‘కవిత కోసం బీఆర్‌ఎస్‌ మంతనాలు.. బండి సంజయ్‌ వ్యాఖ్యల మర్మమదే’ | Congress Madhu Yashki Interesting Comments Over Kalvakuntla Family | Sakshi
Sakshi News home page

‘కవిత కోసం ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ మంతనాలు.. బండి సంజయ్‌ వ్యాఖ్యల మర్మమదే’

Published Mon, Jul 15 2024 4:59 PM | Last Updated on Mon, Jul 15 2024 5:42 PM

Congress Madhu Yashki Interesting Comments Over Kalvakuntla Family

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంపై ఆ పార్టీ సీనియర్‌ నేత మధుయాష్కీ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఏఐసీసీ డైరక్షన్‌ మేరకే రాష్ట్రంలో చేరికలు జరుగుతున్నాయన్నారు. అలాగే, లిక్కర్‌ స్కాంలో కవితను విడిపించేందుకు ఢిల్లీ పెద్దలతో బీఆర్‌ఎస్‌ నేతలు మంతనాలు జరుపుతున్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

కాగా, మధుయాష్కీ తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌లో చేరికలు ఏఐసీసీ డైరెక్షన్‌ మేరకే జరుగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిచిన మూడు రోజులకే సర్కార్‌ పడిపోతుందన్నారు. దళిత నేత భట్టి విక్రమార్క సీఎల్పీగా ఉన్నప్పుడు ఆ హోదా పోయేలా బీఆర్‌ఎస్‌ పనిచేయలేదా?. దళితుల వ్యతిరేకంగా ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్‌ పనిచేశారు. 

బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేర్చుకున్న నేతలకు మంత్రి పదవులు ఇస్తుంది. ప్రజా గాయకుడు గద్దర్‌ను గేటు వద్దనే గంటల తరబడి నిలబెట్టింది కేసీఆర్ కాదా?. ప్రజా పాలనలో అందరికీ మాట్లాడే స్వేచ్చ ఉంది. సీఎం రేవంత్‌ ఎవరైనా కలవొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చొరబడి తానే ఉద్యమం చేసినట్లు కలరింగ్ ఇచ్చాడు. కేంద్రంలో అధికారంలోకి వస్తాం అనుకున్నాం. మంత్రి పదవులు ఇస్తాం అని ఎవరికీ చెప్పడం లేదు.

రైతు కుటుంబం నుండి వచ్చిన రేవంత్ సీఎం అయితే కేసీఆర్‌ ఓర్వడం లేదు. పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్, నేను చాలా కష్టపడ్డాం. నేను నేరుగా అమెరికా నుండి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో 50 ఏళ్లకు పైగా ఉన్నాను. నేను ఏ పార్టీ మారలేదు, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.

లిక్కర్‌ స్కామ్‌లో కవిత అరెస్ట్‌పైనే ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది. కల్వకుంట్ల కవిత విడుదల కోసం బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలపాలని కేసీఆర్‌, కేటీఆర్‌ చూస్తున్నారు. ఈ అంశంపై ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారు. హరీష్‌రావుపై బండి సంజయ్‌ ప్రేమ కురిపించడానికి కారణం అదే’ అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావుపై నిన్న(ఆదివారం)బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న ఒకే ఒక మంచి నాయకుడు, వివాదరహితుడు హరీష్‌ రావు ఒక్కడే అని అన్నారు. అలాగే, హరీష్‌ ఒకవేళ బీజేపీలో చేరాలనుకుంటే రాజీనామా చేశాకే చేరాలని కామెంట్స్‌ చేశారు.

కాగా, నిజంగా ఉద్యోగం కోసం రాసే వారు ఎవరు ఉద్యోగాలను వాయిదా వేయాలని అడగరు. ఉద్యోగాలు వాయిదా వేయడం వలన 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. శిక్షణ తరగతులు చెప్పే కోచింగ్ సెంటర్లలో కేసీఆర్‌ కుటుంబానికి వాటాలు ఉన్నాయి. అందుకే పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారు. నారాయణ, చైతన్య కాలేజీలలో హరీష్, కవితకు 17 శాతం వాటాలు ఉన్నాయి.

ఇక, పీసీసీ చీఫ్ ఎంపికపై ఢిల్లీలో అసలు చర్చే లేదు. మంత్రివర్గ విస్తరణపై జరిగింది. ఎవరెవరికి మంత్రి పదవులివ్వాలి. ఏయే శాఖలు ఇవ్వాలి అనే దానిపై చర్చ జరిగింది. అదే రోజు పీసీసీపై ఐదు నిమిషాలు చర్చించి పక్కకు పెట్టారు. కొందరు మంత్రులు కూడా తమకు సరైన శాఖలు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. మంత్రులపై సమన్వయం చేసే దానిపై చర్చ జరిగింది. కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకంలో ఇంఛార్జి దీపాదాస్ మున్షి పాత్ర ఏమీ లేదు. సీఎం రేవంత్‌, మంత్రులు శ్రీధర్‌ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement