పోలవరం కాలువ వెడల్పు
సగానికి కుదింపు
హడావుడి తవ్వకాలు.. నిబంధనలకు తిలోదకాలు
కాలువ తవ్వాల్సిన వెడల్పు 80 మీటర్లు
తవ్వుతున్నది 40 మీటర్లు
వంతెనల స్థానంలో తూముల ఏర్పాటు
పరిహారం చెల్లింపులోనూ వివక్ష
హనుమాన్ జంక్షన్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద నిర్వహిస్తున్న పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు వివాదాస్పదంగా మారుతున్నాయి. భూసేకరణలో ప్రకటించిన నష్ట పరిహారం చెల్లింపులో హెచ్చుతగ్గుల నుంచి కాలువ వెడల్పు తగ్గించటం వరకు అన్నింటిలోనూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలువ నిర్మాణంలో పూర్తిగా నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలివ్వటం ఆయా గ్రామస్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశాలన్నీ పోలవరం కాలువ పనులను తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే హడావుడిగా చేపట్టింది తప్ప రైతులకు లబ్ధి చేకూర్చేందుకు కాదని తేటతెల్లం చేస్తున్నాయి.
పరిహారం చెల్లింపులో పక్షపాతం
పట్టిసీమ ప్రాజెక్టు నుంచి పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీటిని తరలించేందుకు పెండింగ్‌లో ఉన్న కాలువ పనులను వేగవంతం చేశారు. జిల్లాలో సుమారు 1222 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించారు. పోలవరం కుడి ప్రధాన కాలువ తవ్వకాలను పూర్తి చేసేందుకు నూజివీడు, బాపులపాడు, ఆగిరిపల్లి, గన్నవరం మండలాల్లో 1346 మంది రైతుల నుండి సుమారు 1222.16 ఎకరాల భూమిని సేకరించారు. సేకరించిన భూమికి నష్టపరిహారం ప్రకటించటంలో గ్రామానికో విధంగా భారీ వ్యత్యాసం చూపటంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఉన్న గ్రామాలకు అధికంగా నష్టపరిహారం ప్రకటించి, బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతుల భూములకు తక్కువ పరిహారం ప్రకటించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాపులపాడు మండలం వేలేరులో ఎకరాకు రూ.52.90 లక్షలు, రేమల్లెకు రూ.44.90 లక్షల నష్టపరిహారం చెల్లించగా, అదే మండలంలోని మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్న బండారుగూడెంలో భూములు కోల్పోయిన బడుగు, బలహీన వర్గాలకు రూ.30.50 లక్షల పరిహారం ప్రకటించటమే దీనికి నిదర్శనం.
కాలువకు లైనింగ్ లేదు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కుడి కాలువను 80 మీటర్ల వెడల్పుతో తవ్వి అడుగు భాగంలో బెడ్ కాంక్రీట్, ఇరువైపులా సిమెంట్ లైనింగ్‌తో పటిష్టంగా నిర్మాణం చేపట్టారు. కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనుల్లో కాలువ వెడల్పు కుదించటంతో పాటు లైనింగ్, బెడ్ కాంక్రీట్‌ను సైతం విడిచిపెట్టేశారు. ప్రధాన రహదారులను కాలువ దాటేచోట గతంలో వంతెనల నిర్మాణం చేపట్టగా, ప్రస్తుతం తూములు ఏర్పాటు చేయటం పనుల్లో డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తోంది.
డీఈ వివరణ
పట్టీసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు తరలించాలనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం మేరకు ప్రస్తుతం 40 మీటర్ల వెడల్పుతో కాలువ తవ్వుతున్నామని పోలవరం కుడి ప్రధాన కాలువ డీఈ పద్మిని తెలిపారు. ఆ తర్వాత కాలువను పూర్తిస్థాయి వెడల్పునకు విస్తరించి, లైనింగ్, బెడ్ కాంక్రీట్, వంతెనల నిర్మాణాలు చేపడతామని ఆమె వివరించారు.
నిబంధనలకు తిలోదకాలు
పోలవరం కుడి ప్రధాన కాలువ తవ్వకం పనుల్లో ప్రభుత్వం నిబంధనలకు తిలోదకాలిచ్చింది. కాలువ వెడల్పు సగానికి కుదించి తవ్వకాలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారం కుడి కాలువ వెడల్పు 80 మీటర్లు ఉండాలి. ప్రస్తుతం కేవలం 40 మీటర్ల వెడల్పుతో కాలువ తవ్వటం గమనార్హం. ఇప్పటికే పూర్తయిన 80 మీటర్ల వెడల్పు కాలువ నుంచి 40 మీటర్ల వెడల్పు కాలువలోకి నీరు ప్రవహించటంలో ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీని పర్యవసానంగా 80 మీటర్ల వెడల్పు ఉన్న కాలువ నీటి మట్టం పెరిగి గట్టు తెగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.