కా‘సారా’ కటకటాలకే | Police And Excise Officers Focus On Natu Sara Makers In East Godavari | Sakshi
Sakshi News home page

కా‘సారా’ కటకటాలకే

Published Sat, Aug 17 2019 11:28 AM | Last Updated on Sat, Aug 17 2019 11:29 AM

Police And Excise Officers Focus On Natu Sara Makers In East Godavari - Sakshi

నాటుసారా బట్టీలను ధ్వంసం చేస్తున్న ఎక్సైజ్‌ సిబ్బంది (ఫైల్‌)

దశలవారీగా మద్యనిషేధానికి నడుంకట్టిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదిశగా వేగంగా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా గ్రామాల్లో బెల్టుషాపుల నిరోధానికి పటిష్టమైన చర్యలు చేపట్టారు. దాంతో ‘సారా’ హవా విస్తరించేందుకు కొందరు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వారికి చెక్‌ చెబుతూ ఎక్సైజ్‌శాఖ విస్తృతంగా చర్యలు చేపడుతోంది.

సాక్షి, తూర్పుగోదావరి(పిఠాపురం) : ‘నేను చూశాను.. నేను విన్నాను.. నేనున్నాను’ అంటూ వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో మద్యం మహమ్మారితో చితికిపోతున్న కుటుంబాలను, మహిళల కష్టాలను గమనించారు. మద్యంతో, బెల్టు షాపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు మహిళలు ప్రజా సంకల్పయాత్రలో  జగన్‌మోహన్‌రెడ్డికి గోడు వెళ్లబోసుకున్నారు. దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే  బెల్టు షాపులను రద్దు చేశారు. మద్యం షాపుల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారు. మద్యం విక్రయాలపై ఆంక్షలు పెరగడంతో నాటుసారా తయారీకి వ్యాపారులు సమాయత్తమవుతున్నారు. గ్రామాల్లో నాటుసారా తయారీ బట్టీలు పెరిగే అవకాశం ఉండడంతో ఎక్సైజ్‌ శాఖ దానిపై దృష్టి సారించింది. సారా వ్యాపారులు పంటపొలాల్లో సారా బట్టీలను ఏర్పాటు చేసి తయారు చేస్తున్నట్టు సమాచారం అందింది.

దీంతో ఎక్సైజ్‌ సిబ్బంది మాత్రమే కాకుండా పోలీసులు కూడా నాటుసారా తయారీపై దృష్టి సారించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సారాను రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. ఎక్కువగా తీరప్రాంతంలో సరుగుడు తోటలు, వ్యవసాయ భూములలో, ఇసుక మేటల మధ్య సారా బట్టీలు ఏర్పాటు చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే దాడులు ముమ్మరం చేసి ఎక్సైజ్, పోలీసు సిబ్బంది పలువురిని అరెస్టు చేసి వందల లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు, పలువురిపై కేసులు సైతం నమోదు చేశారు.

నాటు సారాయే చీప్‌ లిక్కర్‌ 
బట్టీలలో తయారు చేసిన నాటుసారాను ఖాళీ మద్యం సీసాలలో నింపి చీప్‌ లిక్కర్‌గా అమ్మేందుకు సారా వ్యాపారులు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. నాటు సారాకు రంగు కలిపి క్వార్టర్‌ సీసాల్లో చీప్‌ లిక్కర్‌గా సీలు వేసి అమ్మకాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈతరహా తయారీ ఎన్నికల సమయంలో జోరుగా సాగింది. ఇప్పుడు దానిని కొనసాగించే ప్రయత్నాల్లో కొందరు ఉన్నట్టు తెలుస్తోంది.   

సారా తయారీకి ప్రత్యేక పంథా
తక్కువ సమయంలో ఎక్కువ సారా తయారు చేయడానికి తయారీ దారులు కొత్త పంథాను అవలంబిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక గొట్టాలను ఉపయోగిస్తున్నారు. బట్టీలో సారా కాస్తుండగా ఆగొట్టం ద్వారా ఎప్పటికప్పుడు సారా తయారై పీపాలలోకి వస్తుంది. అదే గతంలో అయితే సారా తయారు కావడానికి, చల్ల బడడానికి సమయం పట్టేది. కానీ ఇపుడు నిమిషాలలో లీటర్ల కొద్ది సారా తయారవుతోంది. ఎక్కడ చూసినా బట్టీలలో వేలాది లీటర్ల బెల్లం ఊటలు లభిస్తున్నాయి.  

కఠిన చర్యలు తప్పవు
సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ప్రత్యేక బృందాలు సారా స్థావరాలను గుర్తించే పనిలో ఉన్నాయి. ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేస్తోంది. నాటు సారా తయారు చేసినా, అమ్మినా, రవాణా చేసినా వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటాం. నియోజకవర్గంలో ఎక్కడైనా బెల్టు షాపులు నిర్వహించినా, ఎవరైనా వారికి మద్యం సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా బెల్టు షాపు నిర్వహిస్తున్నట్టు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక సిబ్బంది ద్వారా బెల్టు షాపులను పూర్తిగా మూయించి వేశాం. నాటుసారా బట్టీల పైనా దృష్టి సారిస్తున్నాం. నాటుసారా నిల్వలు, అమ్మకాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజను కోరుతున్నాం.   
– కె.కాత్యాయని, ఎక్సైజ్‌ సీఐ, పిఠాపురం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement