‘శంకర’గిరి మాన్యాలేనా..!
Published Tue, Feb 18 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM
పదేళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అధిష్టానం ఆదేశించిన పనులన్నీ బాధ్యతగా నిర్వహించారు. గత సారి పొత్తు కారణంగా కోల్పోయిన టిక్కెట్, ఈసారి ఎలాగైనా తనకు లభిస్తుందని ఆశించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్న మాజీ ఎంపీ, టీడీపీ నేత డీవీజీ శంకరరావుకు ఈసారి కూడా టిక్కెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు. దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. అరుకు ఎంపీ, అటు సాలూరు ఎమ్మెల్యే స్థానాలను ఆశించినా...నెరవేరే అవకాశం కనిపించడం లేదు. అధినేత కూడా ఆయన్ను పెద్దగా పట్టించుకున్నట్టు దాఖలాలులేవు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మాజీ ఎంపీ, టీడీపీ నేత డీవీజీ శంకరరావుకు ఈసారీ టిక్కెట్ లభించే అవకాశం కనిపించడం లేదు. గత ఎన్ని కల్లో పొత్తుల కారణంగా టిక్కెట్ దక్కని డీవీజీకి ఈసారి అధిష్టానమే మొండి చేయి చూపిస్తోంది. దీంతో ఆయన డైలామాలో పడ్డారు. అధినేతతో తేల్చుకోవాలనే యోచనకొచ్చారు.
వామపక్షాల పొత్తుతో మిస్
వైద్య వృతిలో ఉన్న డీవీజీ శంకరావు పార్వతీపురం లోకసభ నుంచి 1999లో తొలిసారిగా టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2004లో అదే లోకసభ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. ఇంతలోనే నియోజకవర్గ పునర్విభజన జరగడంతో కొత్తగా ఏర్పాటైన అరకు లోకసభ నియోజకవర్గం నుంచి 2009లో పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ఎన్నికల్లో వామపక్షాలతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల సీపీఎంకు ఆ టిక్కెట్ దక్కింది. దీంతో లోకసభపై అశలు వదులుకున్నారు. కనీసం ఎమ్మెల్యేగానైనా బరిలోకి దిగాలని యోచించారు. అప్పటికే కుల వివాదం కారణంగా వేటుకు గురైన ఆర్.పి.భంజదేవ్ స్థానంలో పోటీ చేయాలని రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ రాత్రికి రాత్రి కాంగ్రెస్ నుంచి వచ్చిన గుమ్మడి సంధ్యారాణికి టిక్కెట్ ఇచ్చి శంకరరావుకు పార్టీ అధినేత చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినా పార్టీని వదలకుండా పనిచేస్తూ వచ్చారు.
చంద్రబాబు ఆలోచనతో డౌట్
2014ఎన్నికలే లక్ష్యంగా క్రీయాశీలకంగా పనిచేశారు. అరకు లోకసభ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పార్టీ బాధ్యతల్ని చేపట్టారు. తప్పనిసరిగా తనకే టిక్కెట్ వస్తుందని, బరిలోకి దిగాల్సి ఉంటోందని శంకరరావు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ చంద్రబాబు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఈసారి అరకు ఎంపీ టిక్కెట్‌కు మహిళకు ఇవ్వాలన్న ఆలోచనకొచ్చారు. ఆ మధ్య హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమన్వయకర్తల సమావేశంలో అరకు ఎంపీగా గుమ్మడి సంధ్యారాణిని బరిలోకి దించుదామని చంద్రబాబు ప్రతిపాదించారు. అందరూ సహకరించాలని పరిధిలో ఉన్న నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లందర్నీ కోరారు. ఇతరత్రా కారణాలతో ఆ సమావేశానికి డీవీజీ శంకరరావు హాజరు కాలేదు. కానీ చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయం తెలుసుకుని డీవీజీ అవాక్కయ్యారు. అయితే, ఇంతలో ఎంపీ అభ్యర్థత్వాన్ని సంధ్యారాణి వ్యతిరేకించడంతో కొంత ఊపిరిపీల్చుకున్నారు.
శోభా హైమావతి రూపంలో చుక్కెదురు
కానీ శోభా హైమవతి రూపంలో మళ్లీ చుక్కెదురైంది. ఎస్. కోట ఎమ్మెల్యేగా పోటీకి తనకు అవకాశమివ్వాలని లేదంటే అరుకు లోకసభ అభ్య ర్థిగా తన కుమార్తె స్వాతిరాణిని నిలబెట్టాలని చంద్రబాబును శోభా ైహైమవతి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఎంపీ టిక్కెట్ ైెహ మవతి కుమార్తెకు ఇచ్చేందుకు చంద్రబాబు హమీ ఇచ్చారని తెలిసింది. అందుకు గుమ్మడి సంధ్యారాణి, కోళ్ల లలితకుమారి వంతు పాడినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. స్వాతిరాణికి ఎంపీ టిక్కెట్ ఇస్తే తాను అరుకు ఎంపీగా పోటీచేసే బాధ్యత తప్పిపోతుందని సంధ్యారాణి, తనకు ఎస్. కోట ఎమ్మెల్యే టిక్కెట్‌కు లైన్ క్లీయరవుతుందని కోళ్ల లలితకుమారి ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపినట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే శోభా హైమవతి తన కుమార్తె స్వాతిరాణిని సోమవారం జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చి నేతలందరికీ పరిచయం చేశారు. అశోక్ గజపతిరాజు ఆశీస్సులు కూడా తీసుకున్నట్టు తెలిసింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న డీవీజీ పరిస్థితి సందిగ్ధంలో పడింది. గత ఎన్నికల మాదిరిగానే సాలూరు ఎమ్మెల్యేగానైనా పోటీ చేద్దామంటే సంధ్యారాణి పెద్ద అడ్డంకిగా నిలిచారు. ఒకవేళ సంధ్యారాణిని ఎంపీగా పోటీ చేయించినా కుల వివాదం నుంచి బయటపడి రేసులో నిలబడేందుకు ఆర్.పి.భంజ్‌దేవ్ సిద్ధమవుతున్నారు. దీంతో డీవీజీకి తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ మొండి చేయి ఎదురైనట్టు ఉందన్న అభిప్రాయానికొచ్చారు. ఈమేరకు త్వరలోనే హైదరాబాద్ వెళ్లి, చంద్రబాబుతో మాట్లాడి, టిక్కెట్ విషయమై తేల్చుకునే యోచనలో ఉన్నారు.
Advertisement
Advertisement