Aruku MP
-
గెలిపించిన పార్టీని కొత్తపల్లి గీత మోసం చేశారు
హైదరాబాద్: అరకు ఎంపీ పదవికి తక్షణమే రాజీనామా చేసి ... దమ్ముంటే తిరిగి అరకు ఎంపీగా గెలవాలని కొత్తపల్లి గీతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ సవాల్ విసిరారు. ఎంపీటీసీగా కూడా గెలవలేని కొత్తపల్లి గీతను ఎంపీగా చేసిన ఘనత తమ పార్టీ అధ్యక్షుడు వైస్ జగన్‌దేనని ఆయన స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాల్లో వాటాలు, కమీషన్ల కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని కొత్తపల్లి గీతను ప్రసాద్ ఈ సందర్భంగా హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కుటుంబంపై తప్పుడు ప్రకటనలు మానుకోకపోతే గిరిజనులే తగిన బుద్ధి చెబుతారని బొడ్డేడ ప్రసాద్ అన్నారు. మహిళ అన్న ఉద్దేశంతో కొత్తపల్లి గీత ఇన్నాళ్లు ఏం మాట్లాడినా సహనంగా ఉన్నామన్నారు. గెలిపించిన పార్టీకి ద్రోహం చేయాలనుకునే ముందు అభాండాలు వేయడం సరికాదని గీతకు ఆయన హితవు పలికారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 5 పార్లమెంట్ స్థానాలను మహిళలకు కేటాయించిన పార్టీ వైఎస్ఆర్ సీపీ అని ఆయన గుర్తు చేశారు. అలాగే అరకు పార్లమెంట్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాలను కూడా మహిళలకే కేటాయించారని తెలిపారు. వ్యక్తి అజెండా కోసం గెలిపించిన పార్టీని కొత్తపల్లి మోసం చేశారని ఆరోపించారు. గెలిపించిన గిరిజనులను కూడా గీత మోసం చేస్తున్నారని విమర్శించారు. సొంత ఇమేజ్‌తోనే గెలిచానని కొత్తపల్లి గీత భృ఼విస్తే తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని గీతకు హితవు పలికారు. గెలిచే సత్తా ఉందా అని కొత్తపల్లి గీతను ప్రసాద్ ప్రశ్నించారు. -
భళా మహిళా..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇంతవరకూ జరిగిన ఏ సార్వత్రిక ఎన్నికల్లోనూ లేని విధంగా జిల్లా నుంచి నలుగురు మహిళలు అసెంబ్లీకి, ఒకరు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. చట్టసభల్లో ఒకేసారి ఐదుగురు అతివలకు ప్రాతినిధ్యం లభించింది. జిల్లాలో ఇదొక రికార్డుగా నిలిచిపోనుంది. స్థానిక సంస్థల్లో మహిళలకు ఆశించిన మేర ప్రాతినిధ్యం లభిస్తున్నా చట్టసభల్లో మాత్రం వారికి సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదనే చెప్పాలి. గత ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కన్పించింది. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 16లక్షల 86వేల19మంది ఓటర్లు ఉండగా అందులో 8లక్షల54వేల 170మంది మహిళా ఓటర్లు. పురుషులు 8లక్షల31వేల 743మంది ఉన్నారు. కానీ ప్రాతినిధ్యం మాత్రం ఇంతవరకు ఆ స్థాయిలో వారికి లభించలేదు. గత సాధారణ ఎన్నికల వరకు 18మంది మహిళలకు పోటీ చేసే అవకాశం లభించగా ఎనిమిది మంది విజయం సాధించారు. ఒక సారి జరిగిన ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువమంది మహిళలు గెలిచిన సందర్భాల్లేవు. కానీ ఈసారి ఆ గీతను దాటారు. ఒకేసారి జరిగిన ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానం నుంచి కొత్తపల్లి గీత, ఎస్.కోట అసెంబ్లీ స్థానం నుంచి కోళ్ల లలితకుమారి, విజయనగరం అసెంబ్లీ నుంచి మీసాల గీత, కురుపాం అసెంబ్లీకి పాముల పుష్ప శ్రీవాణి, చీపురుపల్లి స్థానం నుంచి కిమిడి మృణాళిని ఈసారి ఎన్నికైన వారిలో ఉన్నారు. పునర్విభజనకు ముందు జిల్లాలో 12నియోజకవర్గాలుండగా వాటికి 13పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ 13 పర్యాయాల్లో 13మందికి మాత్రమే పోటీ చేసే అవకాశాన్ని రాజకీయ పార్టీలు కల్పించాయి. తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిన 1952లో ఒక్కరికి కూడా పోటీ చేయడానికి అవకాశం రాలేదు. ఆ తర్వాత 1962, 1967, 1972లో కూడా ఇదే పరిస్థితి. 1995లో మాత్రం కుసుమ గజపతిరాజుకు అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. అదేవిధంగా 1983లో త్రిపురాన వెంకటరత్నానికి అవకాశం ఇస్తే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గెలుపొందారు. 1985లో వెంపడాపు.భారతికి పోటీ చేసే అవకాశం లభించిం ది. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు.1989లో టంకాల సరస్వతమ్మ, పడాల అరుణకు అవకాశం లభించగా ఇద్దరూ గెలుపొందారు. 1994లో పడాల అరుణ, బొడ్డు కళావతికి పోటీ చేసే అవకాశం లభించగా వారిలో అరుణ ఒక్కరే విజయం సాధించారు. 1997ఉప ఎన్నికల్లో యర్రా అన్నపూర్ణమ్మ గెలుపొందారు. 1999లో శోభా హైమావతి, ద్వారపురెడ్డి ప్రతిమాదేవి, గుమ్మడి సంధ్యారాణికి పోటీ చేసే అవకాశాలను అధిష్టానాలు కల్పించాయి. ఆ ఎన్నికల్లో ఒక్క శోభా హైమావతే గెలిచారు. మిగిలిన ఇద్దరు ఓటమి పాలయ్యారు. 2004ఎన్నికల్లో శోభా హైమావతి, పడాల.అరుణకు అవకాశం లభించగా వీరిలో పడాల అరుణ మాత్రమే గెలిచారు. విశేషమేమిటంటే నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఉన్న భోగాపురం, విజయనగరం, సతివాడ, తెర్లాం, బొబ్బిలి నియోజకవర్గాల్లో మహిళలకు పోటీ చేసే అవకాశమే దక్కలేదు. గత ఎన్నికల్లో(2009) తొమ్మిది మందికి పోటీ చేసే అవకాశం లభించినా ముగ్గురు మాత్రమే చట్టసభలకు ఎన్నికయ్యారు. ఎంపీగా బొత్స ఝాన్సీలక్ష్మి, ఎమ్మెల్యేలుగా కోళ్ల లలితకుమారి, సవరపు జయమణి ఎన్నికయ్యారు.చెప్పాలంటే అప్పటివరకు అదే రికార్డు. కానీ, ఈసారి ఐదుగురు ఎన్నికై ఆ రికార్డును అధిగమించారు. అతివలకు ఇదొక మంచి పరిణామమనే చెప్పుకోవాలి. భవిష్యత్‌లో ఆ సంఖ్య ఇంకెంత పెరగనుందో, అతివల ఆధిపత్యం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. -
‘శంకర’గిరి మాన్యాలేనా..!
పదేళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అధిష్టానం ఆదేశించిన పనులన్నీ బాధ్యతగా నిర్వహించారు. గత సారి పొత్తు కారణంగా కోల్పోయిన టిక్కెట్, ఈసారి ఎలాగైనా తనకు లభిస్తుందని ఆశించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్న మాజీ ఎంపీ, టీడీపీ నేత డీవీజీ శంకరరావుకు ఈసారి కూడా టిక్కెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు. దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. అరుకు ఎంపీ, అటు సాలూరు ఎమ్మెల్యే స్థానాలను ఆశించినా...నెరవేరే అవకాశం కనిపించడం లేదు. అధినేత కూడా ఆయన్ను పెద్దగా పట్టించుకున్నట్టు దాఖలాలులేవు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : మాజీ ఎంపీ, టీడీపీ నేత డీవీజీ శంకరరావుకు ఈసారీ టిక్కెట్ లభించే అవకాశం కనిపించడం లేదు. గత ఎన్ని కల్లో పొత్తుల కారణంగా టిక్కెట్ దక్కని డీవీజీకి ఈసారి అధిష్టానమే మొండి చేయి చూపిస్తోంది. దీంతో ఆయన డైలామాలో పడ్డారు. అధినేతతో తేల్చుకోవాలనే యోచనకొచ్చారు. వామపక్షాల పొత్తుతో మిస్ వైద్య వృతిలో ఉన్న డీవీజీ శంకరావు పార్వతీపురం లోకసభ నుంచి 1999లో తొలిసారిగా టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2004లో అదే లోకసభ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. ఇంతలోనే నియోజకవర్గ పునర్విభజన జరగడంతో కొత్తగా ఏర్పాటైన అరకు లోకసభ నియోజకవర్గం నుంచి 2009లో పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ఎన్నికల్లో వామపక్షాలతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల సీపీఎంకు ఆ టిక్కెట్ దక్కింది. దీంతో లోకసభపై అశలు వదులుకున్నారు. కనీసం ఎమ్మెల్యేగానైనా బరిలోకి దిగాలని యోచించారు. అప్పటికే కుల వివాదం కారణంగా వేటుకు గురైన ఆర్.