జమాల్‌ఖాన్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న ప్రజా సంఘాల నేతలు (ఇన్‌సెట్) పోలీసులు తనను హింసించిన వైనాన్ని వివరిస్తున్న బాధితుడు
చేతిలో అధికారం ఉంది కదా అని పోలీసులు విచక్షణ మరచి ప్రవర్తించారు.అనుమానం పేరుతో ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. ఆపై తప్పు తెలుసుకునిఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం గుట్టుచప్పుడుకాకుండా బాధితుడ్ని నందిగామ నుంచి రాయచోటికి తరలించి చేతులుదులుపుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాయచోటి అర్బన్ : దొంగ బంగారం, వెండిని కొని విక్రయిస్తున్నాడనే నెపంతో కృష్ణా జిల్లా నంది గామ పోలీసులు రాయచోటికి చెందిన స్వర్ణకారుడు పఠాన్ జమాల్‌ఖాన్(30)పై క్రౌర్యాన్ని ప్రదర్శించారు. అర్ధరాత్రి ఇం టిపై దాడిచేసి రాయచోటి పట్టణ శివారు ప్రాంతానికి తరలించి దారుణంగా హిం సించారు. కాళ్లు చేతులు విరగొట్టి పైశాచికంగా ప్రవర్తించారు. ఆపై తమ బం డారం బయటపడుతుందన్న భయంతో విజయవాడకు తరలించి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించి.. గుట్టుచప్పుడు కాకుండా బాధితుడిని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
విచారణ పేరుతో విచక్షణ రహితంగా కొట్టి...
రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె ప్రాంతంలో కరీమియా మసీదుకు సమీపంలో జమాల్‌ఖాన్ నివశిస్తున్నారు. బంగారు, వెండి నగలు తయారు చేసి, వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒక దొంగ నుంచి వెండిని కొనుగోలు చేశాడన్న నెపంతో జమాల్‌ఖాన్ ఇంటిపై ఈనెల 12వ తేదీ తెల్లవారు జామున కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు దాడి చేసి అతన్ని పట్టుకెళ్లారు. విచారణ పేరుతో రాయచోటి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి కట్టెలతో విచక్షణా రహితంగా కొడుతూ, దారుణంగా హింసించారు.
నాలుగు రోజుల అనంతరం అప్పగింత..
పోలీసుల దెబ్బలకు జమాల్‌ఖాన్ కుడి కాలు మోకాలు, కుడి, ఎడమ చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎముకలు విరి గాయి. దీంతో హుటాహుటిన కడపకు తరలించి ఓ ఆర్థోపెడిక్ క్లీని క్‌కు తీసుకెళ్లి.. జీపు నుంచి కింద పడి గాయపడ్డాడని అక్కడి డాక్టరుకు చెప్పి ప్రాథమిక చికిత్స చేయించారు. అక్కడి నుంచి కృష్ణాజిల్లా నందిగామకు తరలించారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న జమాల్‌ఖాన్‌ను విజయవాడలోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలిం చి ఆపరేషన్ చేయించి, కట్టు కట్టించారు. నా లుగు రోజుల అనంతరం 16వ తేదీ కుటుంబ సభ్యులను నందిగా మకు పిలిపిం చుకుని జమాల్‌ఖాన్‌ను వారికి అప్పగించారు.
పోలీసుల వైఖరిపై స్వర్ణకారుల నిరసన
దెబ్బలతో విజయవాడ నుంచి 17వ తేదీ రాయచోటికి చేరుకున్న జమాల్‌ఖాన్, అతని కుటుంబ సభ్యులు భయంతో విషయాన్ని ఎవరికీ చెప్పకుండా మిన్నకుండిపోయారు. నోరువిప్పితే మరిన్ని కేసులు నమోదు చేస్తారేమోనని భయాందోళన మధ్య కాలం గడిపారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి బయటికి పొక్కింది. దీంతో ప్రజాసంఘాల నేతలు టి.ఈశ్వర్, రామాంజనేయులు, తాతయ్య తదితరులు బాధితుడి ఇంటికెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పారు. జమాల్‌ఖాన్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. పోలీసుల తనను కొట్టిన విధానాన్ని వైద్యులకు జమాల్ వివరించారు. వైద్యులు ఇదే విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. జమాల్‌ఖాన్ ఉదంతం తెలుసుకున్న పట్టణానికి చెందిన పలువురు స్వర్ణకారులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పోలీసుల దౌర్జన్యంపై నిరసన వ్యక్తం చేశారు.
పోలీసులే ఇలా హింసిస్తే మేమెలా బతకాలి
ప్రజలను రక్షించాల్సిన పోలీసులే దారుణంగా హింసించి, ఆసుపత్రి పాలు చేస్తే తామెలా బతకాలని జమాల్‌ఖాన్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జమాల్ భార్య నౌజియా, అత్త రమీదా, తండ్రి చాన్‌ఖాన్ తదితరులు మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్వర్ణకారుడిగా పనిచేస్తూ పొట్టపోసుకుంటున్న తమపై పోలీసులు జులుం ప్రదర్శించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 12వ తేదీ తీసుకెళ్లి 16వ తేదీ అప్పగించారని.. పోలీసుల దెబ్బలకు జమాల్ మరో 10 నెలల వరకు కోలుకోలేడని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని తమ కుటుంబాన్ని అప్పటి వరకు ఎలా పోషించుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు. జమాల్‌ను చిత్రహింసలకు గురిచేసిన నందిగామ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment