మూడున్నర తులాల పుస్తెలతాడు అపహరణ
దేవరాపల్లి: విద్యుత్ మీటరును సరి చేసేందుకు వచ్చానంటూ గుర్తు తెలియని వ్యక్తి దంపతులను మోసగించి మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును అపహరించుకు పోయాడు. మండలంలోని బోయిల కింతాడ శివారు వడిదడకల వారి కల్లాలు వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవరాపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కల్లాల్లో నివాసం ఉంటున్న వడదడకల శంకరరావు మంగళవారం పొలం పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మీ ఇంటి విద్యుత్ మీటర్‌ను బాగు చేయడానికి వచ్చానని నమ్మబలికాడు. ఇది నిజమని నమ్మిన శంకరరావు ఇంటికి తీసుకెళ్లి విద్యుత్ మీటర్‌ను చూపించాడు.
దానిని బాగు చేస్తున్నట్లు కొద్ది సేపు నటించిన అతడు కాఫర్ వైర్ కావాలని అడిగాడు. తమ వద్ద లేదని శంకర్రావు భార్య బదులిచ్చింది. దీంతో శంకర్‌రావు భార్య మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు ఇవ్వాలని కోరాడు. బంగారు పుస్తులతాడుతో పాటు అతడు అడిగిన మేరకు తెల్లని గుడ్డ కూడా ఇచ్చారు. వారి కంట పడకుండా గుడ్డ చాటున పుస్తెల తాడును జేబులో వేసుకొని తెల్లని గుడ్డని మాత్రం మీటరుపైన ఉంచాడు. గుడ్డలో పుస్తెలతాడు ఉందని, ఈ మీటరు పని చేయడం లేదని, దీని స్థానంలో కొత్త మీటరు వేయాలని నమ్మించాడు. తమ సిబ్బంది గవరవరం బ్రిడ్జి వద్ద విద్యుత్ మీటర్లుతో ఉన్నారని, అక్కడి నుంచి తేవాలని, శంకర్రావును కూడా బైకుపై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అతడు చెప్పిన ప్రదేశానికి కొద్ది దూరంలో శంకర్‌రావును దించేసి మీటర్‌ను తీసుకు వస్తానంటూ చెప్పి వెళ్లాడు.
ఎంతసేపటికీ అతని పత్తా లేక పోవడంతో శంకర్‌రావు ఇంటికి వచ్చేశాడు. విద్యుత్ మీటరు మీద ఉంచిన తెల్లని గుడ్డలో బంగారు పుస్తెల తాడు లేక పోవడాన్ని గమనించి దంపతులు లబో దిబో మన్నారు. మోసోయామని తెలుసుకుని దేవరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జి. అప్పన్న తెలిపారు.
మీటర్ బాగుచేస్తానంటూ మోసం
Published Thu, Aug 20 2015 12:05 AM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM
Advertisement