కాంగ్రెస్‌లో ముసలం! | aspersion to the congrerss | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ముసలం!

Published Sun, May 18 2014 3:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌లో ముసలం! - Sakshi

కాంగ్రెస్‌లో ముసలం!

ఘోర పరాజయంపై పార్టీ నేతల పరస్పర ఆరోపణలు  పొన్నాల, దిగ్విజయ్, జానారెడ్డి లక్ష్యంగా విమర్శలు
 
దిగ్విజయ్‌సింగ్, పొన్నాలా.. పార్టీ వదిలి వెళ్లిపోండి: పాల్వాయి
పొన్నాలే బాధ్యుడు: మధుయాష్కీ
పొన్నాల ను తప్పించాల్సిందే: శంకర్‌రావు     

 
హైదరాబాద్: టీ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. తెలంగాణలో ఘోర పరాజయం పాలై 24 గంటలు కూడా గడవక ముందే ఆ పార్టీ నేతలు రోడ్డున పడ్డా రు. ఓటమికి మీరంటే మీరే కారణమంటూ దూషణల పర్వానికి దిగుతున్నారు. తమ ఓటమికి స్థానిక నేతలే కారణమంటూ అసెంబ్లీ అభ్యర్థులు వాపోతోంటే... టీపీసీసీ నాయకత్వమే ప్రధాన కారణమంటూ ఎంపీ అభ్యర్థులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు సీనియర్ నేతలైతే ఏకంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యల వల్లే పార్టీ ఇంత ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందంటూ మండిపడుతున్నారు. పలువురు నేతలు దీనిపై నేరుగా సోనియాగాంధీకి ఫిర్యాదు చేసే పనిలో పడ్డారు.

పొన్నాలే లక్ష్యం..

ముఖ్యంగా పొన్నాల లక్ష్మయ్యకు విమర్శల తాకిడి ఎక్కువగా ఉంది. తక్షణమే ఆయనను టీ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింటుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా... ఇక్కడ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైందంటే దానికి టీపీసీసీ నాయకత్వ వైఫల్యమే కారణమని పార్టీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సోనియావల్లే తెలంగాణ వచ్చిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, అందుకు తగిన కార్యక్రమాలు రూపొందించి జనాన్ని పార్టీవైపు ఆకర్షించడంలో పొన్నాల దారుణంగా విఫలమయ్యారని వారు మండిపడుతున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించిననాటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఒక్క బహిరంగ సభ కూడా నిర్వహించలేకపోయారంటే తెలంగాణ పార్టీ నాయకత్వ వైఫల్యం ఏమేరకు ఉందో అర్థమవుతోందని చెబుతున్నారు. మరికొందరు నేతలైతే ఏకంగా మాజీ మంత్రి జానారెడ్డితోపాటు తెలంగాణ సీఎం రేసులో ఉన్న నాయకులూ పార్టీ పరాభవానికి కారణమని మండిపడుతున్నారు. పీసీసీ చీఫ్‌గా పనిచేసిన సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఓటమికి సోనియాను బాధ్యురాలిని చేయడం ఏమాత్రం సరికాదు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి చెప్పే మాటలు, ఇచ్చే నివేదికలపైనే ఆమె ఆధారపడతారు. దీనికంతటికీ దిగ్విజయ్‌సింగ్ కారణం. పొన్నాలను టీపీసీసీ సారథిగా నియమించాలనే ఆలోచన కూడా దిగ్విజయ్‌దే. సీమాంధ్రకు చెందిన ఒక రాజ్యసభ ఎంపీ చెప్పినట్లే దిగ్విజయ్ నడిచారు. తెలంగాణలో ఈ పరిస్థితిని తెచ్చారు..’’అని వాపోయారు.

పొన్నాల ఓ బేవకూఫ్: పాల్వాయి

 కాంగ్రెస్ ఓటమికి దిగ్విజయ్‌సింగ్, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డిలే ప్రధాన కారణమని ఆ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవాలని, తెలంగాణ బిల్లులో ఆయనను భాగస్వామిని చేయాలని చెప్పినా వారు వినలేదని, కేసీఆర్ వస్తే వాళ్లకు సీఎం పదవి దక్కదనే దురాశతో వ్యతిరేకించారన్నారు. అధికారాన్ని అనుభవించి డబ్బులు దండుకున్న మంత్రులు కూడా దీనికి ఒప్పుకోలేదని పేర్కొన్నారు. ‘‘అసలు పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే బుద్ధి తక్కువ పని. పొన్నాల ముఖం చూస్తే ఎవరైనా ఓట్లేస్తరా? పార్టీని నడిపే శక్తి లేనోడు. సభలు నిర్వహించడం చేతకానోడు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ ఎవడైనా 30 వేల ఓట్లతో ఓడిపోతడా? అట్లాంటోడ్ని ఏమనాలి? అసలు పొన్నాలకు పార్టీ నాయకత్వం ఎట్లా అప్పగించిండ్రు? దీనికంతటికీ దిగ్విజయ్‌సింగే ప్రధాన కారణం. ఆయన కేవీపీ చెప్పినట్లే నడిచిండు. ఎమ్మెల్యే టికెట్లను కూడా అమ్ముకున్నరు. నా దగ్గర ఆధారాలున్నయి. సమయం వచ్చినప్పుడు బయటపెడతా. నెహ్రూతో కలిసి పనిచేసిన నాకు షోకాజ్ ఇస్తడా? ఇట్లాంటి బేవకూఫ్‌గాళ్లను గాంధీభవన్‌లో కూర్చోబెడితే పార్టీ ఓడిపోక ఏం జేస్తది? పొన్నాలను వెంటనే పార్టీ నుంచి తప్పించాలి. అట్లాగే దిగ్విజయ్‌సింగ్.. నువ్వు కూడా పార్టీని వదిలి పో.. నేను సోనియాగాంధీని కలిసి ఈ విషయాలన్నీ చెబుతా’’ అని పేర్కొన్నారు.
 
 పాల్వాయికి మతి చలించింది: టీపీసీసీ
 ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి.. లేకుంటే బహిష్కరణే

 రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పెద్ద బ్లాక్‌మెయిలర్ అని, ఆయనకు మతి చలించిందని టీపీసీసీ మండిపడింది. దిగ్విజయ్, పొన్నాల లక్ష్మయ్యలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేనిపక్షంలో పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. శనివారం పాల్వాయి చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న పొన్నాల వెంటనే ప్రెస్‌మీట్ నిర్వహించాలని అధికార ప్రతినిధులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధులు కొనగాల మహేష్, జిట్టా సురేందర్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పాల్వాయి వ్యాఖ్యలను ఖండించారు. ఆయనకు మతి పూర్తిగా చలించిందని ఎద్దేవా చేశారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పాల్వాయిని అధిష్టానం రాజ్యసభకు పంపించిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి షోకాజ్ అందుకున్న పాల్వాయికి దిగ్విజయ్, పొన్నాల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని పేర్కొన్నారు. పొన్నాలను టీపీసీసీ చీఫ్‌గా నియమించడం హైకమాండ్ నిర్ణయమని, దాన్ని వ్యతిరేకించడమంటే హైకమాండ్‌ను ధిక్కరించినట్లేనని వ్యాఖ్యానించారు.
 
 నియామకమే ఓటమికి సంకేతం: మధుయాష్కీ

‘‘టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడమే కాంగ్రెస్ ఓటమికి తొలి మెట్టు. ఎన్నికల్లో పార్టీ నేతలెవరినీ కలుపుకొనిపోలేదు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ తెలంగాణ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. ఎన్నికల్లో ఓటమికి పొన్నాల బాధ్యత వహించాల్సిందే.’’

 ఆయన వల్లే పార్టీ నాశనమైంది: పి.శంకర్‌రావు

 ‘‘తెలంగాణలో పార్టీ ఓటమికి పొన్నాల లక్ష్మయ్య నైతిక బాధ్యత వహించి తప్పుకోవాల్సిందే. ఆయనవల్లనే పార్టీ నాశనమైంది. ఎంతో కష్టపడి సోనియా తెలంగాణ ఇచ్చినా ప్రజలకు ఆ విషయాన్ని చెప్పలేకపోయిండు. సీనియర్లను ఏకతాటిపైకి నడిపించడంలో ఫెయిలైండు. పార్టీ అధికారంలోకి రాకపోయినా ఫరవాలేదన్నట్లు వ్యవహరించిండు. ఎన్నికల్లో సొంత నియోజకవర్గం దాట లేదు.’’
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement