polam pilustondi program
-
వ్యవసాయ కార్యక్రమాల జాడేదీ?
పంటల సాగులో రైతులకు మెలకువలు, పంటలు, తెగుళ్లపైఅవగాహన కల్పించేందుకు ప్రభుత్వం పొలం పిలుస్తోంది, పొలం బడి కార్యక్రమాలను ప్రారంభించింది. అయితే అవి కేవలం కాగితాలకే పరిమితం కావడంతో రైతులకు ఉపయోగపడకుండా పోయాయి. ఏటా నిధులు వెచ్చిస్తున్నా ఫలితం అందడం లేదు. అలాగే ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో తూతూ మంత్రంగా నిర్వహించి మమ అనిపిస్తున్నారు. దీంతో ప్రజాధనం వృథా అవుతోంది. కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయశాఖలో రైతులను చైతన్య పరిచే కార్యక్రమాలు అచేతనావస్థలో ఉన్నాయి. వివిధ కార్యక్రమాలకు ఏటా రూ. కోటికి పైగా వ్యయం చేస్తున్నా క్షేత్రస్థాయికి చేరడం లేదనే విమర్శలున్నాయి. కార్యక్రమాల ప్రారంభంలో కొంత హడావుడి కనిపిస్తున్న తర్వాత వాటిని పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. నిధులు మాత్రం వ్యయమవుతున్నా కార్యక్రమాలు మాత్రం క్షేత్ర స్థాయిలో కనిపించడంలేదు. అయితే కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగినట్లు రికార్డుల్లో కనిపిస్తాయి. ఎవరెవరు హాజరయ్యారనే వాటిల్లో రైతుల పేర్లు ఉంటాయి. అయినా కార్యక్రమాలు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం గమానార్హం. కార్యక్రమాలను పర్యవేక్షించకపోవడం వల్లే కిందిస్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. కార్యక్రమాల్లో పొలం పిలుస్తోంది, పొలంబడి ప్రధానమైనవి. పొలంబడి కార్యక్రమం పాతదే అయినప్పటికీ.. పొలంపిలుస్తోంది కార్యక్రమం 2015 నుంచి అమలు చేస్తున్నారు. ఈ రెండిటికి ఏటా రూ.కోటి వరకు వ్యయం అవుతున్నా రైతులకు లాభం చేకూరడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పొలంబడి..గాలికి పొలంబడి కార్యక్రమ లక్ష్యాలను గాలికి వదిలేశారనే ఆరోపణలున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో పొలంబడిపై ఎంపీఈఓలు మొదలు కొని ఏడీఏల వరకు శిక్షణలు ఇస్తున్నారు. వీటిని మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా నిర్వహిస్తే వ్యవసాయంపైన, వ్యవసాయ శాఖ పథకాలపైన కర్షకులకు సమగ్ర వగాహన ఏర్పడుతుంది. యంత్రాంగం వీటిని గాలికి వదిలేసింది. పొలంబడి కార్యక్రమాన్ని ప్రతి గురువారం ప్రకారం 14 వారాలు నిర్వహించాలి. ఖరీఫ్‌లో వేరుశనగ,పత్తి, వరి, కంది పంటల్లో 91, రబీలో శనగ, వేరుశనగ తదితర పంటల్లో 59 కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ప్రతి గురువారం మండల వ్యవసాయాధికారి, ఏఈఓ, ఎంపీఈఓలు పొలాల్లోకి వెళ్లి పంటల్లో మార్పులు చేర్పులపై రైతులకు వివరించాలి. తెగుళ్ల సమయంలో మందుల వినియోగం, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించాలి. పొలంబడి నిర్వహణకు ఏటా రూ.28 లక్షలు వ్యయం చేస్తున్నారు. జాడ లేని పొలంపిలుస్తోంది.. పొలంపిలుస్తోంది కార్యక్రమం జాడేలేదు. ఈ కార్యక్రమానికి రూ.71.54 లక్షలు వ్యయం చేస్తున్నా క్షేత్ర స్థాయిలో అస్సలు కనిపించడం లేదు. ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్‌లో వారానికి రెండు రోజుల ప్రకారం 32 రోజులు, రబీలో 32 రోజులు మొత్తంగా 64 రోజులు నిర్వహించాలి. ఇందులో వ్యవసాయశాఖ అ«ధికారులే కాకుండా ఇతర అనుబందశాఖల అధికారులు కూడా పాల్గొనాలి. అయితే ప్లెక్సీలు, బ్యానర్లు పెట్టి ఫొటోలు దిగి మమ అనిపిస్తున్నారనే విమర్శలున్నాయి. దీంతో మొత్తం రూ.71.54 లక్షలు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. కార్యక్రమంలో సూక్ష్మపోషకాల వినియోగం, బీమా, చీడపీడల నివారణ, యాంత్రికీకరణ తదితర వాటితో పాటు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను వివరిస్తారు. 2015లో కొంతవరకు నిర్వహించినా తర్వాత పట్టించుకోవడం లేదు. సమస్యలు ఏన్నో...పరిష్కారమే కరువు.... పొలంబడి, పొలంపిలుస్తోంది కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తే రైతులు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ ఏడాది మొక్కజొన్న, జొన్న పంటలకు కత్తెర పురుగుసోకి పూర్తిగా దెబ్బతీసింది. పత్తిలో గులాబీరంగు పురుగు ప్రబలి పంటను తినేస్తోంది. ఈ కార్యక్రమాల్లో వీటిపై రైతులకు సమగ్రంగా అవగాహన కల్పించాల్సి ఉన్నా పట్టించుకునే వారు లేరు. వ్యవసాయ శాఖ రైతుల కోసం అనేక యాప్‌లను రూపొందించింది. రైతులకు అవగాహన కల్పించకపోవడంతో ఉండి నిరుపయోగంగా మారాయి. దీంతో రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. -
...నిజ్జంగా... పొలమే పిలుస్తోంది
ఒంగోలు టూటౌన్: పొలం పిలుస్తోంది కార్యక్రమం జిల్లాలో మొక్కుబడిగా సాగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అని చెప్పుకుంటున్న ఈ కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన కరువైంది. స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఊసే లేదు. వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అరకొరగా పాల్గొంటూ కార్యక్రమంఅయిపోయిందనిపిస్తున్నారు. దీంతో వ్యవసాయంలో నూతన సాంకేతిక సలహాలు, సూచనలు, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి, ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ వంటివి అన్నదాత దరి చేరడంలేదు. లక్ష్యం ఇదీ... వ్యవసాయంలో నూతన సాంకేతిక సలహాలు, రైతుల సంక్షేమ పథకాలు, ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడి, ఆధునిక పద్ధతుల వంటి వాటిపై రైతులను చైతన్యం చేసేందుకు 2014 ఆగస్టు నెలలో ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 56 మండలాల్లో రోజుకి రెండేసి గ్రామాల చొప్పున 112 గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. వారంలో మంగళ, బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మూడు నెలలకి కార్యచరణ రూపొందించారు. సమావేశాల తీరిదీ... గత ఏడాది ఆగస్టు 12న చీమకుర్తి మండలం బండ్లముడి గ్రామంలో మంత్రి సిద్ధా రాఘవరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతిధుల భాగస్వామ్యంతోపాటు వ్యవసాయానుబంధ శాఖల అధికారులు అందరూ విధిగాపాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. మండల స్థాయి అధికారులు ఒకరిద్దరు మినహా మిగతా శాఖల అధికారులు అంతగా పాల్గొనడం లేదు. రైతులు నలుగురు లేక ఐదుగురికి మించి హాజరు కాని పరిస్థితి ఉంది. సాగు నడత ఇలా... సేద్యం ముందుకు సాగని పరిస్థితి జిల్లాలో ఏర్పడింది. ఖరీఫ్‌లో 2,44,064 హెక్టార్లకుగాను లక్షా హెక్టార్లు కూడా సాగు కాలేదు. వర్షాలు కురుస్తాయన్న ఆశతో ముందస్తుగా సాగు చేసిన పంటలకు చుక్కెదురయింది. గత ఏడాది నవంబర్ నెల చివరిలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం ప్రారంభించారు. రబీలో కూడా ఆశించిన స్థాయిలో పంటలు సాగు కాలేదు. 3 లక్షల హెక్టార్లకుగాను సగానికి సగం సాగు పడిపోయింది. ఖరీఫ్ పంటల నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందంటే జిల్లాలో దుర్భిక్ష తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఈ సమయంలో ‘పొలం బడి, పొలం పిలుస్తోంది’ పేర్లతో వ్యవసాయ అధికారులు చేపడుతున్న అరకొర కార్యక్రమాలకు కూడా రైతులనుంచి స్పందన కొరవడింది. రైతులు లేకుండానే ప్రదర్శన క్షేత్రాలు నిర్వహిస్తున్నట్టు రికార్డుల్లో రాసుకుంటున్నారు తప్ప ఆచరణలో ఏమీ జరగడం లేదు.కొత్తపట్నం మండలంలో గత మంగళవారం మండల వ్యవసాయాధికారి అధ్యక్షతన నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో కేవలం నలుగురు రైతులు మాత్రమే పాల్గొనడం ఇందుకు తాజా ఉదాహరణ. రుణమాఫీ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాలకు అధికారులు అక్కడక్కడా వెళ్తున్నా రైతుల నుంచి రుణమాఫీ ఏమైందంటూ ఎదురు ప్రశ్నలు వేస్తుండడంతో సమావేశం రసాభాసగా మారుతోంది. ఏదోఒక సాకు చెప్పి అక్కడనుంచి తప్పించుకు రావడం నిర్వాహకుల వంతవుతోంది. దీంతో గ్రామాల్లోకి వెళ్లాలంటే వ్యవసాయాధికారులకు ముచ్చెమటలు ఎక్కుతున్నాయి. వ్యవసాయశాఖతోపాటు దాని అనుబంధ శాఖలు ప్రచురించిన కరపత్రాలూ ప్రయోజనం ఇవ్వడం లేదు. ప్రజాధనం దుర్వినియోగమవుతుందే తప్ప అన్నదాతకు అదనంగా ఒనగూరిందేమీ లేదని పలువురు రైతులు పెదవి విరుస్తున్నారు. -
రైతులకు భరోసా ఏదీ ?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఈ ప్రభుత్వంలో రైతులకు భరోసా లేకుండా పోయిందని, నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల వల్ల రైతాంగం నష్టపోతోందని జిల్లా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిలదీశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన తొలి ప్రశ్నోత్తరాల సమయంలో మొదటి ప్రశ్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కగా అది కూడా ప్రకాశం జిల్లాకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌కు అవకాశం లభించింది. వీరిద్దరూ రైతు సమస్యలపై ఎలుగెత్తి వైఎస్సార్ కాంగ్రెస్ రైతుపక్షపాతి అని నిరూపించారు. విత్తనాలను సరఫరా చేయడంలో ప్రభుత్వ సన్నద్ధత ఎంతని వ్యవసాయ శాఖ మంత్రిని నిలదీశారు. మంగళవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల రాకెట్ జరుగుతున్నట్లు ఆంగ్ల దినపత్రికల్లో వచ్చిన క థనాలను ప్రస్తావించారు. ఇక్కడి నుంచే నకిలీ విత్తనాలు దేశం నలుమూలలకు వెళ్తున్నాయని పత్రికల్లో వచ్చినా అధికారులు స్పందించలేదన్నారు. జిన్నింగ్ మిల్లుల్లో పత్తి నుంచి సీడ్ విడదీసి కిలో 20 నుంచి 30 రూపాయలకు కొనుగోలు చేసి ఐదు వందల గ్రాముల ప్యాకెట్‌ను మార్కెట్లో నాలుగు వందల రూపాయలకు విక్రయిస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికైనా ఈ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని వారు డిమాండ్ చేశారు. అక్రమార్కులపై నామమాత్రపు కేసులు పెట్టడం వల్ల వారు కొద్దిపాటి జరిమానాలతో బయటకు వస్తున్నారని, వారిపై పకడ్బందీగా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పొగాకు, మొక్కజొన్న, సజ్జలు, శనగల పంట కోసం ఎకరానికి పెరిగిన ధరల నేపథ్యంలో 20 వేల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోందని, పంట చేతికి వచ్చే సమయానికి పూత రాకపోతేగానీ రైతుకు అవి నకిలీ విత్తనాలు అని తెలియడం లేదని వారు వివరించారు. ఎక్కువ పెట్టుబడి, నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ విత్తనాలను సేకరించడంలోనూ, జిల్లాలకు పంపించే సమయంలో ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడిందని వారు విమర్శించారు. నకిలీ విత్తనాలు లక్షలాది ఎకరాల్లో వేయడం వల్ల వేలాదిమంది రైతులు నష్టపోతున్నారన్నారు. కోల్డ్ స్టోరేజిలో ఉన్న విత్తనాలను అధికారులే రైతులకు అంటగడుతున్నారని, సంవత్సరం దాటిన తర్వాత శుద్ధి చేయకుండా ఇవ్వడం వల్ల రైతు నష్టపోతున్నాడన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లా