‘కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ పోలీస్‌స్టోరీ సినిమాలో హీరో సాయికుమార్ పోలీస్ శాఖ పనితీరు గురించి ఎంతో గొప్పగా చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ, ఎనిమిదేళ్ల సర్వీసులోనే ఎన్నో అక్రమాలకు పాల్పడి ఆ శాఖ పరువును బాజారకీడ్చి, తాజాగా సస్పెన్షన్‌కు గురైన ఎస్‌ఐ రామాంజనేయులు పనితీరును గమనిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.
కోదాడ/ చిలుకూరు/ మిర్యాలగూడ అర్బన్/ చింతపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన ఎం.రామాంజనేయులు 2013లో డిండి పోలీస్‌స్టేషన్‌లో ప్రొబేషనరీ ఎస్‌ఐగా పనిచేశారు. తదనంతరం 2014లో కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐగా నియమింపబడ్డారు. తొలిపోస్టింగ్‌లోనే వివాదాస్పదుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌తో సఖ్యతగా మెలుగుతున్నాడని ఫిర్యాదులు అందడంతో 2015లో ఉన్నతాధికారులు ఆయనను వీఆర్‌కు అటాచ్ చేశా రు. అయితే, ఆరు నెలలు తిరక్కముందే మోతె పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐగా పోస్టింగ్ తెచ్చుకుని కొన్ని నెలలు పనిచేశారు.
వివాదాలకు కేంద్ర బిందువుగా..
2016 సెప్టెంబర్ నుంచి 2018 ఆగస్ట్ వరకు మిర్యాలగూడ పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన కాలంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారని విమర్శలు వచ్చాయి. అప్పట్లో పని చేసిన సీఐని కాదని అనేక సెటిల్‌మెంట్లలో తలదూర్చి తనదైన శైలిలో వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలోని రాజీవ్‌చౌక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఓ ద్విచక్రవాహనదారుడిని అకారణంగా చితకబాది చివరకు క్షమాపణ చేప్పే స్థాయికి తెచ్చుకున్నాడని తెలుస్తోంది. అదే విధంగా పలు కేసుల్లో పట్టుబడిన ద్విచక్రవాహనాలను గుట్టు చప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అసలు బైక్ యజమాని ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన జిల్లా పోలీస్ శాఖ అధికారులు ఆ సమయంలో ఎస్‌ఐ రామాంజనేయులును ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
అనంతగిరిలో అంతులేకుండా..
2018 నుంచి 2020 వరకు రామాంజనేయులు అనంతగిరి ఎస్‌ఐగా పని చేస్తున్న సమయంలో అంతులేకుండా అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అధికారపార్టీ నాయకులతో అంటకాగి విపక్షాలకు చెందిన నాయకులను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నాడనే విమర్శలు వచ్చినా ఆయన మాత్రం తన వైఖరి మార్చుకోలేదని తెలుస్తోంది. ఉదయం సాయంత్రం ఆయన అధికార పార్టీ నేతల వద్ద హాజరు వేయించుకున్న తరువాతే డ్యూటీకి వెళ్లేవారని గుసగుసలు వినిపించేవి. ఎస్‌ఐ అక్రమాలపై కోదాడ రూరల్ సీఐగా పనిచేసిన శివరామిరెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తనకున్న పలుకుబడితో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారని తెలుస్తోంది.
పీడీఎస్ బియ్యం రవాణా చేస్తూ దొరికిన ట్రాక్టర్‌ను కేసు నుంచి తప్పించడానికి రైతు నుంచి రూ.2లక్షలు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. గుట్కాలు అమ్ముతున్నారని వెంకట్రాంపురంలో ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని చర్చ జరిగింది. ఇక్కడ పాలేరు నుంచి ఇసుక రవాణా చేసే వారి నుంచి నెలవారీ మాముళ్లను వసూలు చేసేవాడని, సీసీ కెమెరాల ఏర్పాటులో కూడా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడని, ఓ మహిళతో పోలీసులకు పట్టుబడిన బంగారం వ్యాపారి కొడుకు విషయంలో, మరో అధికార పార్టీ కౌన్సిలర్ నుంచి కూడా ఆయన రూ.లక్షల్లో వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.
నకిలీ పత్రాలతో బీమా క్లెయిమ్ చేయించి..
మోతెలో పనిచేస్తున్న సమయంలో అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో నార్కట్‌పల్లి కామినేని నుంచి జారీ చేసిన బిల్లులతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీంతో వారు లక్షల రూపాయల బీమా క్లెయిమ్ చేశారు. దీనిపై అనుమానం వచ్చిన బీమా సంస్థ అప్పటి సూర్యాపేట ఎస్పీ భాస్కరన్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి బోగస్ బిల్లులుగా తేల్చారు. ఈ బిల్లులతో బీమా క్లెయిమ్ చేయడంలో ఎస్‌ఐ పాత్ర ఉందని తేలడంతో 2020 నవంబర్ 4న ఆయనను ఎస్పీ సస్పెండ్ చేసి సూర్యాపేట జిల్లా నుంచి నల్లగొండ ఎస్పీకి అటాచ్ చేశారు.
90రోజులు.. ఎన్నో వివాదాలు
సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత ఎస్‌ఐ రామాంజనేయులు కొద్ది రోజులు దేవరకొండలో పనిచేశారు. అనంతరం గత జనవరి 22న చింతపల్లి ఎస్‌ఐగా విధుల్లో చేరారు. పది రోజుల వ్యవధిలోనే మండల పరిధిలోని మోద్గులమల్లపల్లి సర్పంచ్ భర్త మర్ల వెంకటయ్యపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం వింజమూరు గ్రామానికి చెందిన ఓ మహిళపై చెయ్యిచేసుకోవడం, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోకపోవడం,ఇసుక దిబ్బ కూలి బాలుడు మృతిచెందినా కేసు నమో దు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. మాల్ వెంకటేశ్వరనగర్ పెట్రోల్ బంక్ వద్ద తల్లిదండ్రులతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఎనిమిదేళ్ల వయసున్న బాలిక మృతిచెందిన కేసు విచారణను పక్కదోవ పట్టించారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగడం గమనార్హం. తాజాగా చింతపల్లి మండలం కుర్మేడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద తనపై ఉన్న కేసులను తొలగిస్తానంటూ రూ.8లక్షలను తీసుకోవడంతో పూర్తి స్థాయి విచారణ చేసిన అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో 90 రోజుల పాటు విధులు నిర్వహించిన రామాంజనేయులు ఎన్నో వివాదాల్లో తలదూర్చినట్లు విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment