వామపక్ష నాయకులపై లాఠీచార్జి
► నేతలను ఈడ్చుకెళ్లి వాహనంలోపడేసిన పోలీసులు
► సీపీఎం, సీపీఐ కార్యదర్శులు రఘు, వనజలపై దౌర్జన్యం
గుడివాడ: ఇలపర్రు దళితులపై పోలీసు జులుం ప్రదర్శించారు. ఆందోళనకారులను చితకబాదారు. దాడిలో సీపీఎం, సీపీఐ నాయకులు గాయపడ్డారు. వంద మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాలు.. నందివాడ మండలం ఇలపర్రులో భూస్వాముల ఆక్రమణలో ఉన్న 165 ఎకరాల భూమిని తిరిగి పేదలకు ఇవ్వాలని కోరుతూ వామపక్షాలు ఐదు నెలలుగా వివిధ దశల్లో ఉద్యమం చేస్తున్నాయి. ప్రభుత్వ స్పందించకపోవడంతో సోమవారం ఆర్డీవో కార్యాలయం ముట్టడికి వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఉదయం 10 గంటలకు స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్ నుంచి ఉద్యమకారులు ర్యాలీగా బయలుదేరి స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అప్పటికే పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
కార్యాలయం వద్ద బైఠాయింపు: కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో వామపక్షనాయకులు, వివిధ ప్రజాసంఘాలు, జనసేన, దళిత నాయకులు ఆర్డీవో కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించారు.
భూముల కోసం పోరాటం ఆగదు: భూస్వాములు ఆక్రమించుకున్న దళితుల భూములు దళితులకే చెందుతాయని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నా ప్రభుత్వం బడాబాలుకు కొమ్ముకాస్తోందని వామపక్షాల నాయకులు ఆర్.ర«ఘు, అక్కినేని వనజ ఆరోపించారు. స్థానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్ వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ కేవలం దళితులను అణచి వేసేందుకు ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జి చేయించిందన్నారు. అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు సీతామహాలక్ష్మి ఆక్రమించుకున్న భూముల్లో ఇలపర్రు దళితులకు చెందిన 27 ఎకరాల భూమి ఉందని చెప్పారు. అంతే కాకుండా నందివాడ మండలంలో ఇలపర్రు, పోలుకొండ, అనమనపూడి, వెన్ననపూడి, కుదరవల్లి గ్రామాల్లో ఉన్న సుమారు ఐదు వేల ఎకరాలు భూస్వాముల చేతిలో ఉందని వాటిపై కూడా తాము పోరాటం చేయనున్నట్లు తెలిపారు. అరెస్టు అయిన వారిలో సీపీఎం గుడివాడ డివిజన్ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డిలతో పాటు మురాల రాజేష్, సీఐటీయూయు నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ నాయకుడు ఆర్‌కే, వ్యసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి కొండా వీరాస్వామిలతో పాటుగూడపాటి ప్రకాష్‌బాబు, దగాని సంగీతరావు ఉన్నారు.
దళితులపై లాఠీచార్జి దారుణం : భూమి కోసం ఉద్యమిస్తున్న దళితులపై లాఠీచార్జి దారుణమని సీపీఎం పశ్చిమ కృష్ణా కమిటీ కార్యదర్శి డీవీ కృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వంద మందిని అరెస్టు చేయటంపై నిరసన వ్యక్తం చేశారు. దళితులకే చెందిన భూములని ప్రభుత్వ ఇచ్చిన ఉత్తర్వులను ఏళ్ల తరబడి అమలు చేయకుండా భూస్వాములు ఆ భూమిని అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావుతో పాటు సీపీఐ, ఇతర ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. --సీపీఎం
ఆందోళనకారులపై లాఠీచార్జి: బైఠాయించిన ఆందోళనకారులపై డీఎస్పీ అంకినీడు ప్రసాద్ పర్యవేక్షణలో పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు చితక బాదారు. మహిళలు అత్యధిక సంఖ్యలో ఉండగా వారిని కూడా మగ పోలీసులతో ఊడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. మహిళల జాకెట్లు ,చీరలు చిరిగి పోయాయి. పోలీసు లాఠీచార్జిలో సీపీఎం తూర్పు కృష్ణా కార్యదర్శి ఆర్.రఘు, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మాదాల వెంకటేశ్వరరావులకు లాఠీదెబ్బలు తగిలాయి. ఆందోళనకారులను అరెస్టు చేసి గుడివాడ పట్టణంలోని వన్‌టౌన్, పెదపారుపూడి, పామర్రు పోలీసు స్టేషన్లకు తరలించారు.
వనజను ఈడ్చుకెళ్లి..
దళితులకు మద్దతు తెలిపిన సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజపై పిడిగుద్దులు కురిపిం చారు. బూటుకాళ్లతో తన్నుతూ తీసుకెళ్లారు. విచక్షణా రహితంగా లాఠీచార్జి చేస్తూ ఈడ్చుకెళ్లారు.
ఇలపర్రు దళితులపై పోలీస్ జులుం
Published Tue, Feb 28 2017 4:02 PM | Last Updated on Wed, Aug 29 2018 9:12 PM
Advertisement