పత్తి, మిర్చి, శనగ తదితర విత్తనాలు ఎన్ని టన్నులు సేకరించారు, జిల్లా కేంద్రానికి ఎంత చేరిందని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో పొగాకుకు ప్రత్యామ్నాయంగా శనగ పంటను వేశారని, అయితే శనగకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల లక్షల క్వింటాళ్లు కోల్డ్‌స్టోరేజి గోడౌన్లలో మూలుగుతున్నాయని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు అవగాహన కల్పించకుండా ‘పొలం పిలుస్తోంది’ పేరుతో మొక్కుబడి కార్యక్రమాలు చేయడం వల్ల మీడియాలో ఫొటోల కోసం తప్ప ఉపయోగం లేదని వారు విమర్శించారు. శనగ రైతుల సమస్యపై వ్యవసాయ శాఖ మంత్రి సమాధానమిస్తూ తమను రైతు సంఘం నాయకులు వచ్చి కలిశారని, టన్నుకు 3,800 రూపాయలు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. -
పొలం పిలుస్తోంది.. రైతాంగం పొమ్మంటోంది
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘పొలం పిలుస్తోంది’ అంటూ రైతుల సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అధికారులకు ప్రాణసంకటంగా మారింది. రైతులకు పంటల సాగుపై ఆధునిక పద్ధతులు, ఖర్చు తగ్గించే సూత్రాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, ఇతర సబ్సిడీలు, తదితర అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన రాకపోగా ప్రతిచోటా రుణమాఫీపై నిలదీసే పరిస్థితులు ఉండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురవక పంటలు వేయాలా వద్దా అన్న ఆందోళనలో రైతులున్నారు. మరోవైపు రుణాలు మాఫీ కాకపోవడం, కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాకపోవడం పట్ల రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ తరుణంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం వల్ల ఉపయోగం ఏంటని వారు నిలదీస్తున్నారు. తొలిరోజే యర్రగొండపాలెం నియోజకవర్గంలో రైతుల నుంచి పూర్తిస్థాయిలో వ్యతిరేకత చవి చూడాల్సి వచ్చింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వాగ్దానం చేసి మాట తప్పారని మురారిపల్లెకు చెందిన రైతులు అధికారులపై ధ్వజమెత్తారు. మురారిపల్లెలో గ్రామసభకు హాజరైన అధికారులను రైతులు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. దీనికి బ్యాంకు అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఆధార్ కార్డులు అనుసంధానం చేయగానే రుణాలు రద్దవుతాయంటూ బ్యాంకు అధికారులు చెప్పిన సమాధానం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణాలిచ్చే సమయంలో కొంతమొత్తం డిపాజిట్ చేసుకోవడంపై రైతులు ప్రశ్నించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్‌తో మాట్లాడి డిపాజిట్ వెనక్కి ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాలకు రైతులు హాజరు కాలేదు. కొత్తపాలెం గ్రామంలో జరిగిన సభకు కేవలం ఆరుగురు రైతులు మాత్రమే హాజరయ్యారు. కొన్ని చోట్ల అధికారులు హాజరు కాలేదు. కనిగిరి నియోజకవర్గంలోని ఏ మండలంలో తొలిరోజు సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మత్స్య శాఖ, వాటర్ షెడ్ అధికారులు, పట్టుపరిశ్రమ, పశువర్థక శాఖ, ఆత్మ శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉంది. ప్రతి మండలంలో కనీసం రెండు, మూడు శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. దీంతో రాబోయే రోజుల్లో రైతుల నుంచి ఎంత నిరసన వ్యక్తమవుతుందో అన్న ఆందోళన అధికారులను వెంటాడుతోంది. రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ పని చేయకుండా తమను రైతుల వద్దకు పంపడం ఏంటని అధికారులు వాపోతున్నారు.