చంద్రబాబు
పంటల సాగులో రైతులకు మెలకువలు, పంటలు, తెగుళ్లపైఅవగాహన కల్పించేందుకు ప్రభుత్వం పొలం పిలుస్తోంది, పొలం బడి కార్యక్రమాలను ప్రారంభించింది. అయితే అవి కేవలం కాగితాలకే పరిమితం కావడంతో రైతులకు ఉపయోగపడకుండా పోయాయి. ఏటా నిధులు వెచ్చిస్తున్నా ఫలితం అందడం లేదు. అలాగే ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో తూతూ మంత్రంగా నిర్వహించి మమ అనిపిస్తున్నారు. దీంతో ప్రజాధనం వృథా అవుతోంది.
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయశాఖలో రైతులను చైతన్య పరిచే కార్యక్రమాలు అచేతనావస్థలో ఉన్నాయి. వివిధ కార్యక్రమాలకు ఏటా రూ. కోటికి పైగా వ్యయం చేస్తున్నా క్షేత్రస్థాయికి చేరడం లేదనే విమర్శలున్నాయి. కార్యక్రమాల ప్రారంభంలో కొంత హడావుడి కనిపిస్తున్న తర్వాత వాటిని పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. నిధులు మాత్రం వ్యయమవుతున్నా కార్యక్రమాలు మాత్రం క్షేత్ర స్థాయిలో కనిపించడంలేదు. అయితే కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగినట్లు రికార్డుల్లో కనిపిస్తాయి. ఎవరెవరు హాజరయ్యారనే వాటిల్లో రైతుల పేర్లు ఉంటాయి. అయినా కార్యక్రమాలు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం గమానార్హం. కార్యక్రమాలను పర్యవేక్షించకపోవడం వల్లే కిందిస్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. కార్యక్రమాల్లో పొలం పిలుస్తోంది, పొలంబడి ప్రధానమైనవి. పొలంబడి కార్యక్రమం పాతదే అయినప్పటికీ.. పొలంపిలుస్తోంది కార్యక్రమం 2015 నుంచి అమలు చేస్తున్నారు. ఈ రెండిటికి ఏటా రూ.కోటి వరకు వ్యయం అవుతున్నా రైతులకు లాభం చేకూరడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
పొలంబడి..గాలికి
పొలంబడి కార్యక్రమ లక్ష్యాలను గాలికి వదిలేశారనే ఆరోపణలున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో పొలంబడిపై ఎంపీఈఓలు మొదలు కొని ఏడీఏల వరకు శిక్షణలు ఇస్తున్నారు. వీటిని మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా నిర్వహిస్తే వ్యవసాయంపైన, వ్యవసాయ శాఖ పథకాలపైన కర్షకులకు సమగ్ర వగాహన ఏర్పడుతుంది. యంత్రాంగం వీటిని గాలికి వదిలేసింది. పొలంబడి కార్యక్రమాన్ని ప్రతి గురువారం ప్రకారం 14 వారాలు నిర్వహించాలి. ఖరీఫ్‌లో వేరుశనగ,పత్తి, వరి, కంది పంటల్లో 91, రబీలో శనగ, వేరుశనగ తదితర పంటల్లో 59 కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ప్రతి గురువారం మండల వ్యవసాయాధికారి, ఏఈఓ, ఎంపీఈఓలు పొలాల్లోకి వెళ్లి పంటల్లో మార్పులు చేర్పులపై రైతులకు వివరించాలి. తెగుళ్ల సమయంలో మందుల వినియోగం, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించాలి. పొలంబడి నిర్వహణకు ఏటా రూ.28 లక్షలు వ్యయం చేస్తున్నారు.
జాడ లేని పొలంపిలుస్తోంది..
పొలంపిలుస్తోంది కార్యక్రమం జాడేలేదు. ఈ కార్యక్రమానికి రూ.71.54 లక్షలు వ్యయం చేస్తున్నా క్షేత్ర స్థాయిలో అస్సలు కనిపించడం లేదు. ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్‌లో వారానికి రెండు రోజుల ప్రకారం 32 రోజులు, రబీలో 32 రోజులు మొత్తంగా 64 రోజులు నిర్వహించాలి. ఇందులో వ్యవసాయశాఖ అ«ధికారులే కాకుండా ఇతర అనుబందశాఖల అధికారులు కూడా పాల్గొనాలి. అయితే ప్లెక్సీలు, బ్యానర్లు పెట్టి ఫొటోలు దిగి మమ అనిపిస్తున్నారనే విమర్శలున్నాయి. దీంతో మొత్తం రూ.71.54 లక్షలు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. కార్యక్రమంలో సూక్ష్మపోషకాల వినియోగం, బీమా, చీడపీడల నివారణ, యాంత్రికీకరణ తదితర వాటితో పాటు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను వివరిస్తారు. 2015లో కొంతవరకు నిర్వహించినా తర్వాత పట్టించుకోవడం లేదు.
సమస్యలు ఏన్నో...పరిష్కారమే కరువు....
పొలంబడి, పొలంపిలుస్తోంది కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తే రైతులు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ ఏడాది మొక్కజొన్న, జొన్న పంటలకు కత్తెర పురుగుసోకి పూర్తిగా దెబ్బతీసింది. పత్తిలో గులాబీరంగు పురుగు ప్రబలి పంటను తినేస్తోంది. ఈ కార్యక్రమాల్లో వీటిపై రైతులకు సమగ్రంగా అవగాహన కల్పించాల్సి ఉన్నా పట్టించుకునే వారు లేరు. వ్యవసాయ శాఖ రైతుల కోసం అనేక యాప్‌లను రూపొందించింది. రైతులకు అవగాహన కల్పించకపోవడంతో ఉండి నిరుపయోగంగా మారాయి. దీంతో రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment