గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ వద్ద పోలీసుల హైడ్రామా..
గుడివాడ : స్థానిక ఆఫీసర్స్ క్లబ్‌లో జూదం ఆడుతున్నారనే సమాచారంతో గుడివాడ పోలీసులు క్లబ్‌పై దాడి చేశారు. క్లబ్ సభ్యులు పోలీసు అధికారులపట్ల దురుసుగా మాట్లాడటంపై కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో శనివారం మధ్యాహ్నం గుడివాడ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ వద్ద హైడ్రామా కొనసాగింది. స్వాతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఈసంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి..
స్థానిక ఆఫీసర్సు క్లబ్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారం జిల్లా ఎస్పీకి చేరింది. దీంతో స్పందించిన ఎస్పీ స్థానిక డీఎస్పీకి సమాచారం అందించారు. వన్‌టౌన్ సీఐ మూర్తి, ఇద్దరు ఎస్సైలతో అక్కడికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసారు. కాగా క్లబ్ సభ్యులు ఎదురు తిరిగి పోలీసులపై వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ అంకినీడు ప్రసాద్ అక్కడికి చేరుకుని అక్కడ పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా అధికార పార్టీలోని ఒక వర్గానికి చెందిన వారు కావటంతో జిల్లాలో ఉన్న మంత్రిని వీరు ఆశ్రయించారు. పేకాట ఆడుతూ దొరికిన వారిలో క్లబ్ కార్యవర్గంలో ఉన్న ప్రముఖులు, పట్టణానికి చెందిన ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.
స్టేషన్ వద్ద హైడ్రామా...
ఈసంఘటన జరిగిన వెంటనే స్థానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్ వద్ద హైడ్రామా కొనసాగింది. కాగా పేకాట ఆడుతూ దొరికిన వారి పేర్లు మార్పుచేయాల్సిందిగా పోలీసులపై తీవ్రస్థాయిలో వత్తిడి తెచ్చారు. ఒకా నొక దశలో దొరికిన వారి స్థానంలో వేరొకరిని మార్పుచేసే ప్రయత్నాలు జరిగాయి. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పోలీసులను ప్రశ్నించటంతో పోలీసులు ఆలోచనలో పడ్డారు. కష్టపడి క్లబ్‌పై దాడిచేసి పట్టుకుంటే ఇటువంటి అపవాదులు ఏమిటనే ఆలోచనతో కనీసం కొందరినైనా అసలు వారిని ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం.
నలుగురి అరెస్టు, 1720 నగదు స్వాధీనం
ఆఫీసర్సు క్లబ్‌పై జరిపిన దాడిలో నలుగురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసామని వన్‌టౌన్‌సీఐ మూర్తి పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి రూ.1720 నగదు స్వాధీన పర్చుకున్నట్లు వివరించారు. అదుపులోకి తీసుకున్న వారిలో గొట్టిపాటి రవి, పొట్లూరి వెంకటేశ్వరరావు (ఎర్రబుజ్జి), కాట్రగడ్డ అప్పారావు, సోడాబత్తుల వెంకటేశ్వరరావులు ఉన్నట్లు చెప్పారు.
పార్టీలో ఉన్న వారి మధ్య విబేధాలే కారణం?
గుడివాడ క్లబ్‌కు వారం క్రితం నూతన కార్యవర్గం ఎన్నికైంది. గుడివాడ క్లబ్‌లో దాదాపు పది సంవత్సరాలుగా పేకాట ఆడకుండా స్థానిక ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రయత్నిస్తున్నారు. అయితే కొత్తగా ఎన్నికైన వారిలో కొందరు తాము పేకాట ఆడిస్తామని ప్రగల్భాలు పలికినట్లు తెలిసింది. అయితే కొత్తగా కార్యవర్గం ఎన్నికైన తరువాత శనివారం కార్యవర్గం మొదటి సమావేశం జరుగుతుంది. ఈసమావేశం సందర్భంగా వచ్చిన సభ్యుల్లో కొందరు పేకాట ఆడేందుకు ప్రయత్నించారు. ఈవిషయం అధికార పార్టీలోని ఒక వర్గం పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించటంతో ఈ రగడ ఏర్పడిందనేది తెలిసింది. దీంతో మరోవర్గం వారు. మంత్రిని ఆశ్రయించారు. అయితే మంత్రి చొరవతో పేర్లు మార్పిడికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.