శంకరరావు, సరస్వతి కుటుంబంతో...
చెన్నై ఘటనలో మృతి చెందిన మక్కువ మండలం గైశీల గ్రామానికి చెందిన వెంపటాపు శంకరరావు, మజ్జి సరస్వతి(అక్కా,తమ్ముళ్లు) కుటుంబాన్ని వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించారు.
జగన్: ప్రమాదం జరిగినప్పుడు మీ కుటుంబంలో ఇద్దరు చనిపోయారా?
తల్లి నారాయణమ్మ(భోరున విలపిస్తూ): ఔను బాబూ. మూడు సంవత్సరాల క్రితం అదే చెన్నైలో మరో కుమారుడు శ్రీను కూడా ఇలాగే చనిపోయాడు.
జగన్: అయ్యో ఏడవకమ్మా... ఏం చేస్తాం. సహాయం అందిందా?
కుటుంబ సభ్యులు: ప్రభుత్వం నుంచి అందింది. కానీ గతంలో చనిపోయిన శ్రీనుకు ఒక్కరూపాయి రాలేదు.
జగన్: తమిళనాడు ప్రభుత్వం నుంచి సాయం అందలేదు కదా. బిల్డర్‌పై కేసు వేసి నష్ట పరిహారం రాబడదాం. జయలలిత ప్రభుత్వంలో తెలుగాయన ఒకరు ఉన్నారు. మాట్లాడదాం.
నారాయణమ్మ: మా శంకరరావుకు మీరంటే ఎంతో ఇష్టం బాబూ. ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం రాలేదని బాధపడ్డాడు. తర్వాత చెన్నై వెళ్లి ఇలా అక్కా, తమ్ముడు చనిపోయారు మీరే ఆదుకోవాలి.
జగన్: మీకు వ్యవసాయం ఉందా? పనులు చేస్తారా?
శంకరరావు భార్య దుర్గమ్మ: కొంచెం ఉందండీ. ఏవో పనులు చేసుకుంటాం.
నారాయణమ్మ : కూతురుకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు కుమారులకు ఇద్దరేసి పిల్లలు. అందరినీ నా దగ్గర వదిలేసి అందరూ చనిపోయారు బాబూ. ఈ వయసులో నన్ను పెంచాల్సింది పోయి వారి పిల్లల్ని పెంచే బాధ్యతలు అప్పగించారు.
జగన్: ఆదుకుంటామమ్మా... బాధ పడకండి. మా ఎమ్మెల్యేలు రాజన్నదొర, సుజయ్‌కృష్ణరంగారావులు అందుబాటులో ఉంటారు.
కుటుంబసభ్యులు: సరస్వతి కొడుకు ఐటీఐ చదువుతున్నాడు బాబూ ఉద్యోగం చూడండి.
జగన్: నేను చేయనిది చెప్పనమ్మా. నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నేను ఉద్యోగాలు వేయలేను కదా. ప్రభుత్వంతో పోరాడి పిల్లలందరినీ రెసిడెన్షియల్ స్కూళ్లలో వేసే ఏర్పాటు చేద్దాం. చెన్నై బిల్డర్‌తో మాట్లాడి పరిహారం అందేలా చేద్దాం.