తిరుపతి క్రైం : నగరంలో చిరువ్యాపారాలు చేస్తున్నట్టు నటిస్తూ పురాతన బంగారును తక్కువ రేటుకు ఇస్తామంటూ బురిడీ కొట్టించే ఘరానా ముఠాను ఆదివారం సాయంత్రం బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం క్రైం పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన గోపాల్ చిత్తూరు జిల్లాలోని వాల్మీకిపురం మండలం నగరి మడుగు పంచాయతీ షికారిపాళెంకు చెందిన శివకృష్ణ, ఇతని బంధువు యోహాన్, శివప్రసాద్, కరుణాకరరెడ్డితో కలిసి ముఠాగా ఏర్పడ్డారని తెలిపారు. వీరు ఐదేళ్లుగా తిరుపతి, గుంటూరు, చిత్తూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, నల్గొండ, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో చిరువ్యాపారాలు చేస్తూ అమాయకులను గుర్తిస్తారని తెలిపారు.
ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ అమాయకులతో మాయమాటలు కలుపుతారని పేర్కొన్నారు. ఎంత తిరిగినా వ్యాపారం జరగడం లేదని, ఖర్చులకు కూడా రాలేదని ఆవేదన చెందుతారని తెలిపారు. తమ వద్ద బంగారు నాణేలు ఉన్నాయని, వాటిని తీసుకుని రూ.2 వేలు ఇస్తే తర్వాత డబ్బులిచ్చి నాణేలు తీసుకుంటామని నమ్మబలుకుతారని చెప్పారు. 4 రోజుల తర్వాత డబ్బులిచ్చి బంగారు నాణేలను తీసుకుంటారని తెలిపారు. ఈ నాణేలు టిప్పుసుల్తాన్ కాలం నాటివని, కష్టమొచ్చినప్పుడల్లా ఒక్కొక్క నాణేన్ని అమ్ముకుంటున్నామని నమ్మిస్తారని పేర్కొన్నారు. సహాయం చేసినందుకు తక్కువ ధరకే నాణేలు ఇస్తామని ప్రేరేపిస్తారని వివరించారు.
బంగారు నాణేలను చాకచక్యంగా మార్చేసి నకిలీ నాణేలు విక్రయిస్తారని పేర్కొన్నారు. ఈ తరహాలో మోసం చేసే ముఠాలు 15 ఉన్నట్టు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో నాలుగు బృందాల కదలికలపై నిఘా ఉంచామన్నారు. ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ముఠాలో నలుగురు సభ్యులను అరెస్టు చేశామని, మిగిలిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.3లక్షల నగదు, 1.5 కిలోల నకిలీ బంగారం, దుప్పట్లు, పూసలతోపాటు 8 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ 3.50 లక్షలు ఉంటున్నారు. వీరిని పట్టుకోవడంలో సీఐలు భాస్కర్‌రెడ్డి, అబ్బన్న, మధు, రసూల్ బాషా, పద్మలత, ఎస్‌ఐ రమేష్‌బాబు కృషి చేశారని తెలిపారు. వీరికి రివార్డులు వచ్చేలా చూస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment