ఆదుకుంటాడనుకుంటే..
తెర్లాం రూరల్: ఉన్నత చదువులు చదివించిన చిన్న కుమారుడు చేతికంది వచ్చాడని, కష్టసుఖాల్లో తమను ఆదుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రుల ఆశలు ఆడియాసలయ్యాయి. పెంచి పెద్ద చేసిన కొడుకు తమను సాకుతాడని భావించిన ఆ తల్లిదండ్రుల పట్ట విధి చిన్నచూపు చూసి ఆటో రూపంలో కొడుకును దూరం చేసింది. కొడుకు ప్రమాదంలో మృతిచెందాడని తెలుసుకుని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా భోరున విలపిస్తున్నారు. మండలంలోని నెమలాం గ్రామానికి చెందిన కోట సత్యంనాయుడు, చిన్నమ్మలు దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అప్పారావు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు శంకరరావు(24) బి.టెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి రాజాంలోని ప్రైవేటు కంపెనీలో కొంతకాలంగా సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
ఎప్పటిలాగే మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విధులకు రాజాం వెళ్లేందుకు ఇంటి నుంచి బయలు దేరి వెళ్లి అంతలోనే గాయాలపాలయ్యాడని వార్త తెలియడంతోనే ఆ తల్లిదండ్రు లకు కాళ్లూచేతులూ ఆడలేదు. వివరాలిలా ఉన్నాయి. నెమలాం గ్రామం నుంచి పెరుమాళిలో గల మోడల్ స్కూల్‌కు ఇద్దరు విద్యార్థులతో పాటు శంకరరావు కూడా ఆటోలో వస్తున్నాడు. ఆటో గ్రామం దాటిన తరువాత పాములవలస గ్రామానికి సమీపంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో శంకరరావు తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే గ్రామానికి చెందిన విద్యార్థులు మడక అనిల్, కోట సత్యవతి స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన శంకరరావును, స్వల్పంగా గాయాలైన ఇద్దరు విద్యార్థులను చికిత్స నిమిత్తం రాజాంలోని కేర్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.
శంకరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శంకరరావు మృతి చెందిన విషయం తెలియడంతో గ్రామస్తులు అధికసంఖ్యలో కేర్ ఆస్పత్రికి తరలివచ్చారు. శంకరరావు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, అన్నయ్య అప్పారావులు భోరున విలపించారు. ఆటో ప్రమాదంలో శంకరరావు మృతి చెందిన విషయాన్ని రాజాం కేర్ ఆస్పత్రి వైద్యులు తెర్లాం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఎస్సై శంభాన రవితోపాటు సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి, అనంతరం రాజాం కేర్ ఆస్పత్రికి వెళ్లారు. శంకరరావు మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రవి తెలిపారు.
శోక సంద్రంలో నెమలాం
అందరితో సరదాగా కలిసి మెలిసి ఉండే శంకరరావు ప్రమాదంలో మృతి చెందాడని తెలుసుకున్న నెమలాం గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. శంకరరావు ఉన్నత చదువు చదివినప్పటికీ అందరితోనూ ఎంతో కలివిడిగా ఉండేవాడని గ్రామస్తులు, తోటి స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు గుర్తు తెచ్చుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.