రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అధికార టీడీపీ నాయకులకు కూడా (తప్పుడు పనులు చేసే వారికి) చెమటలు పట్టిస్తూ జిల్లాస్థాయి పోలీసు అధికారులు తమ పవర్ చూపిస్తున్నారు. అయితే.. కొంతమంది పోలీసులు మాత్రం తమ సహజ ధోరణిలోనే అవినీతి, అక్రమ దందాల్లో మునిగితేలుతున్నారు. ఏలూరులోని కొంతమంది ఖాకీలైతే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాల మాదిరిగా డబ్బుల వసూళ్లకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఏలూరు నగరంలోని ట్రాఫిక్‌ను తగ్గించేందుకు భీమవరం, నరసాపురం, కైకలూరు మీదుగా వచ్చే వాహనాలను మినీ బైపాస్ మీదుగా జాతీయ రహదారి వైపు మళ్లిస్తున్నారు. రాత్రిపూట భారీ వాహనాలు, లారీలు ఎక్కువగా ఆ రహదారి మీదుగా వెళ్తుంటాయి. ఇదే అదనుగా నగరంలోని కొంతమంది పోలీసులు రాత్రి 10గంటల తర్వాత అక్కడ కాపుకాసి తనిఖీల సీన్ క్రియేట్ చేసి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. మినీ హైవేపై ఓ పాయింట్‌లో జీపు ఆపుకుని ఓ పోలీసాయన ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటాడు.
ముగ్గురు, నలుగురుకానిస్టేబుళ్లు అటుగా వచ్చే లారీలను ఆపి డ్రైవింగ్ లెసైన్స్ మొదలు.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వరకు మొత్తం చూపించాల్సిందిగా డ్రైవర్, క్లీనర్లను హడావుడి చేస్తారు. మీరెవరని పొరపాటున ఎవరన్నా అడిగితే.. ‘ఆర్‌టీఏ సార్ జీపులో కూర్చున్నారు. ఆయన దగ్గరకు వెళ్తే నేరుగా స్టేషన్‌కే.. లేదా ఫైన్ ఇంకా ఎక్కువవుతుంది’ అని బెదిరిస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవని లారీ డ్రైవర్లు పచ్చనోట్లు తీసి ఖాకీల జేబుల్లో కుక్కి వెళ్లిపోతున్నారు. అయితే, సదరు పోలీసులు ప్రైవేటు బస్సుల జోలికి మాత్రం పొరపాటున కూడా పోరట. ఎందుకంటే ప్రైవేటు బస్సుల యాజమాన్యాలకు ఆర్టీఏ ఉన్నతాధికారులతో నేరుగా సంబంధాలు ఉంటాయి. దీంతో వీరి బండారం బయటపడుతుందని బస్సుల వైపు కన్నైత్తి చూడరట. ఇలా నిశిరాత్రి దాటిన తర్వాత నాలుగైదు వేల రూపాయలు వసూలు చేసుకుని ఇవాళ్టికి ఇది చాలు అని సదరు ఖాకీలు ఇళ్లకు వెళిపోతున్నారట. మరి పోలీసులు ఇలా ఆర్‌టీఏ ముసుగులో లేకిగా వసూళ్లకు పాల్పడుతుంటే వీళ్లకంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివిన రవాణా అధికారులు ఏం చేస్తున్నట్టబ్బా..!
కార్పొరేటర్ల చిల్లర నొక్కుళ్లు
మొక్కల పేరిట అధికారులు లక్షలు బొక్కితే.. ప్రజాప్రతినిధులైన తాము తీసిపోయామా అంటూ ఏలూరు కార్పొరేటర్లూ అందిన కాడికి దోచేస్తున్నారట. రూ.లక్షలు ఖర్చుచేసి గెలిచి 6 నెలలైనా ఇప్పటికీ నిధుల్లేక, పనుల్లేక కార్పొరేటర్లు అల్లాడిపోతున్నారు. దీంతో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పడితే.. మరికొంత మంది నగరపాలక సంస్థనే నమ్ముకుని ఎక్కడి నుంచి ఎలా డబ్బులు వస్తాయనే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే చివరకు కొంతమంది కార్పొరేటర్లు ‘చిల్లర’ కూడా వదలడం లేదని అంటున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని నగరంలోని చాలా డివిజన్లలో నిర్వహించారు.
ఈ కార్యక్రమ నిర్వహణకు కొన్ని డివిజన్ల కార్పొరేటర్లు రూ.12 వేల చొప్పున ఖర్చరుు్యందంటూ బిల్లులు పెట్టారట. మహా అయితే 50కుర్చీలు, ఒక టెంట్‌వేసి సభ నిర్వహించినందుకు జమా ఖర్చులు చూస్తే చాలా డివిజన్లలో రెండు, మూడు వేలు కూడా ఖర్చు కాలేదని తేలిందట. అయినా రూ.వేలకు వేలు బిల్లులు పెట్టారట. ఇలా చిన్నపాటి కార్యక్రమ నిర్వహణకే చిల్లర నొక్కుళ్లకు పాల్పడితే భవిష్యత్‌లో రూ.కోట్లతో చేపట్టే భారీ ప్రాజెక్టుల్లో ఎంత దిగమింగుతారో! ఏమో.. పాలకులకు తప్ప ఎవరికెరుక.
- జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
పగలు ఖాకీ.. రాత్రి లే
Published Sun, Nov 30 2014 1:25 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement