‘పోలవరం’ నిర్మించి తీరతాం
ఏలూరు : ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరతామని రాష్ట్ర గనులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఏలూరు జెడ్పీ అతిథి గృహంలో ఆదివారం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ వెల్ఫేర్ జేడీ ఆర్.మల్లికార్జునరావు ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారని చెప్పారు. తాను ఇతర ప్రజాప్రతినిధులు అక్కడ జరుగుతున్న పనుల ప్రగతిని సమీక్షిస్తామన్నారు. గోదావరి జలాలను తెలంగాణలో ఇష్టానుసారంగా ఎత్తిపోతల ద్వారా మళ్లించడంతో మన ప్రాంతం లో రబీకి నీటి కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కంకణబద్ధమై ఉందన్నారు.
పంటలు ఎండకుండా చూడండి
మెట్ట ప్రాంతంలో పంటలు ఎండిపోకుండా విద్యుత్‌ను అందించి రైతులను ఆదుకోవాలని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ టీవీ సూర్యప్రకాష్‌ను మంత్రి సుజాత కోరారు. ఆర్‌డ బ్ల్యూఎస్, ఏపీడీసీఎల్ అధికారులతో ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో సమృద్ధిగా నీరు అందక ఆయిల్‌పాం, చెరకు, పత్తి, అరటి వాణిజ్యపంటలు ఎండిపోతున్నాయన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో శనివారం రాత్రి వరకు విస్తృతంగా పర్యటించానని ఎక్కడకు వెళ్లినా రైతులు విద్యుత్ కష్టాల గురించి ఏకరువు పెడుతున్నారని చెప్పారు. ప్రధానంగా శివారు గ్రామాల్లో తాగునీరు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారని, వీటిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సుజాత ఆదేశించారు.
నేడు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని రాక
పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ, ఏలూరు ఎంపీ మాగంటిబాబు పరిశీలిస్తారని పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం అధికారులతో ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్షిస్తారన్నారు. పోలవరం సుజల సాగర అతిథి గృహంలో ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొంటారని తెలిపారు.