
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమించిన వారిపై నమోదైన అన్ని కేసులను ప్రభుత్వం ఉపసంహరించింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఆర్.ఎం. కిశోర్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఆందోళన చేసిన వేలాది మందిపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ప్రత్యేక హోదా పోరాటాలకు సంబంధించి కేసుల్లో ఉన్న నిందితులందరిపై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకునేలా పిటిషన్ దాఖలు చేయాలని సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సూచించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. దీంతో ఉద్యమకారులపై జిల్లాల వారీగా ఎన్ని కేసులు నమోదయ్యాయనే వివరాలను సేకరించే పనిలో పోలీసు శాఖ నిమగ్నమైంది.