టీడీపీ అధినేత చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు అసంతృప్త నేతలు సిద్ధమవుతున్నారు. ఐదేళ్లుగా కష్టపడిన వారికి కాకుండా ఎన్నికల వేళ డబ్బుతో ముడిపెట్టి నిర్ణయాలు తీసుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు.
ఈ మేరకు జిల్లాలో జరిగే ‘ప్రజా గర్జన’కు బుధవారం వస్తున్న అధినేత ముందు తమ ఆవేదన వెళ్లగక్కాలన్న ఆత్రుతతో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా జరిగే సమీక్షలో బాహాటంగా తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే నిలదీయాలని యోచిస్తున్నారు. డీవీజీ శంకరరావు, బొబ్బిలి చిరంజీవులు, పడాల అరుణ ...ఇలా ఒక్కొక్కరు చెప్పుకుని పోతే చాంతాడంత జాబితా కనిపిస్తోంది. వీరంతా అధినేతకు ఎలాంటి సవాల్ విసురుతారో చూడాలి.
అరకు ఎంపీ టిక్కెట్ వస్తుందన్న ఆశతో పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తూ వచ్చిన మాజీ ఎంపీ డీవీజీ శంకరరావుకు ఈసారి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అరకు పార్లమెంట్ అభ్యర్థిగా గుమ్మడి సంధ్యారాణి పోటీ చేస్తారని చంద్రబాబు తొలుత ప్రకటించగా, ఆమె కాదనడంతో శోభా హైమావతి కుమార్తె స్వాతిరాణిని తెరపైకి తీసుకువచ్చారు. అంతేకాకుండా నియోజకవర్గంలో పర్యటించాలని, పార్టీ నేతలను కలుసుకోవాలని, ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచనప్రాయంగా ఆదేశించారు. దీంతో ఆమె జోరు పెంచారు