హొళగుంద/ఆలూరు, న్యూస్‌లైన్: పోలీసు దెబ్బలు తాళలేక ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా హొళగుంద మండల పరిధిలోని నెరణిలో సోమవారం జరిగింది. వివరాలు.. గ్రామంలో జూదం ఆడుతున్న అల్లావలి, వీరనాగు, మల్లి, గురువసాదన్న, గాదేగౌడ్, మల్లయ్యలను ఆదివారం రాత్రి హొళగుంద ఎస్‌ఐ శివాంజల్ అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుళ్లు వారిని అక్కడే చితకబాదారు. తరువాత ఆటోలో పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, ఆక్కడా ఎస్‌ఐ శివాంజల్ వారిపై మరోసారి లాఠీతో విరుచుకుపడ్డారు.
అప్పటికే అనారోగ్యంతో ఉన్న మల్లయ్య దెబ్బలకు తాళలేక కుప్పకూలాడు. భార్య లక్ష్మి, బంధువులు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు తమ అదుపులో ఉన్న మరో ఐదుగురిని సైతం వదిలేశారు. పోలీసుల దెబ్బల వల్లనే మల్లయ్య మరణించాడని వీరిద్వారా తెలుసుకున్న గ్రామస్తులు సోమవారం వందలాదిగా మృతదేహంతో ఆలూరులోని పోలీసు సర్కిల్ కార్యాలయానికి చేరుకుని సీఐతో వాగ్వాదానికి దిగారు. మల్లయ్య మృతికి పోలీసులే కారణమని తేలితే, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
పోలీసుల దెబ్బలకు ఒకరి మృతి
Published Tue, Nov 19 2013 4:01 AM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM
Advertisement
Advertisement