
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఆయన గారి ప్రభ దేదీప్యమానంగా వెలిగిపోయింది. వెనువెంటనే పదోన్నతిపై డీఎస్పీ పోస్టింగ్ పట్టేశారు. అంతటితో ఆగడం ఆయనగారికి ఇష్టం లేనట్లు ఉంది. జిల్లా అంతటా తన ‘ముద్ర’ కావాలనుకున్నారు. కీలకమైన నిఘా విభాగానికి బాస్‌గా నియామకం వేయించుకున్నారు. ఇక అక్కడి నుంచి తన ఆపరేషన్ మొదలెట్టారు. ముందుగా జిల్లాపై పట్టుకు నడుం బిగించారు. కీలకమైన స్టేషన్లలో సీఐలు, ఎస్‌ఐలుగా తనవారు ఉండే విధంగా పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు. నిఘా విభాగానికి బాస్ కావడం ఆయనకు బాగా ‘కలిసి’ వచ్చింది. కంచే చేను మేసిన చందాన.. ఎర్రచందనం, ఇసుక, మద్యం, క్వారీ స్మగ్లర్ల నుంచి భారీ స్థాయిలో వెనకేసుకున్నారనే ఆరోపణలు పోలీస్ సర్కిల్స్‌లో జోరుగా నడుస్తోంది. ఈ ఏడాది తిరుమలకు బదిలీ చేసినా ఉన్నతస్థాయిలో పైరవీ చేయించుకొని నిలుపుదల చేయించుకున్నారు.
దోపిడీ పర్వానికి తెరలేపిన అస్మదీయులు..
నిఘా బాస్ అండదండలు ఉన్న పోలీస్ అధికారులు జిల్లాలో చెలరేగుతున్నారు. స్టేషన్ల వేదికగా దోపిడీ పర్వానికి తెరదీశారు. వసూలు చేసిన మొత్తంలో నెలవారీ బాస్‌కు కప్పం కడుతున్నారు.
ఇదే సబ్‌డివిజన్ పరిధిలో మరో కీలకమైన పట్టణానికి చెందిన ఎస్‌ఐ స్టేషన్ ను అవినీతి నిలయంగా మార్చేశారు. సెటిల్మెంట్లలో రాటుదేలిన ఈ ఎస్‌ఐగారు గత నాలుగేళ్లుపైగా ఒకే స్టేషన్ లో కొనసాగడానికి నిఘా బాస్ అండదండలే కారణమని సమాచారం.
ఇంతకుమునుపు మదనపల్లి తాలూకా సీఐగా పనిచేసిన అధికారి...నిఘా బాస్ అండదండలతో చెలరేగిపోయా రు. ఆయనతో పాటు అదే పట్టణంలో వన్‌టౌన్ ఎస్‌ఐ కూడా బాస్ కోటరీకి చెందిన వ్యక్తి కావడంతో వసూళ్లకు గేట్లు ఎత్తేశారు. ఇసుక అక్రమ రవాణాకు ఏకంగా గాంధీపురం ఏరియాలో స్మగ్లర్లను నియమించుకున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్లు సొంతంగా బినామీ పేర్లతో కొనుగోలు చేసి ఇసుకను బెంగుళూరుకు తరలించి రూ. కోట్లకు పడగలెత్తారు. ఇటీవలే వీళ్లు ఇద్దరూ బది లీ కావడంతో మదనపల్లి ఊపిరిపీల్చుకుంది.
మదనపల్లి సబ్‌డివిజన్‌లో పనిచేస్తున్న నిఘా విభాగం సిబ్బంది సైతం రూ.కోట్లకు పడగలెత్తారు. మదనపల్లి పట్టణంలో హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, ఇంటిస్థలాలను బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. నిఘాబాస్ అస్మదీయులు కావడంతోనే విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నా ఉన్నతాధికారులు చేష్టలుడిగి చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు.
అధికార పార్టీకి తలలో నాలుక...
జిల్లాలో పడమట మండలాల్లో పార్టీని బలోపేతంచేసే బాధ్యతను తలకెత్తుకున్న బాస్ అందుకు తగ్గట్టుగా పోలీస్‌శాఖను వినియోగించుకుంటున్నారు. టీడీపీకి సానూభూతిపరుడైన సీఐని ఏరికోరి పడమర మండలాల్లో కీలకమైన నియోజకవర్గానికి నియమించుకున్నారు. ఈయన సహకారంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులపై కేసులు నమోదుచేసి భయభ్రాంతులకు గురి చేయడం స్కెచ్‌లో భాగం. అందుకు అనుగుణంగానే సదరు సీఐ వ్యవహరిస్తున్నారు. ఇటీవల యువనేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై జులుం ప్రదర్శిం చారు.
తిరుపతి పుణ్యక్షేత్రాల పరిధిలో పనిచేస్తున్న అత్యంత వివాదాస్పద ఎస్‌ఐను ఇటీవలే సత్యవేడు నియోజకవర్గంలోని ఒక మండాలనికి పోస్టింగ్ ఇప్పించారు. ప్రతిపక్ష పార్టీలపై దూకుడు స్వభావం ప్రదర్శించే ఎస్‌ఐను ఏరికోరి నిఘా బాస్ పొస్టింగ్ వే యించినట్లు సమాచారం. వచ్చీరావడంతోనే ప్రతిపక్షాలపై కన్నెర్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన పోలీస్‌శాఖ పట్టుతప్పుతుందనే విమర్శలు ఉన్నాయి. ఒక అధికారి స్వార్థ ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి పోలీసులు ఏర్పరుచుకున్న నమ్మకం సడలుతోంది. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలోని పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment