సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘పొలం పిలుస్తోంది’ అంటూ రైతుల సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అధికారులకు ప్రాణసంకటంగా మారింది. రైతులకు పంటల సాగుపై ఆధునిక పద్ధతులు, ఖర్చు తగ్గించే సూత్రాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, ఇతర సబ్సిడీలు, తదితర అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన రాకపోగా ప్రతిచోటా రుణమాఫీపై నిలదీసే పరిస్థితులు ఉండటంతో వారు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలు కురవక పంటలు వేయాలా వద్దా అన్న ఆందోళనలో రైతులున్నారు. మరోవైపు రుణాలు మాఫీ కాకపోవడం, కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాకపోవడం పట్ల రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ తరుణంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం వల్ల ఉపయోగం ఏంటని వారు నిలదీస్తున్నారు. తొలిరోజే యర్రగొండపాలెం నియోజకవర్గంలో రైతుల నుంచి పూర్తిస్థాయిలో వ్యతిరేకత చవి చూడాల్సి వచ్చింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వాగ్దానం చేసి మాట తప్పారని మురారిపల్లెకు చెందిన రైతులు అధికారులపై ధ్వజమెత్తారు. మురారిపల్లెలో గ్రామసభకు హాజరైన అధికారులను రైతులు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు.
దీనికి బ్యాంకు అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఆధార్ కార్డులు అనుసంధానం చేయగానే రుణాలు రద్దవుతాయంటూ బ్యాంకు అధికారులు చెప్పిన సమాధానం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణాలిచ్చే సమయంలో కొంతమొత్తం డిపాజిట్ చేసుకోవడంపై రైతులు ప్రశ్నించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్‌తో మాట్లాడి డిపాజిట్ వెనక్కి ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాలకు రైతులు హాజరు కాలేదు.
కొత్తపాలెం గ్రామంలో జరిగిన సభకు కేవలం ఆరుగురు రైతులు మాత్రమే హాజరయ్యారు. కొన్ని చోట్ల అధికారులు హాజరు కాలేదు. కనిగిరి నియోజకవర్గంలోని ఏ మండలంలో తొలిరోజు సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మత్స్య శాఖ, వాటర్ షెడ్ అధికారులు, పట్టుపరిశ్రమ, పశువర్థక శాఖ, ఆత్మ శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉంది. ప్రతి మండలంలో కనీసం రెండు, మూడు శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. దీంతో రాబోయే రోజుల్లో రైతుల నుంచి ఎంత నిరసన వ్యక్తమవుతుందో అన్న ఆందోళన అధికారులను వెంటాడుతోంది. రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ పని చేయకుండా తమను రైతుల వద్దకు పంపడం ఏంటని అధికారులు వాపోతున్నారు.
పొలం పిలుస్తోంది.. రైతాంగం పొమ్మంటోంది
Published Wed, Aug 13 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM
Advertisement
Advertisement