అంతా ‘ఆధార్’ మయం
* పోలీస్‌శాఖకూ ఆధార్ అనుసంధానం
* అరెస్టు ముందు నిందితుని సంఖ్య నమోదు
* భవిష్యత్‌లో ఫింగర్ ప్రింట్స్‌కూ అనుసంధానం
* ఇక నేరగాళ్ల చరిత్ర పోలీసుస్టేషన్లలో క్షణాల్లో ప్రత్యక్షం
మార్కాపురం : ఆధార్ సంఖ్య నమోదు విధానాన్ని పోలీస్‌శాఖలోనూ అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రేషన్‌కార్డులు, విద్యార్థుల ఉపకారవేతనాలు, విద్యుత్ మీటర్లు, పాస్‌పుస్తకాలు, పింఛన్లు, సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్న ఆధార్ నమోదును ఇక నుంచి పోలీస్‌శాఖ కూడా అమలు చేయనున్నారు. నిందితుల అరె స్టు సమయంలో ఆధార్ సంఖ్యను నమోదు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో అమలు చేస్తున్నారు.
ఆధార్ సంఖ్యను నమోదు చేయటం వల్ల పోలీసుల దర్యాప్తు వేగంగా ముందుకు సాగనుంది. ఇప్పటి వరకూ వివిధ కేసుల్లో ఉన్న నిందితులను విడిపించేందుకు జామిన్‌దారులు నకిలీ సర్టిఫికెట్లు జత చేసి వారికి బెయిల్ ఇప్పిస్తున్నారు. దీంతో నిందితుడు బయటకు వచ్చిన తర్వాత మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడు. దీంతో కోర్టు నాన్‌బెయిలాబుల్ వారెంట్ జారీ చేసినప్పుడు పోలీసులు జామిన్‌దారుల అడ్రస్‌కు వెళ్తే అక్కడ వారి జాడ ఉండటం లేదు.
ఇలాంటి మోసాలను ఆధార్ నమోదు వలన అరికట్టవచ్చు. ఆధార్‌కార్డు తీసే సమయంలో వ్యక్తి వేలిముద్రలు, కనుపాపలు కూడా రికార్డు చేస్తారు. పోలీస్‌శాఖలో కేవలం వేలిముద్రలు రికార్డు చేసే సౌకర్యం మాత్రమే ఉంది. పోలీస్‌శాఖలో ఫింగర్ ప్రింట్స్ విభాగాన్ని పోలీస్ నెట్‌వర్క్ పరిధిలోకి వచ్చే అన్ని స్టేషన్లకు అనుసంధానం చేయనున్నారు. నేరం చేసిన వ్యక్తి ఆధార్ నంబర్ నమోదు చేస్తే అతడి గత నేరాలు క్షణాల్లో తెలిసిపోతాయి.
దొంగతనాలు జరిగినప్పుడు క్రైమ్ బ్రాంచి సిబ్బంది, క్లూస్ టీమ్ సిబ్బంది సంఘటన స్థలాల్లో వేలిముద్రలు సేకరించి పాత నేరగాళ్ల వేలిముద్రలతో పోల్చుకుంటుంటారు. ప్రస్తుతం ఈ విధానం వల్ల ఉపయోగం అంతంత మాత్రమే. దీని వలన నేరస్తులు త్వరగా తప్పించుకుంటున్నారు. ఆధార్ సంఖ్య నమోదు చేస్తే సదరు వ్యక్తి వేలిముద్రలతో పాటు గత చరిత్ర కూడా పోలీసుల కళ్లముందుంటుంది. ఈ సమాచారాన్ని రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో తెలుసుకోవచ్చు. మార్కాపురం సబ్ డివిజన్‌లోని 13 పోలీస్‌స్టేషన్లలో నిందితుల అరె స్టు సమయంలో కచ్చితంగా ఆధార్ సంఖ్యను ఎస్‌హెచ్‌ఓలు నమోదు చేస్తున్నారు.