ప్రభుత్వ లాంఛనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు
ఆమదాలవలస/ఆమదాలవలస రూరల్: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి 7వ వార్డు చింతాడకు చెందిన ఆర్మీ జవాన్ యాళ్ల భాస్కరరావు(అలియాస్ రాజశేఖర్)(25) అంత్యక్రియలు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. భాస్కరరావు విధి నిర్వహణలో ఉంటూ రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహం మంగళవారం తెల్లవారుజామున చింతాడకు తీసుకువచ్చారు. అంత్యక్రియల్లో నావీకాదళం చీఫ్ మార్షల్ రమేష్‌కుమార్, ఆర్మీ సుబేదారు ఎల్‌జే చౌదరి, హవల్దార్ ఎం.మురళీధర్, శ్రీకాకుళం తహశీల్దారు ఎస్.దీలిప్ చక్రవర్తి, ఆర్‌ఐ ఎస్.శంకరరావు పాల్గొన్నారు.
విషాదంలో చింతాడ
చింతాడ గ్రామంలోకి భాస్కరరావు మృతదేహాన్ని తీసుకురాగానే గ్రామమంతా విషాదఛాయలు అలముకున్నాయి. భాస్కరరావు తల్లిదండ్రులు సుందరరావు, రమణమ్మల రోదనలు పలువురిని కంటతడిపెట్టంచాయి. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా నిలుస్తాడనుకున్న చేతికందిన కొడుకు మరణవార్త వారికి అశనిపాతంగా తయారైంది.కొడుకు కష్టార్జితంతో ఇంటి నిర్మా ణం పూర్తి చేసినా గృహప్రవేశానికి కూడా రాలే దని, అక్టోబర్‌లో వస్తానని చెప్పిన కడసారి మాటలను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీ జవాన్ యాళ్ల భాస్కరరావు మృతి వార్తను తెలుసుకున్న మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మంగళవారం మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. భాస్కరరావు తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. నేవీ చీఫ్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నావికా దళం బ్యాండ్ పార్టీతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. నావికాదళం గాలిలో కాల్పు జరిపి అంత్యక్రియలు చేపట్టారు.