సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :ఉత్తరాంధ్ర జిల్లాలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలో నేపథ్యంలో జిల్లాలో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. వారం రోజుల వ్యవధిలో నకిలీ ఐఏఎస్ అధికారి వ్యవహారం బయటపడడం, లైంగిక వేధింపుల కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం, తుపాకీ మిస్‌ఫైర్ సంఘటనలో ప్రాంతీయ నిఘా-అమలు విభాగ ఉన్నతాధికారి అరెస్టు తదితర సంఘటనలు పోలీస్‌శాఖను కుదిపేశాయి. సిక్కోలు జిల్లాలో శనివారం పాతకక్షల నేపథ్యంలో బూర్జ ప్రాంతానికి చెందిన ఓ మాజీ సర్పంచ్ తనపై ప్రత్యర్థులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారని చెబుతున్న నేపథ్యంలో పట్టణంతో సహా పలు ప్రాంతాలపై పోలీసులు నిఘా పెంచారు.
ఇందులో భాగంగా ఆయుధాల వినియోగం, పాత నేరస్తుల కదలికలు, అధికారులు, నాయకుల పేరిట బుగ్గ కార్ల వినియోగంపైనా దృష్టిసారించాలని నిర్ణయించారు. వేసవి నేపథ్యంలో చోరీల నియంత్రణకు జిల్లా పోలీస్‌శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. టెక్కలిలో ఓ మహిళను బెదిరించి బంగారం దోచుకునేందుకు ప్రయత్నించగా బాధితురాలు తిరగబడడంతో తుపాకీతో బెదిరించిన సంఘటననూ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. గస్తీ ముమ్మరం చేస్తేనే తప్పా పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేమని భావిస్తున్నారు. ఇందుకోసం అదనపు సిబ్బంది ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలతోపాటు హైవే పెట్రోలింగ్ వాహనాల్నీ సమకూర్చుకున్నారు.
ఐఎఎస్ అధికారినంటూ విశాఖ పరిధిలో పలువురు నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన సంఘటనలో నిందితుడు పొందల రమేష్‌నాయుడుది శ్రీకాకుళం జిల్లాయే కావడంతో అతని గత చరిత్రపైనా ఆరా తీయాలని పోలీసులకు సమాచారం అందినట్టు తెలిసింది. సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురానికి చెందిన రమేష్‌నాయుడ్ని అరెస్టు చేసిన పోలీసులు నిందితుడి సహచరులు, బంధువులుపైనా దృష్టి సారించినట్టు సమాచారం.ఇక్కడి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాంతీయ అధికారి, అదనపు ఎస్పీ ఆర్‌ఎస్‌ఆర్‌కే రాజు విజయనగరం జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న మిస్‌ఫైర్ సంఘటనలో అరెస్టయ్యారు.
టెక్కలిలో ఇటీవల జరిగిన కాల్పుల సంఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సంఘటన స్థలంలో స్థానికులు చెబుతున్నట్టుగా ద్విచక్రవాహనం రంగు, మోడల్ ఆధారంగా రవాణాశాఖలోని వివరాలు సేకరించగ లిగారు. విశాఖ సహా మూడు జిల్లాల్లోనూ లెసైన్స్‌డ్ ఆయుధాలు కలిగిన వ్యక్తుల్ని ఆరా తీశారు. ఆయుధాలు విక్రయిస్తున్న దుకాణదారుల్నీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు డీఎస్పీలతో పాటు ప్రత్యేక సిబ్బందిని ఈ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్ ఆదేశించారు. ఇటీవల శ్రీకాకుళం పట్టణ నడిబొడ్డున ఉన్న టైటాన్ షోరూంలో వాచీల చోరీ ఘటననూ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మూకుమ్మడిగా దుకాణంలోకి చొరబడి ఖరీదైన వాచీల్ని లూటీ చేశారంటే నిందితులు కచ్చితంగా పక్క రాష్ట్రాలకు చెందిన వారేనని అనుమానిస్తూ ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు.
మోసాలకు పాల్పడేందుకు, తాము ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారుల మంటూ ఉద్యోగాలిప్పిస్తామంటూ ముఠాలు తయారవుతుండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. విశాఖ సిటీ సహా మూడు జిల్లాల పరిధిలో ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక సమాచారం అందింది. వాహనాల తనిఖీ, గుర్తింపు సమయంలో బుగ్గ కార్లపై అప్రమత్తం కావాలని, పత్రాలు పరిశీలించాకే ముందుకు వదలాలని కూడా సూచించినట్టు తెలిసింది. ఇదే జిల్లాకు చెందిన ఓ యువ ఇంజినీర్ పాస్‌పోర్ట్‌లిప్పిస్తానంటూ యువతుల్ని పరిచయం చేసుకుని శారీరకంగా లొంగదీసుకుంటున్నట్లు వచ్చిన ఆరోపణలపై విశాఖ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ సంఘటన కూడా స్థానికంగా చర్చనీయాంశమైంది.
పోలీస్ నిఘా
Published Sun, Mar 22 2015 3:14 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement
Advertisement