నిందితులతో చేతులు కలిపిన పోలీసులు
ఇద్దరు సీఐలు, ఓ ఎస్‌ఐ సస్పెన్షన్
తిరుపతి క్రైం: చిత్తూరు, అర్బన్ జిల్లా పరిధిలో నేరస్తులకు సహకరించిన ఇద్దరు సీఐలు, ఒక ఎస్‌ఐని సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. తిరుపతి క్రైం పోలీస్ స్టేషన్లో గత వారమే సీఐగా బాధ్యతలు తీసుకున్న ఏ.సత్యనారాయణ, కార్వేటినగరం సీఐ హెచ్. వెంకటేశ్వర్లు, వెదురుకుప్పం ఎస్‌ఐ వెంకటసుధాకర్‌రెడ్డి సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. వీరు ముగ్గురూ విధులు సక్రమంగా నిర్వహించకపోవడమే కాకుండా నిందితులకు సహకరించినట్లు కీలకమైన ఆధారాలు దొరికాయి.
భూ కబ్జా కేసులో నేరస్తులకు సహకరించిన క్రైం సీఐ
వారం కిందట తిరుపతి క్రైంపోలీస్ స్టేషన్ సీఐగా సత్యనారాయణ నియమితులయ్యారు. ఈయన గతంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కూడా సీఐగా పనిచేశారు. 2006లో తిరుచానూరు రోడ్డులోని నారాయణపురంలోదొడ్డారెడ్డి శ్రీమన్నారాయణరెడ్డి తన భూమిలో ప్రసన్నకుమార్, రాజేంద్ర, మాధవ, రవికుమార్‌రెడ్డితో పాటు కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ప్రవేశించి దాడులకు దిగి తీవ్రంగా గాయపరిచారని అప్పటి ఈస్ట్ ఎస్‌ఐ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. అసలైన నిందితు ల స్థానంలో ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేని మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి సీఐ రిమాండ్‌కు తరలించారు. దీంతో పాటు కేసు రికార్డులను తయారు చేసి దర్యాప్తును పక్కదారి పట్టించి నిందితుడు తక్కువ శిక్ష పడేలా చేశారని బాధితుడి ఫిర్యాదుతో ఈయనను సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
హత్యకేసును పక్కదారి పట్టించిన సీఐ, ఎస్‌ఐ
కార్వేటినగరంలో ప్రస్తుతం సీఐగా విధులు నిర్వహిస్తున్న హెచ్.వెంకటేశ్వర్లు, వెదురుకుప్పం ఎస్‌ఐ పి.వెంకటసుధాకర్‌రెడ్డి ఓ హత్యకేసు దర్యాప్తును పక్కదారి పట్టించినందుకు సస్పెండ్‌కు గురయ్యారు. డీఐజీ ఉత్తర్వుల్లో పేర్కొన్న వివరాల మేరకు.. ఈ ఏడాది జనవరి 13వ తేదీన తిరుచానూర్‌కు చెందిన సునీల్‌కుమార్‌ను చంద్రగిరి రాజేంద్ర, అతని డ్రైవర్ సురేష్, పి.రాము కలసి కిడ్నాప్ చేసి హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని వెదురుకుప్పం సమీపంలో పారేశారు. దీనిపై వెదురుకుప్పంలో హత్యకేసును ఎస్‌ఐ వెంకటసుధాకర్‌రెడ్డి నమోదు చేశారు. అంతకు ముందు సునీల్ కుమార్ కనపడడం లేదని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది.
ఈ హత్యకేసు దర్యాప్తును కార్వేటినగరం సీఐ వెంకటేశ్వర్లు, వెదురుకుప్పం ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి పక్కదారి పట్టించారు. నింది తులతో నిరంతరం ఫోన్‌లో మాట్లాడుతూ వారిని అప్రమత్తం చేశారే తప్ప దర్యాప్తును మాత్రం పూర్తిచేయలేదు. మృతుల తల్లిదండ్రులు సీఐని, ఎస్‌ఐని కలసి ఈ ముగ్గురు నిందితులే తమ కుమారుడిని కిడ్నాప్ చేశారని చెప్పినా పట్టించుకోలేదు. కేసులోని సెక్షన్‌లను మార్చివేశారు. పోస్ట్‌మార్టంలో కూడా మెడ గట్టిగా నొక్కడంతో మృతిచెందాడని తేలింది. అయినా కూడా దర్యాప్తును సక్రమంగా కొనసాగించకుండా నిందితులకు సహకరించారు. ఈ నేపథ్యంలో అనంతపురం డీఐజీ కేసును అర్బన్ జిల్లా పోలీసులకు బదిలీ చేశారు. అర్బన్ జిల్లా పోలీసులు మార్చి 7వ తేదీన హత్యకేసు నిందితులను చంద్రగిరి రాజేంద్ర, డ్రైవర్ సురేష్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులు తామే భూవివాదంలో సునీల్‌కుమార్‌ను హతమార్చినట్లు విచారణలో ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో సీఐని, ఎస్‌ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
భక్షక భటులు
Published Sat, May 16 2015 2:10 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement