
సిఎం పార్టీ పాతాళానికి - చేరినవారు కైలాసానికి : శంకర్రావు
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్తగా రాజకీయ పార్టీ పెడితే, ఆ పార్టీ పాతాళానికి వెళుతుందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. ఆ పార్టీలో చేరినవారు కైలాసానికి వెళ్తారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలో ఈరోజు ఆయన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. సీల్డ్‌కవర్ సీఎంకు అధిష్టానాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని శంకర్రావు జోస్యం చెప్పారు. ఈనెల 29 తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుపై మాట్లాడదామని ముఖ్యమంత్రి తనతో అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా సీఎం కొత్త పార్టీ పెడితే అందులో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ నేపధ్యంలో శంకర్రావు ఈ వ్యాఖ్యలు చేశారు. -
బాబుకు బాలయ్య, శంకర్రావు పరామర్శ
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను సోమవారం బాలకృష్ణ పరామర్శించారు. అలాగే మాజీ మంత్రి , కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు కూడా పరామర్శించనవారిలో ఉన్నారు. పరామర్శ అనంతరం శంకర్రావు మాట్లాడుతూ చంద్రబాబు తనకు మిత్రుడని, అందుకే పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేదని ఆయన అన్నారు. టీడీపీ నేతలు కూడా అధ్యక్షుడిని పరామర్శించేందుకు వస్తున్నారు. కాగా చంద్రబాబు షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు బాబు త్వరగా కోలుకోవాలంటూ కార్యకర్తలు పూజలు నిర్వహించారు.