పి.భంజదేవ్ స్థానంలో పోటీ చేయాలని రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ రాత్రికి రాత్రి కాంగ్రెస్ నుంచి వచ్చిన గుమ్మడి సంధ్యారాణికి టిక్కెట్ ఇచ్చి శంకరరావుకు పార్టీ అధినేత చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినా పార్టీని వదలకుండా పనిచేస్తూ వచ్చారు. చంద్రబాబు ఆలోచనతో డౌట్ 2014ఎన్నికలే లక్ష్యంగా క్రీయాశీలకంగా పనిచేశారు. అరకు లోకసభ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పార్టీ బాధ్యతల్ని చేపట్టారు. తప్పనిసరిగా తనకే టిక్కెట్ వస్తుందని, బరిలోకి దిగాల్సి ఉంటోందని శంకరరావు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ చంద్రబాబు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఈసారి అరకు ఎంపీ టిక్కెట్‌కు మహిళకు ఇవ్వాలన్న ఆలోచనకొచ్చారు. ఆ మధ్య హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమన్వయకర్తల సమావేశంలో అరకు ఎంపీగా గుమ్మడి సంధ్యారాణిని బరిలోకి దించుదామని చంద్రబాబు ప్రతిపాదించారు. అందరూ సహకరించాలని పరిధిలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్లందర్నీ కోరారు. ఇతరత్రా కారణాలతో ఆ సమావేశానికి డీవీజీ శంకరరావు హాజరు కాలేదు. కానీ చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయం తెలుసుకుని డీవీజీ అవాక్కయ్యారు. అయితే, ఇంతలో ఎంపీ అభ్యర్థత్వాన్ని సంధ్యారాణి వ్యతిరేకించడంతో కొంత ఊపిరిపీల్చుకున్నారు. శోభా హైమావతి రూపంలో చుక్కెదురు కానీ శోభా హైమవతి రూపంలో మళ్లీ చుక్కెదురైంది. ఎస్. కోట ఎమ్మెల్యేగా పోటీకి తనకు అవకాశమివ్వాలని లేదంటే అరుకు లోకసభ అభ్య ర్థిగా తన కుమార్తె స్వాతిరాణిని నిలబెట్టాలని చంద్రబాబును శోభా ైహైమవతి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఎంపీ టిక్కెట్ ైెహ మవతి కుమార్తెకు ఇచ్చేందుకు చంద్రబాబు హమీ ఇచ్చారని తెలిసింది. అందుకు గుమ్మడి సంధ్యారాణి, కోళ్ల లలితకుమారి వంతు పాడినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. స్వాతిరాణికి ఎంపీ టిక్కెట్ ఇస్తే తాను అరుకు ఎంపీగా పోటీచేసే బాధ్యత తప్పిపోతుందని సంధ్యారాణి, తనకు ఎస్. కోట ఎమ్మెల్యే టిక్కెట్‌కు లైన్ క్లీయరవుతుందని కోళ్ల లలితకుమారి ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే శోభా హైమవతి తన కుమార్తె స్వాతిరాణిని సోమవారం జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చి నేతలందరికీ పరిచయం చేశారు. అశోక్ గజపతిరాజు ఆశీస్సులు కూడా తీసుకున్నట్టు తెలిసింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న డీవీజీ పరిస్థితి సందిగ్ధంలో పడింది. గత ఎన్నికల మాదిరిగానే సాలూరు ఎమ్మెల్యేగానైనా పోటీ చేద్దామంటే సంధ్యారాణి పెద్ద అడ్డంకిగా నిలిచారు. ఒకవేళ సంధ్యారాణిని ఎంపీగా పోటీ చేయించినా కుల వివాదం నుంచి బయటపడి రేసులో నిలబడేందుకు ఆర్.పి.భంజ్‌దేవ్ సిద్ధమవుతున్నారు. దీంతో డీవీజీకి తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ మొండి చేయి ఎదురైనట్టు ఉందన్న అభిప్రాయానికొచ్చారు. ఈమేరకు త్వరలోనే హైదరాబాద్ వెళ్లి, చంద్రబాబుతో మాట్లాడి, టిక్కెట్ విషయమై తేల్చుకునే యోచనలో ఉన్నారు.