విధేయతకు మీరిచ్చే గౌరవం ఇదేనా?: శంకర్రావు
సాక్షి, హైదరాబాద్: అవినీతిని అంతం చేయాలని తాను పోరాటం చేస్తే తననే రాజకీయంగా అంతం చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి శంకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనకు టికెట్ నిరాకరించడంపై ఆయన మంగళవారం జెమినీ కాలనీలోని తన నివాసంలో కూతురు సుస్మితతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ... నెహ్రూ, గాంధీ కుటుంబాలకు విధేయుడుగా ఉంటున్న తనకిచ్చే బహుమానం ఇదేనా? అని పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో విధేయతకు స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, కేవీపీ రామచంద్రరావుల కనుసన్నల్లోనే టికెట్ల కేటాయింపు జరిగిందని ఆరోపించారు. జలయజ్ఞంలో జరిగిన అవినీతిపై పోరాటం చేసినందుకే పొన్నాల తనకు టికెట్ నిరాకరించారని విమర్శించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దళితుడేనని జైరాం రమేష్ ప్రకటించిన తర్వాత తనకు ఎక్కడ అడ్డమొస్తాడోనని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా కుట్ర చేసి తనకు టికెట్ రాకుండా చేశాడని ఆరోపించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.