భళా మహిళా..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇంతవరకూ జరిగిన ఏ సార్వత్రిక ఎన్నికల్లోనూ లేని విధంగా జిల్లా నుంచి నలుగురు మహిళలు అసెంబ్లీకి, ఒకరు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. చట్టసభల్లో ఒకేసారి ఐదుగురు అతివలకు ప్రాతినిధ్యం లభించింది. జిల్లాలో ఇదొక రికార్డుగా నిలిచిపోనుంది. స్థానిక సంస్థల్లో మహిళలకు ఆశించిన మేర ప్రాతినిధ్యం లభిస్తున్నా చట్టసభల్లో మాత్రం వారికి సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదనే చెప్పాలి. గత ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కన్పించింది. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 16లక్షల 86వేల19మంది ఓటర్లు ఉండగా అందులో 8లక్షల54వేల 170మంది మహిళా ఓటర్లు. పురుషులు 8లక్షల31వేల 743మంది ఉన్నారు. కానీ ప్రాతినిధ్యం మాత్రం ఇంతవరకు ఆ స్థాయిలో వారికి లభించలేదు. గత సాధారణ ఎన్నికల వరకు 18మంది మహిళలకు పోటీ చేసే అవకాశం లభించగా ఎనిమిది మంది విజయం సాధించారు.
ఒక సారి జరిగిన ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువమంది మహిళలు గెలిచిన సందర్భాల్లేవు. కానీ ఈసారి ఆ గీతను దాటారు. ఒకేసారి జరిగిన ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానం నుంచి కొత్తపల్లి గీత, ఎస్.కోట అసెంబ్లీ స్థానం నుంచి కోళ్ల లలితకుమారి, విజయనగరం అసెంబ్లీ నుంచి మీసాల గీత, కురుపాం అసెంబ్లీకి పాముల పుష్ప శ్రీవాణి, చీపురుపల్లి స్థానం నుంచి కిమిడి మృణాళిని ఈసారి ఎన్నికైన వారిలో ఉన్నారు. పునర్విభజనకు ముందు జిల్లాలో 12నియోజకవర్గాలుండగా వాటికి 13పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ 13 పర్యాయాల్లో 13మందికి మాత్రమే పోటీ చేసే అవకాశాన్ని రాజకీయ పార్టీలు కల్పించాయి. తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిన 1952లో ఒక్కరికి కూడా పోటీ చేయడానికి అవకాశం రాలేదు. ఆ తర్వాత 1962, 1967, 1972లో కూడా ఇదే పరిస్థితి. 1995లో మాత్రం కుసుమ గజపతిరాజుకు అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు.
అదేవిధంగా 1983లో త్రిపురాన వెంకటరత్నానికి అవకాశం ఇస్తే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గెలుపొందారు. 1985లో వెంపడాపు.భారతికి పోటీ చేసే అవకాశం లభించిం ది. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు.1989లో టంకాల సరస్వతమ్మ, పడాల అరుణకు అవకాశం లభించగా ఇద్దరూ గెలుపొందారు. 1994లో పడాల అరుణ, బొడ్డు కళావతికి పోటీ చేసే అవకాశం లభించగా వారిలో అరుణ ఒక్కరే విజయం సాధించారు. 1997ఉప ఎన్నికల్లో యర్రా అన్నపూర్ణమ్మ గెలుపొందారు. 1999లో శోభా హైమావతి, ద్వారపురెడ్డి ప్రతిమాదేవి, గుమ్మడి సంధ్యారాణికి పోటీ చేసే అవకాశాలను అధిష్టానాలు కల్పించాయి. ఆ ఎన్నికల్లో ఒక్క శోభా హైమావతే గెలిచారు. మిగిలిన ఇద్దరు ఓటమి పాలయ్యారు.
2004ఎన్నికల్లో శోభా హైమావతి, పడాల.అరుణకు అవకాశం లభించగా వీరిలో పడాల అరుణ మాత్రమే గెలిచారు. విశేషమేమిటంటే నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఉన్న భోగాపురం, విజయనగరం, సతివాడ, తెర్లాం, బొబ్బిలి నియోజకవర్గాల్లో మహిళలకు పోటీ చేసే అవకాశమే దక్కలేదు. గత ఎన్నికల్లో(2009) తొమ్మిది మందికి పోటీ చేసే అవకాశం లభించినా ముగ్గురు మాత్రమే చట్టసభలకు ఎన్నికయ్యారు. ఎంపీగా బొత్స ఝాన్సీలక్ష్మి, ఎమ్మెల్యేలుగా కోళ్ల లలితకుమారి, సవరపు జయమణి ఎన్నికయ్యారు.చెప్పాలంటే అప్పటివరకు అదే రికార్డు. కానీ, ఈసారి ఐదుగురు ఎన్నికై ఆ రికార్డును అధిగమించారు. అతివలకు ఇదొక మంచి పరిణామమనే చెప్పుకోవాలి. భవిష్యత్‌లో ఆ సంఖ్య ఇంకెంత పెరగనుందో, అతివల ఆధిపత్యం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.