ఖాళీ చేయాల్సిందిగా దండోరా.. ఉత్కంఠ..! | Police Announce To Vacate Village In YSR Kadapa | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ..!

Published Wed, Oct 3 2018 2:09 PM | Last Updated on Wed, Oct 3 2018 2:09 PM

Police Announce To Vacate Village In YSR Kadapa - Sakshi

రామచంద్రనగర్‌లో పర్యటిస్తున్న అధికారులు

సాక్షి ప్రతినిధి, కడప : గండికోట నిర్వాసితుల్లో ఉత్కంఠ తీవ్రమైంది. ఏడాదిగా కపట నిద్రలో ఉన్న అధికార యంత్రాంగం హఠాత్తు పరిణామానికి వారు భీతిల్లిపోతున్నారు. గంట గంటకు నీరు పెరిగే అవకాశం ఉంది. కొండాపురం మండలంలోని రామచంద్రనగర్‌ను ఖాళీ చేయాలంటూ డండోరా వేయించారు. ఉన్నట్లుండీ గ్రామాలు ఖాళీ చేసి ఎక్కడికెళ్లాలంటూ బాధితులు నిలదీస్తున్నా.. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోతున్నారు. పైగా మీ ఇష్టమంటూ రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. పాలకులు త్యాగధనుల పాలిట కర్కశ వైఖరి ప్రదర్శిస్తున్నారు. గండికోట నిర్వాసితుల పట్ల ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి లోపించింది. ఏడాదిగా ముంపు పునరావాస పరిహారం చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. ఏడాదిగా వారి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఒక్కమారుగా ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా ఒత్తిడి పెంచారు. గండికోటకు నీరు నిల్వ చేస్తున్నాం. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందేనని నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్నారు. పునరావాసం ఏర్పాటు చేయలేదు. పరిహారం చెక్కులు చెల్లింపుల్లేవు, ఎక్కడికి వెళ్లాలి.. ఎలా వెళ్లాలి... చెట్టు నీడనా తలదాచుకోవడం సాధ్యమేనా అంటూ కనీస ప్రశ్నలు సంధించినా.. జవాబు చెప్పే ఓపిక అధికారులకు ఏమాత్రం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అటు వైపు కన్నెత్తి చూడకపోవడంపై ముంపు బాధితులు మండిపడుతున్నారు. ఎందుకు తమ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నరెవెన్యూ యంత్రాంగం
ముంపు వాసులను ఖాళీ చేయించడంలో రెవెన్యూ యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్వచ్ఛందంగా గ్రామాన్ని ఖాళీ చేస్తున్నట్లుగా అఫడవిట్‌ తయారు చేసి, అందులో సంతకాలు చేసిన తర్వాతే పరిహారం చెక్కు అందిస్తున్నారు. చెక్కు పుచ్చుకున్న వారి ఇళ్లు తక్షణమే కూలుస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి ఆది, ఎమ్మెల్సీ పీఆర్‌ వర్గీయులు అధికారులకు వత్తాసుగా నిలుస్తున్నారు. ముందుగా మా ఇళ్లు కూల్చాల్సిందిగా వారు వ్యూహాత్మకంగా ముందుకు వచ్చారని పలువురు వివరిస్తున్నారు. అఫిడవిట్‌ రాయించుకొని మరీ ఇళ్లు కూల్చడం వెనుక రెవెన్యూ అధికారుల ముందస్తు వ్యూహం దాగి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ముంపు వాసులను ఖాళీ చేయించాలి, ప్రాజెక్టులో నీరు నిల్వ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో పరిహారం అందజేసి ఉండాల్సి ఉందని పలువురు వివరిస్తున్నారు. కేవలం పులివెందులకు నీళ్లు ఇచ్చాం...అని చెప్పుకునేందుకు నిర్వాసితుల పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించాలా.. అంటూ ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.

ఆవేదనలో రామచంద్రనగర్‌ వాసులు
గండికోట ప్రాజెక్టులో ప్రస్తుతం 8.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కొండాపురం పరిధిలోని రామచంద్రనగర్‌ను గండికోట బ్యాక్‌ వాటర్‌ చుట్టుముట్టాయి. బుధవారం ఉదయం 10 గంటలకు గ్రామాన్ని ఖాళీ చేయించాల్సిందిగా రెవెన్యూ యంత్రాంగం మంగళవారం దండోరా వేయిం చింది. ఈ పరిస్థితుల్లో రామచంద్రనగర్‌ వాసుల్లో ఆవేదన, అలజడి రేగుతోంది. ‘ఉన్నట్లుండీ ఎక్కడికి వెళ్లాలి.. ఇంటి సామగ్రి ఎక్కడ ఉంచుకోవాలి... నడిరోడ్డుపై ఎలా ఉండగలం’.. ఇలాంటి ప్రశ్నలతో మథన పడుతున్నారు. అంతగా ఆవేదన చెందుతున్నా.. బాధ్యతాయుతమైన స్థానంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ పరిస్థితిపై తాము సమాజంలో ఉన్నామా.. లేదా.. అనే అనుమానం రేకెత్తుతోందని ఆ గ్రామ వాసి చంద్రశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో విధి నిర్వహణలో ఉన్న తాను తన కుటుంబాన్ని ఉన్నట్లుండీ ఎక్కడికీ తరలించాలని సాక్షి ప్రతినిధితో తన ఆవేదన పంచుకున్నారు. ఇదే విషయమై అధికారులను వాకబు చేస్తే వారి నుంచి సమాధానమే లేదని, పైగా తహశీల్దార్‌ వితండవాదం చేయవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తాము ప్రాజెక్టులో నీరు నిల్వ చేసేందుకు ఏమాత్రం అడ్డంకీగా లేమని, కాకపోతే గడువు ఇవ్వకుండా ఎలా ఖాళీ చేయాలంటూ ఆయన వాపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement