తాండూరు టౌన్, న్యూస్‌లైన్: గణేష్ ఉత్సవాలు పూర్తయ్యే వరకు జిల్లా పరిధిలో పోలీసు యాక్టు 30 కొనసాగుతుందని ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె తాండూరులో విలేకరులతో మాట్లాడారు. గతేడాది గణేష్ ఉత్సవాల సందర్భంగా తాండూరు పట్టణంలో చోటుచేసుకున్న పలు సంఘటనల నేపథ్యంలో ఈసారి పోలీసు యాక్టు 30ని కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇటీవల తాండూరు మండల పరిధిలో జరిగిన జంటహత్యల కేసులో వారంలోగా నిందితులను అరెస్టు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మృతి చెందిన మహిళలిద్దరూ దళితులని, నిందితులపై హత్య, అత్యాచారం కేసులతో పాటు అట్రాసిటి కేసు నమోదు చేయన్నుట్లు తెలిపారు. కరన్‌కోట ఠాణా పైనుంచి దూకి ఓ నిందితుడు ఆత్మహత్య చేసుకున్న కేసులో ఇప్పటికే ఎస్సై పవన్‌కు మేజర్ చార్జ్ మెమో ఇచ్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసుపై మెజిస్టీరియల్ విచారణ సబ్‌కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతోందని చెప్పారు. జిల్లా పరిధిలో సస్పెన్షన్‌కు గురై, మెమోలు పొందిన పోలీసులకు ఏఎస్పీ ఆధ్వర్యంలో వచ్చే నెల మొదటివారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యాలాల మండలానికి చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో రూరల్ సీఐ రవిపై ఏఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందన్నారు. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన కరన్‌కోట ఎస్సై శ్రీనివాస్ తప్పేమీ లేకున్నా కేవలం ఫోన్ స్విచాఫ్ చేసినందుకే చర్య తీసుకున్నట్లు ఆరోపణలున్నాయని ఎస్పీని విలేకరులు ప్రశ్నించగా.. ఠాణాలో విందు చేసుకుంటున్న సమయంలోనే సీఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని, అప్పుడు విధుల్లో ఉన్న నలుగురు కానిస్టేబుళ్లపై కూడా సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. ఘటనలో ఎస్సై ప్రమేయంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. బాలికలతో పాటు యువతులను ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌ల బారి నుంచి రక్షించేందుకు ప్రతి కళాశాలలో పీఎస్‌ల ఫోన్ నంబర్లు ఏర్పాటుచేశామన్నారు. అంతేకాకుండా కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, విద్యార్థులు, పోలీసులతో కలిసి త్వరలోనే సమావేశాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ రాజకుమారి వివరించారు