వామ్మో ఆ కానిస్టేబుళ్లు...!
Published Fri, Jul 8 2016 1:06 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
జరిమానా గోరంత ... వసూలు కొండంత
రోజుకు వేలల్లో సంపాదన
ఏళ్ల తరబడి పాతుకుపోయిన వైనం
తిరుపతి క్రైం: తెలిసో తెలియకో తప్పులు చేసినందుకు కోర్టులు వేసే జరిమానా కన్నా కానిస్టేబుళ్ల వసూల్లే భారంగా మారుతున్నాయని నిందితులు వాపోతున్నారు. అడిగినంత ఇవ్వకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టు వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని వారు బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేగాక కేసులను తమకు అనుకూలమైన న్యాయవాదులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కోర్టు బయట జరుగుతుండడంతో ఆ కానిస్టేబుళ్లపై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆయా కానిస్టేబుళ్లు సంవత్సరాల తరబడి అదే పోస్టుల్లో పాతుకుపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెట్టీ కేసుల్లోనే గిరాకీ
చిన్న పాటి నేరాలు చేసి చిక్కిన వారిపై పోలీసులు పెట్టీ కేసులు నమోదు చేస్తారు. వారిని కానిస్టేబుళ్ల ద్వారా కోర్టులో హాజరుపరుస్తారు. ఈ క్రమంలో వారిని తీసుకువచ్చిన కొందరు కానిస్టేబుళ్లు ఖర్చుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, పేకాటరాయళ్లు తదితరులు దొరికితే కానిస్టేబుళ్లకు పండుగే. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి స్టేషన్ నుంచి రోజుకు కోర్టుకు 10 నుంచి 20 కేసులు వస్తుంటాయి. వీరి నుంచి ప్రతిరోజూ ఆయా కానిస్టేబుళ్లు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం.
అనుకూలమైన న్యాయవాదులకే కేసులు
రోడ్డు ప్రమాదాల కారణమైన వారు బయట ప్రాంతాలకు చెందినవారైతే కొందరు కానిస్టేబుళ్లు మధ్యవర్తులుగా మారుతున్నారు. ఫలానా న్యాయవాది తొందరగా బెయిల్ ఇప్పిస్తారని, కేసు గెలుస్తారని చెబుతూ తమకు అనుకూలమైన వారికే కేసు అప్పగిస్తున్నారు. అందుకు గాను భారీగా ముడుపులు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇంకా కొన్ని కేసుల్లో జూనియర్ న్యాయవాదులకు కేసులు అప్పగించి బాధితుల వద్ద భారీ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్టు తెలిసింది. అందులో నుంచి న్యాయవాదులకు కొద్దోగొప్పో ఇచ్చి మిగిలినది తమ జేబుల్లో వేసుకుంటున్నట్టు సీనియర్ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement